దెయ్యంవాగులో ఏడాదంతా నీళ్లు..ఎక్కడంటే?

దెయ్యంవాగులో ఏడాదంతా నీళ్లు..ఎక్కడంటే?

చెట్టూ చేమా, వాగులు వంకలు, కొండలు లోయలు... ఇలాంటి ప్లేస్​లని మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది. అక్కడ రకరకాల అడవి జంతువులు, పక్షులు కూడా  కనిపిస్తే... చాలా థ్రిల్లింగ్​గా ఉంటుంది. అందుకోసమే శాంక్చురీలకు వెళ్తుంటారు చాలామంది. ప్రకృతి ఒడిని తలపించే ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో పచ్చని చెట్లని చూస్తూ సేద తీరతారు. మన రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్న ఏటూరునాగారం శాంక్చురీ వీకెండ్​ టూర్​కి బాగుంటుంది. మన రాష్ట్రంలోని ఏడు వైల్డ్​ లైఫ్​ శాంక్చురీల్లో ఒకటైన ఈ ప్లేస్​ గురించి...

ఏటూరునాగారం అంటేనే దట్టమైన చెట్లతో ఉన్న అడవి గుర్తుకొస్తుంది. రకరకాల అడవి జంతువులు తిరిగే ఈ  ప్రాంతాన్ని 1953లో శాంక్చురీగా మార్చారు. మనరాష్ట్రంలోని మొట్ట మొదటి వైల్డ్​లైఫ్​ శాంక్చురీ ఇదే. మూడు రాష్ట్రాల సరిహద్దులో (తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్) ఉంది. కొండలు, లోయలతో చూడముచ్చటగా కనిపించే ఈ శాంక్చురీ దాదాపు 806 చదరపు కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది. ఇక్కడ ఉండే  ‘దెయ్యంవాగు’ రెండు పాయలుగా ప్రవహిస్తుంది. ఈ వాగు శాంక్చురీని రెండు భాగాలుగా చేస్తుంది. దెయ్యంవాగు ప్రత్యేకత ఏంటంటే... ఇందులో ఏడాదంతా నీళ్లు ఉంటాయి. 

ఫారెస్ట్ ఆఫీసర్ అనుమతితో...

ఈ శాంక్చురీలో 18 మీటర్ల ఎత్తైన చెట్లు ఉంటాయి. వాటిలో వెదురు, టేకు, నల్లమద్దితో పాటు రకరకాల ఔషధమొక్కలు కూడా కనిపిస్తాయి. పులి, చిరుత పులి, అడవి కుక్కలు, అడవిబర్రెలు, మచ్చలజింక, నీల్​గై, కృష్ణజింక, నాలుగు కొమ్ముల దుప్పి వంటి వాటిని కూడా చూడొచ్చు. వీకెండ్​లో  ఇక్కడ బస చేయాలి అనుకునేవాళ్లు ఏటూరు​నాగారం ఊర్లో ఐటీడీఎ (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్​మెంట్ ఏజెన్సీ) ఏర్పాటుచేసిన గెస్ట్ హౌస్​లో ఉండొచ్చు. ఈ శాంక్చురీలో సఫారీలు ఉండవు. ఫారెస్ట్​ ఆఫీసర్​  అనుమతితో జీపు మాట్లాడుకొని అందులో వెళ్లొచ్చు. అక్టోబర్ నుంచి మే నెల మధ్యలో వెళ్తే పచ్చదనంతో నిండిన ఇక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. 

ఇలా వెళ్లాలి: వరంగల్ నుంచి 109 కి.మీటర్ల దూరంలో ఉంది ఏటూరునాగారం శాంక్చురీ. హైదరాబాద్ నుంచి 250 కి.మీటర్ల జర్నీ.టైమింగ్స్​: ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. టికెట్: పిల్లలకు రూ. 5, పెద్దలకు రూ. 10