ఫ్రెండ్ అయినా సరే.. ఆర్ధిక వ్యవహారాల్లో దూరం పెట్టడమే మంచిది

ఫ్రెండ్ అయినా సరే.. ఆర్ధిక వ్యవహారాల్లో దూరం పెట్టడమే మంచిది
కష్టాల్లో, సుఖాల్లో ఒక ఫ్రెండ్  ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా. పర్సనల్ విషయాలని షేర్ చేసుకోవటానికి, మూడ్ బాగాలేనప్పుడు కాస్త చిల్ అవటానికి ఫ్రెండ్ ఉండాల్సిందే. అయితే ఫైనాన్షియల్ వ్యవహారాల్లోకి స్నేహితులని తీసుకు రాకపోవటమే మంచిదన్నది చాలామంది ఒపీనియన్. ఫ్రెండే కదా అని నమ్మి డబ్బులు ఇచ్చి, ష్యూరిటీ సంతకాలు పెట్టి మోసపోయినవాళ్లూ ఉన్నారు.  ఒకే కంచంలో తిన్నంత క్లోజ్ ఫ్రెండ్ కూడా బిజినెస్ పార్ట్‌‌‌‌నర్ అయ్యాక  శత్రువుగా మారిపోయిన సంఘటనలూ అక్కడక్కడా చూస్తూనే ఉంటాం. అందుకే ఫ్రెండ్‌‌‌‌షిప్ దెబ్బ తినకుండా, మనుషులు దూరం అవకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఆదుకోవడం తప్పు కాదు కానీ… ఫ్రెండ్‌‌‌‌షిప్ ఎక్కువ కాలం నిలబడాలి అంటే ఫైనాన్షియల్ వ్యవహారాల్లో క్లియర్ గా ఉండాలి. కష్టాల్లో ఉన్న బంధువులను, స్నేహితులను ఆదుకోవడం తప్పేమీ కాదు. అయితే ఈ ఆదుకోవడమనేది మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద ప్రభావం చూపేలా ఉండకూడదు.  ఎలాంటి సమస్య లేదనుకున్నప్పుడే సాయం చేయాలి. మనమే కష్టాల్లో ఉన్నప్పుడు వేరొకరిని ఆదుకోవడం మంచి నిర్ణయం కాదు. కొన్నిసార్లు బంధువులకు, స్నేహితులకు అప్పు ఇవ్వడం వల్ల, డబ్బులు తిరిగి రాకపోగా సంబంధాలు కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంది. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందే. ఇది ఎమోషనల్‌‌‌‌గా బాధ కలిగించే విషయమే అయినా రియాలిటీలో ఉండి ఆలోచించాలి. ఖర్చు వాయిదా వేసుకోవచ్చు స్నేహితులో, బంధువులో ఆపదలో ఉన్నారని ఆదుకోవాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ… వారికి చేసే సాయం ఇబ్బందుల్లోకి నెట్టేయకూడదు. ఖర్చులు, రాబడి అన్నీ బ్యాలెన్స్ అయ్యేలా నిర్ణయం తీసుకోవాలి.  నెలనెలా కట్టాల్సిన ఈఎమ్ఐ, రెగ్యులర్ సేవింగ్స్ లాంటివన్నీ లెక్కలోకి తీసుకొని  అప్పు ఇవ్వాలి. ఏదైనా వస్తువు, ఆస్తి కొనడానికి డబ్బు దాచుకుంటే ఆ ఖర్చు వాయిదా వేసుకోవచ్చు. కానీ, ఈఎంఐలు లాంటివి ఆపకూడదు. అవసరాలు తీరిన తర్వాత చేతిలో డబ్బు మిగిలితేనే  అప్పు ఇవ్వాలి. స్వార్థంతో ఉండక్కరలేదు మామూలుగా ఫ్రెండ్స్ మధ్య డబ్బు విషయాల్లో లీగల్ ఒప్పందాలు చాలా తక్కువగా ఉంటాయి. 90% నోటి మాటమీదే  డిపెండ్ అయి ఉంటాయి. కానీ అనుకున్న టైంకి ఆ డబ్బు ఇవ్వకపోతే? డబ్బులే కాదు ఆ ఫ్రెండ్ కూడా దూరం అవుతాడు, పెద్ద మొత్తంలో డబ్బు అయితే శత్రువు కూడా అవ్వొచ్చు. అందుకే అవసరంలో ఉన్న ఫ్రెండ్‌‌‌‌కి హెల్ప్ చేసేముందు సొంత అవసరాలని కూడా గుర్తుంచుకోవాలి. కేవలం ఎమోషన్స్‌‌‌‌తో సమస్యలు తీరవు. చాలా సమస్యలకి పరిష్కారం డబ్బే అని గుర్తుంచుకోవాలి. అలాగని పూర్తి స్వార్థంతో ఉండక్కరలేదు. అయితే హెల్ప్ చేయటానికి ఉండే లిమిట్‌‌‌‌ని మాత్రం గుర్తుంచుకోవాలి. ఇన్‌‌‌‌స్టంట్ ఎమోషన్స్ వద్దు ఫ్రెండ్ అప్పు అడిగాడు కదా అని ఉన్నవి తాకట్టుపెట్టి మరీ అప్పులు ఇచ్చేయొద్దు. పిల్లల పైచదువుల కోసమో, పెళ్లిళ్ల కోసమో, మెడికల్ ఎమర్జెన్సీ  కోసమో దాచుకున్న డబ్బును అప్పుగా ఇచ్చి ఇబ్బందులు పడొద్దు.  అప్పు తీసుకున్న ఫ్రెండ్ కాస్త ఆలస్యంగా ఇచ్చినా ఇబ్బంది లేదనుకుంటేనే అప్పు ఇవ్వాలి. అంతే కాదు, అవసరం వచ్చినప్పుడు వెంటనే తిరిగి ఇవ్వలేక ఆ ఫ్రెండ్ బాధపడకూడదు అనే విషయాన్ని కూడా ముందే ఆలోచిస్తే మంచిది. ఇన్‌‌‌‌స్టంట్ ఎమోషన్స్ చాలా ఇబ్బందుల్లో పడేస్తాయి. లీగల్ డాక్యుమెంటేషన్ ఉండాలి హెల్ప్ చేయటం ఎలా స్నేహితుడి బాధ్యతో… తిరిగి ఇస్తానన్న నమ్మకం కోసం లీగల్‌‌‌‌గా ప్రూఫ్ ఇవ్వటం కూడా అప్పు తీసుకుంటున్న ఫ్రెండ్ బాధ్యత. కాబట్టి మొహమాటం అవసరం లేదు. అప్పు ఇస్తున్నప్పుడు ఎంత దగ్గరి ఫ్రెండ్ అయినా సరైన లీగల్ డాక్యుమెంటేషన్ లేకుండా ఇవ్వొద్దు.  కేవలం రికార్డుల కోసమే అనుకున్నా, ప్రామిసరీ నోటు సరిపోతుంది. స్టాంప్ పేపర్ పై నోట్ రాసుకుని దాన్ని నోటరీతో అటెస్ట్ చేయించాలి. ఒకేసారి ఇవ్వాలా? కొద్ది కొద్దిగా కట్టాలా? అనే విషయాన్ని కూడా ముందే రాసుకోవటం మంచిది.  స్టాంప్ పేపర్లు, ప్రామిసరీ నోట్లపై పూర్తిపేరు, ఐడీ ప్రూఫ్స్ కచ్చితంగా ఉండాలి. అంతే కాదు అప్పు ఫ్రెండ్ కి ఇచ్చినా దానికి వచ్చే వడ్డీకి ట్యాక్స్ ఉంటుంది. ష్యూరిటీ సంతకమైనా….. దగ్గరి బంధువైనా, క్లోజ్ ఫ్రెండ్ అయినా ష్యూరిటీ సంతకం పెట్టేముందు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. అప్పు ఇస్తే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, అప్పులకు, లోన్ లకు ష్యూరిటీ ఉన్నా అవే ఇబ్బందులు ఉంటాయి. అందుకే స్నేహితులు, బంధువులపై 100 శాతం నమ్మకం ఉంటేనే ష్యూరిటీ ఇవ్వాలి. చివరగా ఫైనాన్షియల్ ఎఫైర్స్ ఫ్రెండ్‌‌‌‌షిప్‌‌‌‌నీ, రిలేషన్స్‌‌‌‌నీ దెబ్బతీయకుండా చూసుకోవాలి.