పిలగాడు ఐనా సరే.. ఏమన్నా అంటే ఆశీర్వాదంగా తీసుకుంటా

పిలగాడు ఐనా సరే.. ఏమన్నా అంటే ఆశీర్వాదంగా తీసుకుంటా
  • ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్
  • ధాన్యం సేకరణలో మిలర్ల దోపిడీ స్కాం ఉందన్న జీవన్ రెడ్డి
  • కేసీఆర్ మాటలు నమ్మి రైతులు నష్టపోయారని వ్యాఖ్య
  • ఎలక్ట్రానిక్ ధాన్యం తూకం అనుగుణంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్

మభ్యపెట్టాలని చూసేదేవరనేది  వాస్తవ దృష్టితో చూస్తే అర్థం అవుతుందని MLC జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కౌంటర్ ఇచ్చారు. రైతాంగమంతా గిట్టుబాటు ధరలేక అల్లాడి పోతుంటే, మిల్లరలకు వంత పాడేలా ప్రవర్తించడం బాధాకరమన్నారు. ఏ సెంటర్ పరిశీలించినా 3-5 కిలోల తరుగు పేరుతో రైతులు దోపిడీ కి గురవుతున్నారని ఆరోపించారు. ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జి, ట్రాక్ షీట్ కు మధ్య వ్యత్యాసం ఎందుకు వస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

సీఎం కేసీఆర్ కు ఒక నీతి..- సాధారణ రైతుకు మరో నీతా.. ?

ఈ వ్యత్యాసానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించిన జీవన్ రెడ్డి.. ప్రతి క్వింటాల్ కు 5 కిలోలు, క్వింటాల్ కు రూ.100, ఎకరానికి సుమారు 2000 వేల రూపాయలు నష్టపోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణలో మిలర్ల దోపిడీ స్కాం రూ.500 కోట్లుగా ఉందన్న ఆయన... నేల స్వభావం, నీటి వనరులతో సీఎం కేసీఆర్ 150 ఎకరాల్లో వరి పంట సాగు చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్ కు ఒక నీతి..- సాధారణ రైతుకు మరో నీతా అని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానం, వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్ మాటలు నమ్మి... సగానికి సగం రైతులు వరి పంట సాగు చెయ్యలేదని చెప్పుకొచ్చారు. కోటి మెట్రిక్ టన్నులు రావాల్సింది, 50లక్షల మెట్రిక్ టన్నులకే దిగుబడి పరిమితం అయిందని చెప్పారు.

రైతు బంధు కూడా ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత విధానంతో రైతాంగం10 వేల కోట్ల ధాన్యం దిగుబడి కోల్పోయిందని జీవన్ రెడ్డి అన్నారు. "ఆరు మాసలుగా అంకెలతో సహా చెప్తున్నా... ఇప్పుడు కొత్తగా మాట్లాడతలేనని చెప్పారు. క్వింటాల్ రా రైస్ తో పడే భారం రూ.300 అన్న జీవన్ రెడ్డి.. కేవలం మూడు వేల కోట్ల కోసం రాష్ట్ర రైతాంగాన్ని నష్టపోయేలా చేశార"ని ఆరోపించారు. రూ.1500 కోట్ల ఆర్థిక భారం తగ్గించుకునేదుకు, రైతాంగంపై రూ.10 వేల కోట్ల భారం వేయడం భావ్యమా? అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ పథకాన్ని తెరపైకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ  అని గర్వంగా చెప్పారు. వ్యవసాయ రాయితీ కొనసాగిస్తూ అదనంగా రైతు బంధు కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లు గడిచినా నేటికీ రైతులకు 4% వడ్డీ మాఫీ రాయితీ రాలేదని.. ప్రీమియం చెల్లించలేక భీమా పథకం నిర్వీర్యం అయ్యిందని తెలిపారు.

SRSP ప్రాజెక్ట్ తోనే సాధ్యం..

మామిడి రైతులను ఆదుకోవడానికి ఇన్ పుట్ సబ్సిడీ రూపేణా ఏమైనా సాయం అందిస్తున్నారా? అని జీవన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. నేను మాట్లాడానికే ఉన్న, అసత్యం, అబద్దం ఉంటే ఎత్తి చూపు. జగిత్యాల కు కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ఎక్కడ వచ్చింది చూపెట్టు. కేవలం SRSP ప్రాజెక్ట్ తోనే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని వ్యాఖ్యానించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏం పాపం చేసింది. నాలుగేండ్లు గడిచింది రూ.50 కోట్ల పనులు పెండింగ్ లో ఉన్నాయి. మంత్రి ఈశ్వర్ ఏం పని చేస్తున్నారో అర్థం కావడం లేదు. 

అమ్ముకోలేక పరేషాను...

"నా దృష్టిలో కవిత రాష్ట్ర, జాగృతి, ఉద్యమ నాయకురాలు. ఎమ్మెల్యే కన్నా నాలుగు ఓట్లు ఎక్కువ రావాలా.. తక్కువ రావాలా? దానికి కూడా నేనే బాధ్యున్నా..? అంటూ ఫైర్ అయ్యారు. మూడేళ్లు అయినా ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నావా ఇంకా పంటల మార్పిడిలో చెరుకు పెడదాం అంటే ఉన్న ఫ్యాక్టరీ మూసివేసిండ్ర"ని జీవన్ రెడ్డి అన్నారు. "రైతుకు న్యాయం జరగాలంటే సీఎం స్వయంగా సన్న వడ్లు పెట్టండి అంటే నాకు తెల్వదా అని అన్నాడు? ఇప్పుడు అమ్ముకోలేక పరేషాను అవుతుండు..? పునస నెత్తి మీదకు వచ్చింది. ధాన్యం సేకరణ మీద దృష్టి పెట్టండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎలక్ట్రానిక్ ధాన్యం తూకం అనుగుణంగా డబ్బులు చెల్లిస్తే రైతుకు న్యాయం జరుగుతుంద"ని సలహా ఇచ్చారు.

రైతు మేలు కోరదాం.. రైతుల హక్కులను కాపాడుదాం

2004 - 14 మధ్యలో ఏక కాలంలో రైతుకు రుణమాఫీ చేసినమన్న జీవన్ రెడ్డి.. కేవలం రూ. 34 వేల రూపాయల వరకే రుణమాఫీ జరిగింది. ఇవాళ మంత్రి వస్తున్నడు కదా. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవ్. రైతు రుణమాఫీ సంగతి తేల్చు. మీది రుణమాఫీ కార్యక్రమమా లేక వడ్డీ మాఫీ కార్యక్రమమా? అని నిప్పులు చెరిగారు. ఆనాడు తాము కల్పించిన పంట రుణాలపై వడ్డీ రాయితీ కార్యక్రమం అమలు చేయమంటూ డిమాండ్ చేశారు. "పిలగాడు ఐనా సరే... నన్ను అంటే ఆశీర్వాదం కింద తీసుకుంటా.  నువ్వు నన్ను ఎన్ని అన్నా, రైతులు, నిరుద్యోగ వర్గాలకు, ప్రజలకు అండగా నిలవడం నా బాధ్యత" అని అన్నారు. "నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే నేను ఆత్మ పరిశీలన చేసుకుంటా, నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పుంటే నువ్వు ఆత్మ పరిశీలన చేస్కో. ఎవరేమన్నా గానీ రైతు మేలు కోరదాం, రైతుల హక్కులను కాపాడుదామ"ని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

 

మరిన్ని వార్తల కోసం...

ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆర్మూర్ లో నినాదాలు

నేపాల్ విమాన ప్రమాదం.. 14 మృతదేహాల వెలికితీత