నీతి లేని నువ్వు.. అసలు మనిషివే కాదు

నీతి లేని నువ్వు.. అసలు మనిషివే కాదు

ఒక్కసారి కలిసి భోజనం చేస్తేనే ఓ బంధం ఉంటుంది..అలాంటిది నీకు నీతి, జాతి, మానవత్వం లేదు..అసలు మనిషివే కాదంటూ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేత ఈటల రాజేందర్. వరంగల్ కమలాపూర్ మండలం దేశరాజ్ పల్లిలో పర్యటించారు. ఈ సంబర్భంగా ఈటల మాట్లాడారు.
18 ఏళ్లు నీతో తిరిగాను.. రైట్ హ్యాండ్ అన్నావు, లెఫ్ట్ హ్యాండన్నావు, తమ్ముడన్నావు.. ఒక్కరోజులోనే కానివాన్నయ్యానా? అసలు కథ వేరే ఉంది.. నీ కొడుకును సీఎంను చేసుకోవాలనుకున్నా.. నేను కాదన్నానా..? ఇతర పార్టీలోళ్లు.. ఈటలను ఎందుకు సీఎం చేయని జీవన్ రెడ్డి లాంటి వాళ్లు అడిగారు. నేను సీఎంను కావాలనుకుంటే తప్పు.. కానీ నేననలేదు. ప్రతపక్షాల వాళ్లు సీఎంగా నా పేరు అనగానే.. నీ పని ఇక్కడిదాకా వచ్చిందా అని నన్ను బయటకు పంపిండు. నేను ఎత్తులో చిన్న మనిషినే కావచ్చు.. చిచ్చర పిడుగును. కావాలంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేను మాట్లాడిన మాటలు వినండి అని అన్నారు ఈటల.

అంతేకాదు..జరిగబోయే ఎన్నికల్లో తాను గెలిచిన తర్వాత తెలంగాణ లో విప్లవం వస్తుందన్నారు ఈటల. నా ప్రజల ప్రేమను పొంది శెభాష్ అనిపించుకున్నోన్ని..నీ ముఖం టీవీలో చూసుడు తప్ప వీళ్లకు నీవు తెలుసా? అని ప్రశ్నించారు. 2014 వరకు ప్రజలను, ధర్మాన్ని, కష్టాన్ని నమ్ముకున్న కేసీఆర్.. అధికారం రాగానే డబ్బును, ప్రలోభాలను మాత్రమే నమ్ముకున్నాడని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్లు, బానిసలు, డబ్బులకు లొంగుతారని ఇప్పుటిదాకా లాక్కొచ్చాడన్నారు. ఇప్పుడు మనవంతు వచ్చింది.. ఆయన ముందు మోకరిల్లుదామా? బరిగీసి కొట్లాడుదామా? అని అన్నారు.

నేను ఉద్యమం చేయకుండానే, కష్టపడకుండానే నాకు బంగారం పల్లెంలో పెట్టి పదవులిచ్చారా? 78 గంటల పాటు ఉప్పల్ రైల్ పట్టాలపై పడుకోలేదా?.పదవిలో ఉన్నప్పుడు పనిచేసాను, ఉద్యమంలో పనిచేసాను అని చెప్పారు ఈటల. నా రాజీనామా తర్వాత ప్రజలకు నాలుగు వరాలు వస్తున్నాయి. ఫించన్లు, గొర్రెలు, రేషన్ కార్డులు, దళిత బంధు వస్తున్నాయంటే నేనే కారణమన్నారు. తాను గెలిస్తే ఇంకా ఎక్కువొస్తాయన్న ఈటల.. అడిగేవాడు లేకుంటే, కొట్లాడే వాడు లేకుంటే కేసీఆర్ అనేటోడు మనకు ఏమీ ఇవ్వడన్నారు. 

ఒక్క ఎకరం ఉన్నా ముక్కు నేలకు రాస్తానని.. లేకుంటే నీవు రాస్తావా అని సవాల్ చేస్తే కేసీఆర్ నుంచి  స్పందన రాలేదని తెలిపారు ఈటల. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాకు ఫోన్లు చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా వద్దన్నారు. మంత్రి పదవి తొలగించే అధికారం కేసీఆర్ తొలగించవచ్చు కానీ.. ప్రజలిచ్చిన ఎమ్మెల్యే పదవి వదిలేయవద్దన్నారు. కానీ వాళ్లు నన్ను ఛాలెంజ్ చేసారు. ఆఖరికి వినోద్ కుమార్ తో సహా అందరూ నన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేసారని తెలిపారు.

ప్రజల ప్రేమ లేకుంటే ఎంతటి గొప్ప బీఫారం ఇచ్చిన గెలవలేరన్నారు ఈటల. కేసీఆర్ ప్రతి నాయకునికి వెలగట్టి సిద్ధిపేటకు తీసుకెళ్లి కండువ కప్పిస్తున్నాడన్నారు. వాళ్ల పార్టీలో గెలిచినోళ్లనే కొనుగోలు చేసి మళ్లీ కండువా కప్పుతున్నారని చెప్పారు. నాయకులందరినీ సిద్ధిపేటకు తీసుకెళ్లి నన్ను తిట్టించి.. హరీశ్ తో కండువా కప్పించి పంపిస్తున్నారన్నారు. 13 ఏళ్ల క్రితం కొట్టుడు పోయిన కేసులను కూడా మళ్లీ బయటకు తీస్తున్నామని నాయకులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. గతంలో నక్సలైట్లకు అన్నం పెట్టారని..టీఆర్ఎస్ జెండా కప్పుకోకపోతే జైలుకు పంపిస్తామని ఇక్కడి నాయకులను పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. ఈ 19 ఏళ్లలో నేను ఎవరిపైనైనా కేసులు పెట్టించానా..? ఇప్పుడు జరుగుతున్నదేంటి? అని ప్రజలను ప్రశ్నించారు. రూపాయి ఖర్చు చేయకపోయినా.. ఆరుసార్లు ప్రజల నన్ను గెలిపించారన్న ఈటల..ఇలాంటి నన్ను పట్టుకుని బొంద పెట్టాలని చూస్తే ప్రజలు ఊర్కుంటారా..అని అన్నారు.