కేంద్ర నిధులతోనే పాలమూరు అభివృద్ధి

కేంద్ర నిధులతోనే పాలమూరు అభివృద్ధి

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పాలమూరు జిల్లాలో అభివృద్ధి జరిగిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పాలమూరులోని అప్పన్నపల్లి ఆర్వోబీ నిర్మాణానికి రూ.239 కోట్లు, మయూరి పార్క్  డెవలప్​మెంట్  కోసం రూ.120 కోట్లు, రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు అమృత్  స్కీం ద్వారా రూ.853 కోట్ల నిధులొస్తే, అందులో పాలమూరుకు రూ.163 కోట్లు వచ్చాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే పాలమూరులో వలసలు ఎక్కువయ్యాయని చెప్పారు. 

సమాజం నిర్లక్ష్యానికి గురైందని, ఉమ్మడి ఏపీలోనే తెలంగాణకు మేలు జరిగిందన్నారు. ఈజీఎస్​ స్కీమ్​ ద్వారానే రాష్ట్రంలో రోడ్లు, వైకుంఠధామాలు, రైతు వేదికలు, ప్రకృతి వనాలు కట్టించారన్నారు. ఈ ప్రభుత్వం దోచుకోవడం తప్ప అభివృద్ధికి రూపాయి ఖర్చు చేయడం లేదని విమర్శించారు. 2014లో పాలమూరు జిల్లాలో పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులు ఇప్పటికీ అలాగే ఉన్నాయని ఆమె ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్పీ వెంకటేశ్, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, అసెంబ్లీ కన్వీనర్ ఎ.అంజయ్య పాల్గొన్నారు. అనంతరం జన సంపర్క్  అభియాన్ లో భాగంగా క్లాక్ టవర్ లోని సుల్తాన్ బజార్, పుట్నాల బట్టి, పాన్ చౌరస్తా ఏరియాల్లో బీజేపీ తొమ్మిదేండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలను వివరించారు. 

నాగర్ కర్నూల్ టౌన్: నాగర్ కర్నూల్  మండలం వనపట్ల గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొండ మన్నెమ్మ నాగేశ్, స్వామి, వెంకటయ్య, రాంబాబు, భాస్కర్ రెడ్డి, శ్రీను పాల్గొన్నారు.

అమ్రాబాద్: బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని బీజేపీ అచ్చంపేట నియోజవర్గ నాయకులు శ్రీకాంత్  భీమా పేర్కొన్నారు. జంగంరెడ్డిపల్లి గ్రామంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు. నీలం రవి, బొడ్డుపల్లి శ్రీను, రాజేందర్, శ్రీను, రమేశ్, సురేశ్, అంజి, సతీశ్, శివ, చెన్నకేశవులు పాల్గొన్నారు.