ఉప్పులు పప్పులు మస్తు పిరం.. భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు.. అల్లాడుతున్న పేదలు

ఉప్పులు పప్పులు  మస్తు పిరం.. భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు.. అల్లాడుతున్న పేదలు

 

  • 6 నెలల్లో 50 శాతం పెరిగిన రేట్లు 
  • క్వింటా బియ్యం 6 వేల నుంచి 7 వేలు
  • అల్లం కిలో రూ.200, ఎల్లిగడ్డ రూ.300
  • కూరగాయలూ కిలో రూ.80 పైనే
  • కిలో మటన్ రూ.వెయ్యి, కోడిగుడ్డు రూ.7 

వరంగల్, వెలుగు: రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఆరు నెలల వ్యవధిలో బియ్యం, పప్పులు, కూరగాయలు.. ఇలా ఏది చూసినా 50 శాతానికి పైగా పెరిగాయి. బియ్యం క్వింటాల్ రూ.6 వేల నుంచి 7 వేలు ఉన్నాయి. టమాట తప్ప, ఏ కూరగాయ తీసుకున్నా కిలో రూ.80 పైనే పలుకుతున్నాయి. నిన్నమొన్నటి దాకా రూ.5 ఉన్న కోడిగుడ్డు.. ఇప్పుడు రూ.7కు చేరింది. ఇలా పప్పు, ఉప్పు, చింతపండు, అల్లం, వెల్లుల్లి ఏది ముట్టుకున్నా అగ్గిమండుతున్నాయి. దీంతో పేదలు అల్లాడుతున్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువగా ఉండడంతో ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెరిగి.. ఆ ప్రభావం వస్తువుల రేట్లపై పడుతోందని వ్యాపారులు అంటున్నారు. 

కందిపప్పు, పెసరపప్పు మొన్నటివరకు కిలో రూ.110 వరకు ఉండగా ఇప్పుడు రూ.180కి చేరాయి. నువ్వులు కిలో రూ.300 దాటాయి. పల్లినూనె రేట్లు కిలో రూ.160కి తక్కువ లేవు. విజయ పల్లి నూనె రూ.190 పలుకుతోంది. సన్​ఫ్లవర్​ఆయిల్ రేట్లు రూ.115 నుంచి రూ.120, పామాయిల్​రేట్లు రూ.90 నుంచి రూ.100 వరకు ఉన్నాయి. సంక్రాంతి నాటికి వీటి రేట్లు మరో రూ.10 నుంచి రూ.20 దాకా పెరిగే  అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక అల్లం కిలో రూ.200 దాటగా, ఎల్లిగడ్డ కిలో రూ.300 దాకా అమ్ముతున్నారు. ఏడాది కింద క్వింటాల్​బియ్యం రూ.4,500 నుంచి రూ.5 వేల మధ్య ఉండగా.. ఇప్పుడు రూ.6 వేల నుంచి రూ.7 వేల దాకా అమ్ముతున్నారు. గడిచిన రెండు వారాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా బియ్యం రేట్లను సగటున రూ.600 నుంచి రూ.800 దాకా పెంచేశారు. జైశ్రీరాం, హెచ్​ఎంటీ పాత రకాలను రూ.7,200 నుంచి రూ.7,400 దాకా అమ్ముతున్నారు. బియ్యం రేట్లను వ్యాపారులు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారు. గతంలో బియ్యం రేట్లపై సర్కార్ నియంత్రణ ఉండేది. మిల్లులకు ఫుడ్​గ్రెయిన్​ లైసెన్సులు జారీ చేసి, మన అవసరాలకు మించి స్టాక్​ ఉన్నప్పుడే ఎగుమతులకు  అనుమతులు ఇచ్చేవారు. బియ్యం రేట్ల నియంత్రణకు కలెక్టర్, సివిల్​సప్లై ఆఫీసర్ల​ నేతృత్వంలో కమిటీలు ఉండేవి. కానీ గత బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో ఈ కమిటీలన్నీ నిర్వీర్యమయ్యాయి. ఈ క్రమంలోనే  మిల్లర్లంతా సిండికేట్​ గా మారి, ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేస్తున్నారు.

మండుతున్న కూరగాయలు.. 

వరంగల్​లోని హనుమకొండ బాలసముద్రం కూరగాయల మార్కెట్​ఉత్తర తెలంగాణలోనే ఫేమస్. ట్రై సిటీ జనం ఇక్కడే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. మంగళవారం ఇక్కడ ఒకట్రెండు కూరగాయలు తప్ప.. మిగతావన్నీ కిలో రూ.80 పైనే పలికాయి. ఒక్క టమాట, క్యాబేజీ మాత్రమే కిలో రూ.40 లోపు ఉన్నాయి. బెండకాయ, దొండకాయ, చిక్కుడు, బీరకాయ, గోరుచిక్కుడు, వంకాయ, పులగంద, క్యాప్సికం రేట్లు కిలో రూ.80 పైనే ఉన్నాయి. రూ.10కి వచ్చే దేశవాలీ సోరకాయకు ఇప్పుడు రూ.50 చెప్తున్నారు. రూ.5కు దొరికే  మునక్కాయ ఇప్పుడు రూ.10 అయింది. ఎండాకాలంలో కూరగాయల రేట్లు పెరగడం కామన్.​. కానీ చలికాలంలోనూ ఇలా రేట్లు పెరగడంతో జనం అల్లాడుతున్నారు. కాగా, కూరగాయలతో పాటు నాన్ వెజ్ రేట్లూ భారీగా పెరిగాయి. చాలాచోట్ల​కిలో మటన్​రూ.వెయ్యి చొప్పున అమ్ముతున్నారు. కోడిగుడ్డు రేటు కూడా రూ.7కు చేరింది.  

జీతం ఏ మూలకూ చాలట్లే.. 

సిటీలో కాయకష్టం చేసుకుందామని వచ్చినోళ్లు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నోళ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. వచ్చే జీతం కంటే ఇల్లు గడవడానికే ఎక్కువ ఖర్చవుతోంది. ఇంట్లో నలుగురు వ్యక్తులుంటే తక్కువలో తక్కువ తిండికి రోజుకు రూ.400 ఖర్చవుతోంది. ఈ లెక్కన నెలకు రూ.12 వేలు తిండికే పోతున్నది. చిరుద్యోగుల జీతం రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకే ఉంటుంది. అలాంటప్పుడు మిగతా ఖర్చులన్నీ ఎలా అని వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేయాల్సి వస్తున్నదని ఆవేదన చెందుతున్నారు.  

నెలకు నాలుగైదు వేల అప్పయితంది

మాది భూపాలపల్లి జిల్లా చిట్యాల. హనుమకొండ సిటీలో కిరాయికి ఉంట. మెకానిక్ గా పని చేస్త. గిరాకీ ఉంటే రోజుకు ఖర్చులన్నీ పోను రూ.500 మిగులుతయ్. నెలకు నాలుగైదు రోజులు షాపు నడ్వదు. మొత్తంగా నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేలు దాటదు. మొన్నటి వరకు కిలో రూ.30–40 ఉన్న కూరగాయలు ఇప్పుడు రూ.80–100 అంటున్రు. ఈ లెక్కన నా నెల సంపాదన కేవలం తిండికే పోతున్నది. ఇక ఇంటి కిరాయి, సామాను, రోజువారి ఖర్చుల కోసం నెలకు మళ్లీ ఐదారు వేలు అప్పు చేస్తున్న.   
– భిక్షపతి, హనుమకొండ 

కూరగాయలు దొర్కుతలేవ్.. 

మేం వరంగల్ హోల్ సేల్ మార్కెట్ నుంచి తెచ్చి కూరగాయలు అమ్ముతం. ఇప్పుడక్కడికి పోతే పది రకాల కూరగాయల దొరికేకాడ నాలుగైదు రకాలే దొరుకుతున్నయ్. మొన్నటివరకు రూ.500 దొరికిన పెట్టెను ఇప్పుడు రూ.వెయ్యికి కూడా ఇయ్యమంటున్రు. తుఫాన్​తో పంటలు పోయాయని ఉన్న వాటికే మస్త్ పిరం చెబుతున్నరు. 
– సంపత్, కూరగాయల వ్యాపారి