పోటీలో కోమటిరెడ్డి ఉన్నా.. గెలుపు మాత్రం ప్రజలదే

పోటీలో కోమటిరెడ్డి ఉన్నా.. గెలుపు మాత్రం ప్రజలదే

నల్లగొండ జిల్లా మునుగోడులో బీజేపీ క్యాంపు కార్యాలయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా V6 న్యూస్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముచ్చటించారు. తన రాజీనామా తర్వాతే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడుకు వస్తున్నారని విమర్శించారు. ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదలయ్యే చాన్స్ ఉందని, వచ్చే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. గతంలో మునుగోడు అభివృద్ధి పనులపై మాట్లాడేందుకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం కేసీఆర్.. ప్రస్తుతం మునుగోడు గెలుపు కోసం ఆలోచనలో పడ్డారన్నారు. గట్టుప్పల్ మండలంలో కొత్త పెన్షన్ల మంజూరు, యాదవులకు గొర్ల పంపిణీ , దళిత బంధు పథకం అమలు వంటివన్నీ తన రాజీనామా వల్లే జరిగాయని చెప్పారు. మునుగోడు అభివృద్ధి కోసం ఈఎస్ఐ హాస్పిటల్, ప్రత్యేక ఫండ్ ఇవ్వాలని ఢిల్లీలో అమిత్ షాని కలిసి అడిగానని ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

మునుగోడు అభివృద్ధి కోసం కచ్చితంగా సహాయం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్టు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు ప్రజలకు తానేంటో తెలుసన్న ఆయన... కేసీఆర్ ని ప్రజలు నమ్మరని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తాను గెలిచిన నెలలోపే ప్రభుత్వం పడిపోతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ రూపంలో పట్టిన శని పోతుందన్న ఆయన... కేసీఆర్ నిరంకుశ పరిపాలనను ప్రజలందరూ అర్థం చేసుకున్నారని తెలిపారు. మునుగోడులో ధర్మ యుద్ధం సాగుతుందని, పోటీలో కోమటిరెడ్డి ఉన్నా గెలుపు ప్రజలదేనని స్పష్టం చేశారు. కేసీఆర్ వందల మంది పోలీసులతో ఇక్కడికి వచ్చినా ప్రజలను మార్చలేడు.. తన గెలుపుని ఆపలేడని రాజగోపాల్ రెడ్డి నొక్కి చెప్పారు.