మూసీ.. థేమ్స్​ నది అయ్యేనా?

మూసీ.. థేమ్స్​ నది అయ్యేనా?

మూసీ నది పునర్వైభవం సాధించాలంటే రాజకీయ చిత్తశుద్ధి అవసరం ఉన్నదని ఏనాటినుంచో పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి ఒకే నెలలో అనేకసార్లు దానిని ప్రస్తావించారు. మూసీ నది పునరుజ్జీవనం తమ ప్రభుత్వ లక్ష్యంగా ప్రకటించారు. లండన్​లో థేమ్స్​ ​నదిని సందర్శించారు. దుబాయిలో, హైదరాబాద్​లో మూసీ నది పునరుజ్జీవనం గురించి సమావేశాలు జరిపారు. కానీ, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన టెండర్ డాక్యుమెంట్ చూస్తే ఏమీ తేడా లేదు. ఇదివరకు ప్రతిపాదనలకు, ప్రస్తుత ఆలోచనల మధ్య కొంతమేరకు తేడా ఉన్నా ప్రధాన లక్ష్యం మాత్రం మారలేదు.  

ప్రస్తుత ‘టెండర్’ ఆలోచనల ప్రకారం మూసీ నది పునరుద్ధరించడానికి దాదాపు రూ.58 వేల కోట్ల పెట్టుబడి కావాలి.  కేవలం 36 నెలలలో ఈ పెట్టుబడి ద్వారా ఐదు లక్ష్యాలు సాధించాలనుకుంటున్నారు. నిరంతర నీటి ప్రవాహం (నీటి నిర్వహణ), నది వెంబడి రవాణా మార్గాలు, పునరావాసం ద్వారా కబ్జాల నుంచి విముక్తి, నగర అభివృద్ధి ప్రణాళిక,  నది ఒడ్డున ఆహ్లాదకర వాతావరణ సృష్టి. ఈ పెట్టుబడితో ప్రకటించిన కాల వ్యవధిలో ఈ లక్ష్యాలను సాధించడం దాదాపు అసాధ్యం. ఫిబ్రవరిలో  ప్రకటించిన మధ్యంతర బడ్జెట్లో ఈ పథకానికి రూ.1000 కోట్లు ప్రకటించారు. ఈ మొత్తం ప్రణాళిక రచన ఖర్చులకే సరిపోదు. 

మూసీ నది పూర్తిగా తెలంగాణా నది. ఈ నది పరీవాహక ప్రాంతంలో దాదాపు 2 కోట్ల మంది జీవిస్తున్నారు. అయితే ఈ జనాభా నీటి అవసరాలు తీర్చే స్థోమత ఈ నది కోల్పోయింది.  గత 30 యేండ్ల నుంచి కృష్ణా నది, మంజీరా నది, ఇప్పుడు గోదావరి నది నుంచి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి నీళ్ళు తెస్తున్నారు. అయినా కూడా ఇవి 30 నుంచి 40 శాతం మాత్రమే. ఈ 40 శాతం నీళ్ల కోసం పెట్టాలని భావిస్తున్న పెట్టుబడి మూసీ నది మీద పెడితే ఇక్కడి నీళ్లు ఇక్కడే వాడుకోవచ్చు. హిమాయత్​ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు దాదాపు 8 టీఎంసీల నీళ్లు అందించగలవు. ఈ జంట జలాశయాల మీద గత 30 ఏండ్లలో ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి శూన్యం.

దాదాపు 100 యేండ్ల నుంచి ఉన్న వ్యవస్థ మీద అదనపు పెట్టుబడి అవసరం చాలా తక్కువ. వాటి నిర్వహణ చేయడం లేదు.  10 టీఎంసీలు నిలువ చేసే కేశవాపురం రిజర్వాయర్ మీద రూ.7 వేల కోట్లు పెట్టడానికి గత ప్రభుత్వం సిద్ధపడింది. ఉన్న 8 టీఎంసీల నిలువ సామర్థ్యం స్థిరం చేయడానికి రూ.50 కోట్లు పెట్టడానికి తెలంగాణా ప్రభుత్వం ఆలోచన కూడా చేయడం లేదు.  నగరానికి ప్రస్తుతం 37 టీఎంసీల నీరు అవసరం కాగా 2072 నాటికి 71 టీఎంసీల నీరు అవసరమవుతుందని అంచనా. ఇదివరకటి ప్రభుత్వం మొత్తం 71 టీఎంసీల కాళేశ్వరం, సుంకిశాల ప్రాజెక్టుల ద్వారా గోదావరి నీళ్లు ఇస్తామని లక్ష్యంగా పెట్టుకున్నది. మూసీ నది పరీవాహక ప్రాంతంలో 71 టీఎంసీల నీళ్లు లేవా? హైదరాబాద్ నీటి కోసం ప్రణాళిక చేసిన గోదావరి ప్రాజెక్టుల మీద పెట్టుబడి ఎంత? అంతకంటే తక్కువ పెట్టుబడి మూసీ నది పరీవాహక ప్రాంతంలో పెడితే 100 టీఎంసీల నీళ్లు సులభంగా తీసుకోవచ్చు.

కృష్ణా బేసిన్​లో తీవ్ర నీటికొరత

కృష్ణానది పరీవాహక ప్రాంతం తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. వనరుల కేటాయింపు, వినియోగంపై అంతర్రాష్ట్ర విభేదాలు ఇప్పుడు కనపడుతున్నాయి. మున్ముందు అంతర జిల్లా పోటీగానూ మారవచ్చు. ఈ ప్రాంతంలో ఉన్న పట్టణాల మధ్య నీటి కోసం పోటీ తీవ్రతరం కానున్నది. తెలంగాణా రాష్ట్రంలోనే వివిధ జిల్లాల మధ్య నీటి సరఫరా, డిమాండ్ మధ్య భారీ వ్యత్యాసం ఉన్నది. హైదరాబాద్ కేంద్రంగా నీటి మీద రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు, తెలంగాణా ఏర్పడక ముందు, ఏర్పడిన తరువాత కూడా పెరుగుతూనే ఉన్నాయి.

ఈ పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు మాత్రం మొత్తం రాష్ట్ర  ప్రజానీకం మీద పడుతున్నా, నీటి సరఫరా కేవలం హైదరాబాద్ వాసుల కోసమే. నీటి ప్రాజెక్టులు, వాటికి పెట్టుబడులు, పైపులైన్లు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఊతం ఇస్తున్నాయి. అంటే, ప్రకృతి వనరు అయినా నీరు క్రమంగా కొన్ని ప్రాంతాలలో ఉన్న కొందరికే అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు ఉండడం శోచనీయం.  నీటిని, నీటి వనరులను కాపాడుకోవటం చాలా ముఖ్యం. ఈ దృక్పథం రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం లేదు. 

నీటి వనరులు కలుషితం 

హైదరాబాద్​ నగరంలో ప్రతి రోజు ఎన్ని కోట్ల లీటర్ల నీటి వినియోగం అవుతున్నదంటే.. సమాధానంగా అంచనాలు ఉన్నాయి. కానీ, ఖచ్చితమైన సమాచారం లేదు. హైదరాబాద్ జలమండలి సరఫరా చేసే 550 ఎంజీడీతో పాటు అంతకంటే ఎక్కువ భూగర్భ జలాల వినియోగం ఉన్నది. శాస్త్రీయంగా మంచి నీటి సరఫరాలో 80 శాతం మురుగు నీటిగా మారుతున్నది అని లెక్క కడుతారు. అదనంగా భూగర్భ జలాల ఉపయోగం, కమర్షియల్ మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలు కలిపితే రోజుకు దాదాపు 800  నుంచి 1000 ఎంజీడీ మురికి నీరుగా మారుతున్నది.

ఈ మొత్తం మురికి నీరు శుద్ధి చేయకపోవడంతో చెరువులలో,  కుంటలలో, చివరికి మూసీ నదిలో చేరి ఆయా ప్రాంతాలలో నీటి వనరులు అన్ని కలుషితం అయిపోయినాయి. చివరికి భూగర్భ జలాలు కూడా కలుషితం అయినాయి. మూసీ నదిలో మురికి నీరు మాత్రమే ప్రవహించే పరిస్థితి.  మూసీ నదిలో మురికి నీరు మాత్రమే ప్రవహించడం వల్ల నాగోలు తరువాత దాదాపు 40 గ్రామాలలో లక్ష ఎకరాల వ్యవసాయం మురికి నీటితో సతమతవుతున్నది. కొత్త ప్రభుత్వం మూసీ నది గురించిన ప్రకటించిన లక్ష్యాలలో కూడా వీరికి పరిష్కారం చెప్పలేదు. 

Also read : కామారెడ్డిలో సౌలత్​లు లేక పరేషాన్..ఇరుకు గదుల్లోనే ట్రీట్​మెంట్​

హైదరాబాద్​ నుంచే మూసీకి ముప్పు

మూసీ నది మొత్తం పొడవు దాదాపు 267 కిలోమీటర్లు. వికారాబాద్​జిల్లాలో పుట్టి హైదరాబాద్ నగరం మీదుగా వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది. గత 30 ఏండ్లలో మూసీ నదికి ముప్పు మొదలయ్యింది హైదరాబాద్ నగరం నుంచే. హైదరాబాద్ నగర అభివృద్ధి తీరుతెన్నులు మూసీ నదికి శాపంగా మారాయి. మూసీ నది నుంచి నగరానికి వరద వచ్చింది అని నిజాం ప్రభుత్వం 20 కిలోమీటర్ల మేర నది ఒడ్డున గోడలు కడితే, ఆధునిక ప్రభుత్వాలు ఇప్పుడు దాదాపు 60 కిలోమీటర్లు నదికి గోడలు కట్టి, అటు ఇటు రోడ్లు వేసి మూసీ నది ‘సుందరంగా’ మార్చుతం అంటున్నారు. కాళేశ్వరం నీరు హైదరాబాద్ నగరానికి రావడానికి కేవలం కరెంట్ ఖర్చు ఏడాదికి దాదాపు 5 వేల కోట్ల రూపాయలు అవుతున్నది. మూసీ నదిలో కృతిమ ప్రవాహం సృష్టించడానికి కనీసం పది వేల కోట్ల రూపాయలు అవ్వొచ్చు. ఇంత ఖర్చు అవసరమా?.  హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న చెరువులలో మురికి నీటిని ‘తీసివేస్తే’ తక్కువ ఖర్చుతో పదుల సంఖ్యలో ‘ట్యాంక్- ఫ్రంట్​’ ప్రదేశాల ఏర్పాటు  సాధ్యపడుతుంది. హైదరాబాద్ చుట్టూ అటవీ జోన్లు ఏర్పాటు చేస్తే చెట్లు కూడా ఆహ్లాదం ఇస్తాయి. 

మూసీ రక్షణ ప్రధాన లక్ష్యం కావాలి

మూసీ నదికి  పూర్వ వైభవం రావాలంటే మొత్తం పరీవాహక ప్రాంతం పరిగణనలోనికి తీసుకోవాలి. మూసీ పరీవాహక ప్రాంత రక్షణ ప్రధాన లక్ష్యం కావాలి. మూసీ నది పరీవాహక ప్రాంత అథారిటీ ఏర్పాటు చేసి దీర్ఘకాలిక ప్రణాళికలు తయారు చెయ్యాలి. ఈ ప్రణాళికల తయారీకి బయట నుంచి వచ్చే కంపెనీలు కాకుండా స్థానిక ప్రజల భాగస్వామ్యంతో తయారు చేయవచ్చు. మూసీ నది పరీవాహక ప్రాంత సంరక్షణకు తగిన శాసన వ్యవస్థ తీసుకురావాలి. అందులో భాగంగా సంస్థాగత వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. హైదరాబాద్ నగర అభివృద్ధి విధానాలలో మార్పులు తేవాలి. మూసీ నది పరీవాహక ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతాల మీద, పరిశ్రమల వ్యర్థాల మీద సమీక్ష చెయ్యాలి. లండన్​లోని థేమ్స్​ నదిని సందర్శించిన ముఖ్యమంత్రి, మన మూసీని కూడా అలా అభివృద్ధి చేయాలనే పట్టుదల ఆయనలో  పెరగడం మంచి పరిణామమే. కానీ మూడేండ్లలో  చెప్పిన విధంగా మూసీని అభివృద్ధి చేయగలరా అనేదే వేచి చూడాలి.

- డా. దొంతి నర్సింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​