ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

కూసుమంచి, వెలుగు: పాలేరు నియోజకవర్గంలోని 170 మంది వీఆర్ఏలకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్​రెడ్డి రూ.5లక్షలతో సోమవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.  గత కొంతకాలంగా సమ్మె చేసిన వీఆర్​ఏలకు వేతనాలకు ఇబ్బంది పడుతుండటంతో కూసుమంచిలోని క్యాంపు ఆఫీసులో వీటిని అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్​నాయక్​, డీసీసీబీ డైరెక్టర్​ ఇంటూరి శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్​ బాలకృష్ణారెడ్డి, రాంకుమార్, తెరాస మండల కార్యదర్శి ఎండీ ఆసీఫ్​పాషా పాల్గొన్నారు.

రూల్స్​ ప్రకారమే టోల్ వసూళ్లు

ఖమ్మం, వెలుగు: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్​ ప్రకారమే ఖమ్మం– సూర్యాపేట హైవే(365బీబీ)పై టోల్ ఫీజు వసూలు చేస్తున్నామని ప్రాజెక్టు డైరెక్టర్​దుర్గాప్రసాద్​ అన్నారు. ఈనెల 22న 'పనులు కాకుండానే పైసా వసూలు' పేరుతో 'వీ6వెలుగు’ పేపర్​లో ప్రచురించిన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. మొత్తం 58.626  కిలోమీటర్లకు 54.536 నిర్మాణం పూర్తవడంతో రూల్స్ ప్రకారం ప్రొవిజనల్​ సర్టిఫికెట్ ఆఫ్ కంప్లీషన్​ జారీ చేశామన్నారు. 93 శాతం వర్క్​ కంప్లీట్ అయిందని, తల్లంపాడు, అగ్రహారం, రాఘవాపురం సమీపంలో పెండింగ్ ఉన్న 4.09 కిలోమీటర్లను ఈ ఏడాది డిసెంబర్​ 22 నాటికి కంప్లీట్ అవుతుందని తెలిపారు. అగ్రిమెంట్ ప్రకారం రెండు హైవేలు ఎన్​హెచ్​365బీబీ, ఎన్​హెచ్​ 65 కలిసే చోట ఎట్ గ్రేడ్​ ఇంటర్​ సెక్షన్స్​ ఏర్పాటు చేశామని చెప్పారు. సేఫ్టీ మెజర్ మెంట్స్​లో భాగంగా అక్కడ 4 లేన్​ రోడ్లను అదనంగా నిర్మించామని, వాహనదారులకు రోడ్డు కనిపించేందుకు హైమాస్ట్  లైట్లు, మెటల్ బీమ్​ క్రాష్ బ్యారియర్స్​ ఏర్పాటు చేశామని దుర్గాప్రసాద్​ వివరించారు. 

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

పెనుబల్లి, వెలుగు: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు చనిపోయాడు.  పోలీసుల వివరాల ప్రకారం..  పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామానికి చెందిన ఈడా సాంబశివరావు (34)  ఆదివారం రాత్రి అదే గ్రామానికి చెందిన కేతవరపు కృష్ణతో కలిసి కొత్తగూడెం నుంచి బైక్​పై  ఇంటికి వెళుతున్నాడు. ఎర్రగుంట గ్రామంలో రైల్వే క్రాసింగ్​ వద్దకు రాగానే మందు కావాలంటూ సాంబశివరావు బైక్​ దిగి వెళ్లిపోయాడు. అతడిని పిలిచినా రాకపోవడంతో కృష్ణ గ్రామానికి వెళ్లి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు. ఎర్రగుంట నుంచి వీఎం బంజర్​వైపు రాంగ్​రూట్​లో రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా సాంబశివరావును గౌరారం టోల్​ప్లాజా సమీపంలో గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. సోమవారం తెల్లవారుజామున వాహనదారులు టోల్​ప్లాజా లో సమాచారమివ్వడంతో హైవే అంబులెన్స్​లో పెనుబల్లి ఏరియా హాస్పిటల్​కు తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సూరజ్​ తెలిపారు.

భూమిని లాక్కున్నారంటూ..సెల్​టవర్​ ఎక్కిన రైతు 

మణుగూరు, వెలుగు: మణుగూరు మండలం రామానుజవరం గ్రామంలో ఓ రైతు సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. గ్రామానికి చెందిన బొడ్డు వీరస్వామి అనే రైతుకు చెందిన రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిని రెవెన్యూ ఆఫీసర్లు లాక్కున్నారు అంటూ మంగళవారం ఆందోళన చేశాడు. గత 40 ఏండ్లుగా ఆ భూమిని నమ్ముకుని జీవిస్తున్నామని, ఇప్పుడు రైల్వేలైన్ నిర్వాసితులకు ఇండ్లు కట్టించేందుకు భూమిని లాక్కొని తమ కుటుంబానికి అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమి తనకి ఇవ్వకుంటే సూసైడ్​ చేసుకోవడం తప్ప గత్యంతరం లేదని విలపించాడు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని రెవిన్యూ, పోలీసులు హామీ ఇవ్వడంతో సెల్ టవర్ దిగాడు. దీనిపై తహసీల్దార్ నాగరాజును వివరణ కోరగా అది  ప్రభుత్వ భూమి అని, దానిపై అతనికి ఎలాంటి హక్కులు లేవని రైల్వే లైన్ భూ నిర్వాసితులకు ఇండ్లు కట్టించేందుకు కేటాయించినట్లు తెలిపారు.

దళితబంధుతో ఆర్థికంగా బలోపేతం కావాలి

ఖమ్మం టౌన్, వెలుగు: దళితబంధు యూనిట్లతో దళితులు ఆర్థికంగా బలోపేతమవడంతోపాటు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా అధికారులు మార్గదర్శనం చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోపంచాయతీ ప్రత్యేక అధికారులతో చింతకాని మండలంలో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్, నిర్వహణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ, పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన చింతకాని మండలంలో వందశాతం యూనిట్ల గ్రౌండింగ్ కు చర్యలు చేపట్టామన్నారు. 3,456 మంది లబ్ధిదారులకు గానూ ఇప్పటివరకు 2,195 యూనిట్లు గ్రౌండింగ్ చేసినట్లు, 514 యూనిట్లకు పర్మిషన్​ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, జిల్లా ఫారెస్ట్​ఆఫీసర్​సిద్దార్థ్ విక్రమ్ సింగ్, , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు , ఇతర అధికారులు పాల్గొన్నారు .

పాల్వంచలో రూ.23 లక్షల గంజాయి పట్టివేత

పాల్వంచ, వెలుగు: ఒడిశా నుంచి సూర్యాపేటకు కారులో తరలిస్తున్న 116 కిలోల గంజాయిని పాల్వంచ పోలీసులు పట్టుకున్నారు.  సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... ఎస్ఐలు కె.నరేశ్, జి.ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో సోమవారం రాత్రి స్థానిక జీసీసీ గోడౌన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో గంజాయిని  తరలిస్తున్న కారును గుర్తించి తనిఖీ చేశారు. రూ.23 లక్షల విలువ చేసే ఈ గంజాయి ఒడిశాలో కొనుగోలు చేసి సూర్యాపేట జిల్లాకు తరలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో చివ్వెంల మండలం పండు నాయక్ తండాకు చెందిన  దారావత్ వంశీ నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి కారు, గంజాయి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని మంగళవారం రాత్రి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ మీడియాకు తెలిపారు. 

కేటీపీఎస్​లో జాబ్​ పేరుతో మోసం

యూనియన్ లీడర్ పై పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు

ఖైరతాబాద్, వెలుగు: కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్​(కేటీపీఎస్)లో జాబ్​ఇప్పిస్తానని డబ్బు తీసుకొని మోసం చేసిన కేటీపీఎస్ యూనియన్ లీడర్ వజీర్ పై హైదరాబాద్​పంజాగుట్ట పోలీస్ స్టేషన్​లో కేసు నమోదయింది. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచకు చెందిన శ్రీధర్ 1999 నుంచి 2000 వరకు కేటీపీఎస్ V స్టేజ్ లో క్యాజువల్ లేబర్ పనిచేశాడు. శ్రీధర్​తండ్రి రాజయ్య కేటీపీఎస్​లో సెక్యూరిటీ ఆఫీసర్​గా పనిచేశాడు. ఈ క్రమంలో కేటీపీఎస్ 1535 కార్మిక సంఘం  నాయకుడిగా ఉన్న ఎంఏ వజీర్ కు రాజయ్యకు పరిచయమేర్పడింది. కేటీపీఎస్​లో జూనియర్ ప్లాంట్ అటెండెంట్ పోస్టు శ్రీధర్​కు ఇప్పిస్తానని, అందుకు రూ.6లక్షలు ఇవ్వాలని రాజయ్యకు చెప్పాడు. అతని మాటలు నమ్మిన రాజయ్య, శ్రీధర్​2010 నుంచి 2015 వరకు మూడు దఫాలుగా డబ్బు చెల్లించారు. జాబ్ ఇప్పించకుండా జాప్యం చేస్తుండటంతో
 పలుమార్లు ప్రశ్నించినా వజీర్​పట్టించుకోలేదు. డబ్బులు తిరిగి ఇచ్చేది లేదని, ఎక్కడైనా చెబితే తీవ్రపరిణామాలు ఉంటాయని శ్రీధర్​ను బెదిరించాడు. దీంతో మోసపోయామని భావించిన బాధితుడు శ్రీధర్​ఈ నెల19న పంజాగుట్ట పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

గంజాయి మత్తులో యువకుడి హత్య 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గంజాయి మత్తులో ఇద్దరి యువకుల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణం తీసింది. కొత్తగూడెం పట్టణానికి చెందిన బి. సందీప్​(23) జగడం సాయి  సోమవారం గంజాయి తాగి ఊరంతా బైక్​పై ఊరంతా తిరిగారు. చివరకు సిగరేట్​ కొన్న దగ్గర వీరిద్దరికి చిన్న గొడవ జరిగింది. గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు కొట్టుకున్నారు. ఈక్రమంలోనే సాయి అక్కడే ఉన్న సిమెంట్​ ఇటుకతో సందీప్​ తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సందీప్​ను సమీపంలోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం  కొత్తగూడెంలోని గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించారు.

కూల్​డ్రింక్​లో  పురుగులు 

ఇల్లందు, వెలుగు: ఇల్లందుకు చెందిన జార్జ్​గోపి సోమవారం తన పిల్లలకు కూల్​డ్రింక్​తాగించేందుకు కిరాణ షాపుకు వెళ్లాడు. కూల్​డ్రింక్​కొని తాగుతుండగా బాటిల్​అడుగుభాగంలో అందులో పురుగులు కనిపించాయి. కంగారుపడిన అతడు చిన్నారులను హుటాహుటిన పట్టణంలోని ప్రైవేట్​ హాస్పిటల్​కు తరలించారు. చిన్నారులు ఇద్దరు క్షేమంగా ఉండటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

బాత్రూంలో గర్భిణి డెలివరీ

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పట్టణం రామవరంలోని గవర్నమెంట్ హాస్పిటల్​లో డెలివరీకి వచ్చిన ఓ గర్భిణి బాత్రూంలో ప్రసవించింది. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని ఫ్యూన్ బస్తీకి చెందిన స్వప్న డెలివరీ కోసం ఉదయం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సాయంత్రం నొప్పులు వస్తున్నాయని కుటుంబ సభ్యులు డాక్టర్లకు పలుమార్లు చెప్పినప్పటికీ వాళ్లు పట్టించుకోలేదు. కాగా ఆమె వాష్ రూమ్ కి వెళ్లగా బాత్రూంలోనే డెలివరీ అయ్యింది. ఈ విషయం సిబ్బందికి చెప్పడంతో డాక్టర్లు వచ్చి తల్లి బిడ్డలకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారని భర్త శేఖర్ వాపోయారు.

అంతరాలయంలో నిత్య కల్యాణం

భద్రాచలం, వెలుగు: రామాలయం అంతరాలయంలో శ్రీసీతారామచంద్రస్వామికి మంగళవారం నిత్య కల్యాణం జరిగింది. సూర్యగ్రహణం కారణంగా కేవలం రెండు జంటలే ఈ కల్యాణం చేయించుకునేందుకు టిక్కెట్లు తీసుకోవడంతో అంతరాలయంలోనే ఈ క్రతువును నిర్వహించారు. చిత్తా నక్షత్రం సందర్భంగా యాగశాలలో సుదర్శన హోమం భక్తి ప్రవత్తులతో చేశారు. సుదర్శన పెరుమాళ్​ను, శ్రీసీతారామచంద్రస్వామిని ఊరేగింపుగా మేళతాళాలతో యాగశాలకు తీసుకొచ్చారు. ప్రత్యేక అలంకరణ తర్వాత విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, సుదర్శన కలశ స్థాపన, హవనం, పూర్ణాహుతి, ఆశీర్వచనం ఇచ్చారు.  ఈ సందర్భంగా సుదర్శన స్వామికి ప్రసాదం నివేదన చేసి భక్తులకు పంపిణీ చేశారు. 

27న హుండీ లెక్కింపు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని ఈనెల 27న లెక్కించనున్నట్లు ఈవో శివాజీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు నిర్వహిస్తామని, సిబ్బంది సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు.

ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఆదివాసీల ప్రదర్శన

ములకలపల్లి, వెలుగు: ములకలపల్లి మండలం సీతారాంపురంలో సర్వేనెంబర్ 241లో 64 ఎకరాల ప్రభుత్వ భూమిని గిరిజనేతరులు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ ఆదివాసీలు ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో మండలంలోని ఆదివాసీలు పెద్దఎత్తున భూమి వద్దకు చేరుకొని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం గిరిజనేతరుల పేరిట పాస్ పుస్తకాల్లోని సర్వేనెంబర్241లో గల 64 ఎకరాల భూమి వేరో చోట ఉందని, దానికి బదులు ప్రభుత్వ భూమిని గిరిజనేతరులు అనుభవిస్తున్నారని, ఈ విషయమై ఇటీవల జరిపిన  సర్వేలో వెల్లడైందన్నారు. ఆ భూమిని నిరుపేద ఆదివాసీలకు పంపిణీ చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్​చేశారు. మరోవైపు తమ భూమిపైకి కొంతమంది వచ్చి దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఎండీ రఫీ అహ్మద్, ఆఫీజ్​అహ్మద్ స్తానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 

కేటీపీఎస్ పాత ప్లాంట్​కూల్చివేతకు టెండర్లు 

పాల్వంచ, వెలుగు: పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్( కేటీపీఎస్) పాత ప్లాంట్ కూల్చివేతకు జెన్కో అధికారులు టెండర్ల ప్రక్రియను తాజాగా పూర్తి చేశారు. ఈ కర్మాగారంలో ఉన్న భవనాలు కూల్చివేయడంతోపాటు విలువైన పరికరాలను అమ్మేందుకు ఇటీవల రూ.436 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. ఈ పనులు దక్కించుకునేందుకు ఐదు సంస్థలు పోటీ పడగా ముంబైకి చెందిన హెచ్ఆర్ కమర్షియల్ అనే సంస్థ రూ.480 కోట్లకు టెండర్​దక్కించుకుంది. జెన్కో పూర్తిస్థాయి బోర్డు మీటింగ్ నిర్వహించి సైట్ అప్పగింతపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.  

గుండెపోటుతో డ్రైవర్ మృతి

సత్తుపల్లి, వెలుగు: డ్యూటీలో ఉండగా గుండె పోటు రావడంతో బస్సు డ్రైవర్ చనిపోయాడు.  వివరాలిలా ఉన్నాయి.. సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న ఎస్కే ఖాజా (59) మంగళవారం ఉదయం డ్యూటీలో భాగంగా ఏలూరు వెళ్లాడు. ఏపీలోని చింతలపుడిలో సమీపంలో గుండెనొప్పి రావడంతో బస్సును పక్కకు ఆపి ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాడు. తర్వాత అంబులెన్స్ లో సత్తుపల్లికి తరలించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఖాజా 27ఏండ్లగా సత్తుపల్లి డిపోలో డ్రైవర్​గా పనిచేస్తున్నారు. వచ్చే మార్చిలో ఈయనకు రిటైర్మెంట్ ఉంది. ఖాజా మృతి పట్ల ఎమ్మెల్యే సండ్ర, డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి, యూనియన్ లీడర్లు సంతాపం తెలిపారు.

వివాహిత ఆత్మహత్య కేసులో  భర్త, అత్తకు జైలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:  వివాహిత ఆత్మహత్య కేసులో భర్తతో పాటు అత్తకు జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్​అసిస్టెంట్​ సెషన్స్​ జడ్జి జి.భానుమతి మంగళవారం తీర్పునిచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. 2014లో అశ్వాపురం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన షేక్​ రజాక్​ తన భార్య యాస్మిన్​ను అదనపు కట్నం తెమ్మంటూ తరచూ వేధించేవాడు. అతనితోపాటు తల్లి రహీమున్నీసా, తమ్ముడు నభి యాస్మిన్​ శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేసేవారు. ఏప్రిల్​16, 2014న యాస్మిన్​కిరోసిన్​ పోసుకుని సూసైడ్​చేసుకుంది. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేశారు. కోర్టులో సాక్షుల విచారణ అనంతరం యాస్మిన్​ భర్త రజాక్​, ఆయన తల్లి రహిమున్నీసా బేగానికి నాలుగేండ్ల జైలు శిక్ష, రూ. 4వేల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్​ తరఫున అదనపు పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ మీరజ్​ ఫిరదౌసి వాదించగా లైజన్​ ఆఫీసర్లుగా హరిగోపాల్​ వ్యవహరించారు.

అక్రమ సంబంధానికి తండ్రీ, కొడుకు బలి

రైలు కింద పడి సూసైడ్​

ఎర్రుపాలెం,వెలుగు: భార్య అక్రమ సంబంధం కారణంగా భర్త, కొడుకు బలి అయ్యారు. జీఆర్పీ  ఎస్ఐ భాస్కరరావు తెలిపిన వివరాలు ప్రకారం..  ఏపీ ఎన్టీఆర్​జిల్లా మైలవరం మండలకేంద్రానికి చెందిన తన్నీరు రామారావు(34) రేషన్ డీలర్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన రామారావు భార్యను మందలించాడు. అయినా ఆమె ప్రవర్తన మార్చుకోకపోవడంతో మంగళవారం కొడుకు గోపినంద్ ను తీసుకొని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల అప్ లైన్ లో వెళుతున్న గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరి డెడ్​బాడీలకు మధిర సివిల్ హాస్పిటల్​లో పంచనామా చేసి బంధువులకు అప్పగించనున్నట్లు జీఆర్పీ ఎస్ఐ తెలిపారు. 

తమ్ముడిని చంపిన అన్న

వైరా,వెలుగు: వివాహేతర సంబంధం ఓ ప్రాణాన్ని బలిగొంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తమ్ముడిని అన్న నరికి చంపాడు. వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన సాదం రామారావు(గ్రామ సర్పంచ్), సాదం రామకృష్ణ, సాదం నరేశ్(32) అన్నదమ్ములు. రామకృష్ణ, నరేశ్​ కుటుంబాలు తల్లి సుబ్బమ్మతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.

నరేశ్ భార్య కొంతకాలం కింద అతన్ని వదిలి వెళ్లింది. ఈక్రమంలో రెండు వారాల కింద రామకృష్ణ భార్యతో నరేశ్​సన్నిహితంగా ఉండడాన్ని చూశాడు. అప్పటి నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో రామకృష్ణ భార్య రాజమండ్రిలోని పుట్టింటికి వెళ్లింది. తల్లి సుబ్బమ్మ కూడా దీపావళికి కూతురు ఇంటికి వెళ్లింది. ఆదివారం రాత్రి అన్నదమ్ములు ఇద్దరూ కలిసి మందు తాగారు. సోమవారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న నరేశ్​ను లేపి నిన్ను చంపుతానురా అంటూ గొడ్డలితో అతనిపై రామకృష్ణ విచక్షణా రహితంగా దాడి చేశాడు. మెడపై తీవ్ర గాయమవడంతో నరేశ్​అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఏసీపీ రెహమాన్, సీఐ సురేశ్, ఎస్ఐ వీరప్రసాద్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవటం వల్లనే తమ్ముడిని చంపినట్లు రామకృష్ణ పోలీసులకు చెప్పాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.