మార్కెట్లు ఢమాల్​!..సెన్సెక్స్​ 1,053 పాయింట్లు డౌన్​

మార్కెట్లు ఢమాల్​!..సెన్సెక్స్​ 1,053 పాయింట్లు డౌన్​
  •     సెన్సెక్స్​ 1,053 పాయింట్లు డౌన్​              
  •     330 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  •     ఇన్వెస్టర్లకు రూ. 8.50 లక్షల కోట్ల నష్టం
  •     33 శాతం పడిపోయిన జీ షేర్లు

ముంబై : మిడిల్​ఈస్ట్​లో​ పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈక్విటీ బెంచ్‌‌‌‌మార్క్ సెన్సెక్స్ మంగళవారం 1,053 పాయింట్లు పతనమై 71,000 స్థాయికి దిగువన ముగిసింది. దీంతో ఈక్విటీ ఇన్వెస్టర్లు రూ. 8.50 లక్షల కోట్ల మేర నష్టపోయారు. కార్పొరేట్ల క్వార్టర్లీ రిజల్ట్స్​ బాగాలేకపోవడంతో చాలా కౌంటర్లలో అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. దాదాపు 450 పాయింట్ల లాభాలతో ప్రారంభమైనప్పటికీ అమ్మకాల ఒత్తిడి కారణంగా ఇండెక్స్​లు తీవ్రంగా నష్టపోయాయి. సెన్సెక్స్​ ఇంట్రాడేలో కనిష్ట స్థాయి 70,234.55లకు చేరుకోగా, గరిష్టంగా 72,039.20 స్థాయి వరకు వెళ్లింది.

నిఫ్టీ  330.15 పాయింట్లు తగ్గి 21,241.65 వద్ద ముగిసింది. "అధిక వాల్యుయేషన్,  ఆదాయాల సీజన్‌‌‌‌లో మిశ్రమ ఫలితాలు వంటి కారణాల వల్ల ఎఫ్‌‌‌‌ఐఐలు షేర్లను అమ్ముతున్నారు. మిడిల్ఈస్ట్​,  ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలతో పాటు, ఇటీవలి ర్యాలీ నుంచి ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకున్నారు" అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. సెన్సెక్స్ సంస్థల్లో ఇండస్‌‌‌‌ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 6.13 శాతం పడిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎస్‌‌‌‌బీఐ 3.99 శాతం, హిందుస్థాన్ యూనిలీవర్ 3.82 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.41 శాతం

హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ 3.23 శాతం నష్టపోయాయి. అయితే, సన్ ఫార్మా, భారతీ ఎయిర్‌‌‌‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్  పవర్‌‌‌‌గ్రిడ్ 3.67 శాతం వరకు లాభాలతో ముగిశాయి. టీసీఎస్,  బజాజ్ ఫిన్‌‌‌‌సర్వ్ కూడా లాభపడ్డాయి. సోనీ తన ఇండియా యూనిట్‌‌‌‌ 10 బిలియన్ డాలర్ల విలీన ప్రతిపాదనను విరమించుకున్న తర్వాత జీ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ లిమిటెడ్ (జెడ్​ఈఈఎల్)​ షేర్లు మంగళవారం 33 శాతం వరకు తగ్గాయి. ఇదిలా ఉండగా, మూడో క్వార్టర్లో ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ మంగళవారం స్టాండెలోన్ నికర లాభం 4 శాతం పెరిగి రూ.6,071 కోట్లకు చేరుకుంది.

మిడ్‌‌‌‌క్యాప్ 2.95 శాతం పడిపోయి 37,247.84 వద్ద ముగిసింది.  మిడ్‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 2.79 శాతం తగ్గి 43,378.40 వద్ద స్థిరపడింది. హెల్త్‌‌‌‌కేర్ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాలపాలయ్యాయి. రియల్టీ, సేవల సూచీలు వరుసగా 5.46 శాతం, 4.06 శాతం క్షీణించాయి. మెటల్ 3.97 శాతం పడగా, చమురు, గ్యాస్ 3.96 శాతం,  ఎనర్జీ 3.70 శాతం తగ్గింది. కమోడిటీలు, ఎఫ్‌‌‌‌ఎంసీసీ, ఆర్థిక సేవలు,  క్యాపిటల్​ గూడ్స్​ వెనకబడి ఉన్నాయి. హెల్త్ కేర్ ఇండెక్స్ 1.02 శాతం పెరిగింది. ఆసియాలో హాంకాంగ్‌‌‌‌కు చెందిన హ్యాంగ్‌‌‌‌సెంగ్ 2.63 శాతం లాభపడగా, చైనా షాంఘై కాంపోజిట్ 0.52 శాతం పెరిగింది.

జపాన్‌‌‌‌కు చెందిన నిక్కీ 225 0.8 శాతం పడిపోయింది. యూరోపియన్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. యూఎస్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి.   గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ మంగళవారం బ్యారెల్‌‌‌‌కు 0.40 శాతం క్షీణించి 79.74 డాలర్లకు చేరుకుంది. ఫారిన్​ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్​ఐఐలు) శనివారం రూ. 545.58 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.