హైదరాబాద్ సిటీకి పొంచి ఉన్న ఢిల్లీ తరహా ..పొల్యూషన్ ముప్పు!

హైదరాబాద్ సిటీకి పొంచి ఉన్న ఢిల్లీ తరహా ..పొల్యూషన్ ముప్పు!
  • గ్రేటర్ పరిధిలో భారీగా పెరిగిన వెహికల్స్ సంఖ్య
  •     2018–2023 మధ్య కాలంలో 20 లక్షల వెహికల్స్ రిజిస్ట్రేషన్​
  •     ఆరేళ్లలో 5 లక్షల కార్లు సిటీ రోడ్లపైకి.. 
  •     దేశంలో అత్యధిక వెహికల్స్ ఉన్న నగరాల్లో హైదరాబాద్​కు ఐదో స్థానం

హైదరాబాద్, వెలుగు :  దేశ రాజధాని ఢిల్లీ తరహాలో గ్రేటర్ హైదరాబాద్‌ సిటీకి తీవ్ర కాలుష్యం ముప్పు పొంచి ఉందంటూ పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. సిటీలో విపరీతంగా వాహనాలు పెరగడంతో  రాబోయే రోజుల్లో కాలుష్యంతో సిటిజన్లు తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉంది.

ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఏక్యూఐ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) దారుణం పడిపోయి స్కూళ్లు, ఆఫీసులు మూసేసి ఇంట్లో కూర్చొవాల్సిన పరిస్థితి నెలకొంది.  గ్రేటర్​హైదరాబాద్​ నగరంలోనూ కాలుష్య నివారణకు,  ట్రాఫిక్​జామ్‌ల నివారణకు సరైన చర్యలు తీసుకోకపోతే  అలాంటి పరిస్థితి వస్తుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

ఓన్ వెహికల్స్ @ 70 లక్షలు

హైదరాబాద్​ నగరంలో వ్యక్తిగత వాహనాల సంఖ్య 70 లక్షలకు చేరింది.  ఇందులో ద్విచక్ర వాహనాలు, ఫోర్​వీలర్లు ఉన్నాయి.  ప్రాంతీయ రవాణా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గ్రేటర్​పరిధిలో  హైదరాబాద్, మేడ్చల్,​ మల్కాజిగిరి, రంగారెడ్డి కలిపి వ్యక్తిగత వాహనాల సంఖ్య 70  లక్షలకు చేరినట్టు వెల్లడించారు.  ఇందులో బైక్​లు  56.9 లక్షలు, 14.1  లక్షల ఫోర్​వీలర్స్​ ఉన్నాయి.  నగరంలో  ఆటో రిక్షాలు 1.07 లక్షలు, 3.07 లక్షల గూడ్స్​వాహనాలు,  క్యాబ్‌లు మరో 90 వేలు వరకు ఉన్నాయి.  మొత్తం కలిపితే నగరంలో  77.4 లక్షల వాహనాలు ఉన్నట్టు అధికారులు లెక్కలు వెల్లడిస్తున్నాయి. 

కార్ల కొనుగోలుకే ఇంట్రెస్ట్ 

జంట నగరాల్లో వ్యక్తిగత వాహనాల విషయానికి వస్తే అధికశాతం మంది ద్విచక్రవాహనాల కంటే కారు కొనేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.  గత కొన్ని సంవత్సరాలుగా కార్ల సంఖ్య నగరంలో ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. 2017లో  నగరంలో 20 లక్షల కార్లు ఉండగా 2023 నాటికి 9.20 లక్షల కార్లు నగర రోడ్లపైకి వచ్చినట్టు ఆర్టీఎ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  

ఈ సంఖ్య మరికొద్ది రోజుల్లో మరో 15 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.   బైక్​ల సంఖ్య విషయానికి వస్తే 2017లో  39.54 లక్షలు ఉండగా 2023 నాటికి 56.9  లక్షలకు చేరింది.  2018 నుంచి 2023 నాటికి నగర రోడ్ల పైకి 20 లక్షల వ్యక్తిగత వాహనాలు వచ్చినట్టు చెబుతున్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల సంఖ్య 1.5  కోట్లు ఉండగా అందులో 50 శాతం వాహనాలు ఒక్క  గ్రేటర్​హైదరాబాద్​ పరిధిలోనే ఉన్నట్టు అధికారులు తెలిపారు.  దీంతో నగరంలో భారీగా పెరుగుతున్న కాలుష్యం, ట్రాఫిక్‌ జామ్‌ లాంటి సమస్యలకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుంది. 

కరోనా ఎఫెక్ట్..

కొవిడ్‌ మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడిన నగరవాసులు కొవిడ్​అనంతరం సొంత వాహనాల్లో ప్రయాణం చేసేందుకే ఎక్కువ మంది ఆసక్తి కనబరిచారు.  కొందరు అప్పు  చేసైనా కారు లేదా బైక్ కొన్నారు. పదేండ్ల కిందట హైదరాబాద్​ నగరంలో 20 లక్షల వాహనాలు మాత్రమే ఉండగా ఈ పదేళ్లలో 57 లక్షల వాహనాలు నగర రోడ్లపైకి వచ్చినట్టు ఆర్టీఎ అధికారులు తెలిపారు.  

ప్రస్తుతం నగర వాసులకు కారు అన్నది ఒక లగ్జరీ కాకుండా తప్పనిసరి అవసరంగా మారిందనడంలో సందేహం లేదు. గత ఆరేండ్లలో  కొత్తగా ఐదు లక్షల కార్లు నగర రోడ్లపైకి వచ్చినట్టు అధికారులు తెలిపారు.  ఈ కారణంగా కూడా నగరంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయినట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి

జంట నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం, ట్రాఫిక్​ సమస్యలు రాబోయే రోజుల్లో నగరానికి ప్రమాదకర సంకేతాలని పర్యావరణ వేత్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  వాహనాల సంఖ్య విషయంలో బెంగళూరు, చెన్నై, ముంబయ్, ఢిల్లీ  తర్వాత నగరం  ఐదో స్థానంలో ఉంది. అధికారులు లెక్కల ప్రకారం బెంగళూరు నగరంలో 1.1 కోట్లు ఉండగా,  ఢిల్లీలో 79 లక్షలు, 2021 నాటికి  చెన్నై  నగరంలో 60 లక్షల వాహనాలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి గ్రేటర్​ పరిధిలో వెహికల్స్ సంఖ్య


నం.    కేటగిరి    వెహికల్స్ సంఖ్య
1.    ఆటో రిక్షాలు    1,07,398
2.    కాంట్రాక్ట్​ క్యారేజీ    63,55
3.    ఈ‌‌ రిక్షా/ఈ కార్ట్​    40
4.    స్కూల్స్, కాలేజీ బస్సులు    15,181
5.    గూడ్స్​ క్యారియర్​    3,07,314
6.    మ్యాక్స్​ క్యాబ్​    17,185
7.    మోటార్​క్యాబ్​    73,817
8.    మోటార్​కార్​    14,19,167
9.    మోటార్​సైకిల్​    56,99,005
10.    ప్రైవేట్ సర్వీస్​వెహికల్స్     2,288
11.    స్టేజ్​క్యారియర్స్​    8,216
12.    ట్రాక్టర్​ అండ్​ట్రెయిలర్స్​    44,988
13.    ఇతర వాహనాలు    39,414