ఈవీల ధరలు తగ్గుతాయ్.. 6 నెలల్లో పెట్రోల్ బండ్లతో సమానం

ఈవీల ధరలు తగ్గుతాయ్.. 6 నెలల్లో పెట్రోల్ బండ్లతో సమానం

న్యూఢిల్లీ: మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) ధరలు రాబోయే నాలుగు నుంచి ఆరు నెలల్లో పెట్రోల్ బండ్ల ధరలతో సమానంగా ఉంటాయని  కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పెట్రోల్​, డీజిల్​పై  ఆధారపడటం వల్ల దేశానికి ఆర్థిక భారం ఎక్కువ అవుతోందని తెలిపారు. ఫిక్కీ సోమవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఇంధన దిగుమతులపై ఏటా రూ. 22 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇది పర్యావరణానికి ప్రమాదమని, ఈవీలను వాడటం ముఖ్యమని మంత్రి అన్నారు.

రాబోయే ఐదేళ్లలో, భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలో నెంబర్ వన్​గా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి గడ్కరీ వెల్లడించారు. తాను రవాణా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 14 లక్షల కోట్లని, ఇప్పుడు ఇది రూ. 22 లక్షల కోట్లకు చేరిందని అని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం, అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 78 లక్షల కోట్లు కాగా, దాని తర్వాత చైనా (రూ. 47 లక్షల కోట్లు) ఉంది.