సరైన ఆహారం తీసుకోకపోతే పోలీసులు ఎలా పని చేస్తారు?

సరైన ఆహారం తీసుకోకపోతే పోలీసులు ఎలా పని చేస్తారు?

మెస్ లో వడ్డించే నాణ్యత లేని ఆహారంపై విసుగు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్.. ఈ భోజనాన్ని జంతువులు కూడా తినవని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో జరిగింది. ఓ పోలీసు కానిస్టేబుల్ పోలీసుల మెస్‌లో వడ్డించే ఆహారం నాణ్యతపై రోడ్డుపై నిలబడి బోరున విలపిస్తూ కనిపించడం అందర్నీ కలచివేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, కానిస్టేబుల్ మనోజ్ కుమార్ రోటీలు, పప్పు, అన్నం ఉన్న ప్లేట్‌తో రోడ్డుపై ఏడుస్తున్నట్లు గమనించవచ్చు. ఒక సీనియర్ అధికారి అతన్ని తిరిగి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లే ప్రయత్నంలో శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. 

దీంతో దారిన వెళ్లే వాళ్లు కానిస్టేబుల్ మనోజ్ కుమార్ చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే ఆహారం గురించి తన సీనియర్లకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. అంతే కాదు నన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆ కానిస్టేబుల్ వాపోయారు. పోలీసు అధికారులకు పౌష్టికాహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం భత్యం ఇస్తుందని ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించారని మనోజ్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ఎంతో కష్టపడి డ్యూటీ చేసిన తర్వాత మాకు లభించేది ఇదేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "సరైన ఆహారం తీసుకోకపోతే పోలీసులు ఎలా పని చేస్తారు?" అని ఆ కానిస్టేబుల్ ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలోనే అతను భోజనంతో ఉన్నప్లేట్‌తో డివైడర్‌పై కూర్చుని, "జంతువులు కూడా దీనిని తినవు" అని చెప్పడం కనిపించిడం అందర్నీ ఆలోచింపజేసేలా ఉంది.