
హోం క్వారంటైన్ లో ఉండాల్సి న వాళ్లు పెండ్లిండ్లకు, దావత్ లకు పోతరా?
మీతోనే సొసైటీకి నష్టం .. కఠిన చర్యలు తప్పవు
దండం పెట్టి చెబుతున్నా జనం బయటకు రావొద్దు: మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్, వెలుగు: విదేశాల నుంచి వచ్చినోళ్లను హోం క్వారంటైన్‌లో ఉండాలంటే పెండ్లిండ్లకు, దావత్‌లకు తిరుగుతున్నారని మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చదువుకున్నోళ్లు.. అన్నీ తెలిసినోళ్లని నమ్మి క్వారంటైన్ సెంటర్ల నుంచి ఇంటికి పంపిస్తే ఇలా బయట తిరగడం ఎట్ల సమంజసం” అని ఆయన ప్రశ్నించారు. క్వారంటైన్‌లో ఉంచాల్సిన కొడుకు(కరోనా పాజిటివ్)ను తీసుకుని కొత్తగూడెం డీఎస్పీ ఫంక్షన్లకు అటెండ్ అవడాన్ని మంత్రి ఉదహరించారు. ఇలా బాధ్యత మరిచి ప్రవర్తించడం వల్ల సమాజం మొత్తానికి నష్టం చేసినవాళ్లవుతారని అన్నారు. ‘‘ఇక ఊకునేది లేదు. హోం క్వారంటైన్‌లో ఉన్నోళ్లు బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటం” అని మంత్రి హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చినోళ్లెవరైనా ఉంటే, ఇప్పటికైనా అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కోఠిలోని కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సోమవారం మంత్రి మీడియాతో
మాట్లాడారు.
దండం పెట్టి చెబుతున్న
నిత్యావసర సరుకుల షాపులన్నీ తెరిచే ఉంటాయని చెబుతున్నప్పటికీ, కొంపలు మునిగినట్టు జనం రోడ్డు మీదకొస్తున్నారని మంత్రి ఈటల అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘దండం పెట్టి చెబుతున్న.. బయటకు రావొద్దు” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా బయట తిరగడం వల్లే ఇటలీ అల్లాడుతోందని, వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన గుర్తు చేశారు. కరోనా ఉన్నోళ్లు తమకు తెలియకుండానే వందల మందికి అంటించే ప్రమాదముందని, ఎవరూ బయటకు రావొద్దన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, మరో 97 మంది అనుమానితులు ఉన్నారని తెలిపారు.
ఆరోగ్య శాఖలో సెలవులు రద్దు
ప్రభుత్వ దవాఖాన్లలో సాధారణ సర్జరీలు నిలిపివేశామని, అత్యవసర సేవలన్నీ కొనసాగుతాయని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాన్లలో పనిచేస్తున్న డాక్టర్ల నుంచి క్లాస్ 4 కార్మికుల దాకా అందరూ డ్యూటీలో ఉండాలని కోరారు. ఆరోగ్య శాఖలోని అందరికీ సెలవులు రద్దు చేశామన్నారు. గాంధీ, సీసీఎంబీ సహా మరో 5 ల్యాబుల్లో కరోనా టెస్టులకు అనుమతి వచ్చిందని ఆయన తెలిపారు. ఫీవర్ హాస్పిటల్, సీసీఎంబీలో టెస్టుల ట్రయల్ కూడా మొదలైందని, కిట్లు వస్తే పూర్తిస్థాయిలో ఈ ల్యాబులు అందుబాటులోకి వస్తాయన్నారు.
ప్రైవేటు హాస్పిటల్స్ సహకరించాలి
కరోనా కట్టడికి సహకరించాలని కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటల్స్ యజమానులను మంత్రి ఈటల కోరారు. వారితో సోమవారం ఆయన భేటీ అయ్యారు. ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తామని వాళ్లు మీడియాకు వివరించారు. కరోనా నివారణకు ఎవరింట్లో వాళ్లు ఉండడం ఒక్కటే మార్గమని, ప్రజలంతా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సన్‌షైన్ హాస్పిటల్ యజమాని గురువారెడ్డి సూచించారు. లేదంటే ఇటలీ పరిస్థితి రిపీట్ అవుద్దని, అప్పుడిక ఎవరూ ఏం చేయలేరని హెచ్చరించారు.
డొమెస్టిక్ ప్యాసింజర్లకూ స్ర్కీనింగ్
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బందయ్యాయని, ఇతర రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డొమెస్టిక్ ప్యాసింజర్లను కూడా స్ర్కీన్ చేయాలని నిర్ణయించినట్టు మంత్రి ఈటల వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన 20 వేల మందిని గుర్తించామన్నారు. ఇండ్లల్లో వసతులు లేనోళ్లకు గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో క్వారంటైన్ కల్పించామన్నారు. కరోనా అనుమానితులు, పేషెంట్లు చికెన్, మటన్ అడుగుతున్నారని, ఇది పద్ధతి కాదని, దవాఖాన్లేం 5 స్టార్ హోటళ్లు కావనే విషయం గుర్తెరుగాలన్నారు. వసతులు కల్పిస్తామని, అడ్జస్ట్ చేసుకోవాలన్నారు. పది రోజులు చాలా క్రూషియల్ అని, ప్రపంచ యుద్ధం కంటే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నామన్నారు.
For More News..