ధరణి సమస్యలపై 2 లక్షల కేసులు..పట్టించుకోని అధికారులు

ధరణి సమస్యలపై 2 లక్షల కేసులు..పట్టించుకోని అధికారులు
  • ధరణి సమస్యలపై 2 లక్షల కేసులు

  • పోర్టల్​లో మాడ్యూల్స్​తెచ్చినా తప్పని తిప్పలు

  • దరఖాస్తులు పెట్టుకున్నా పట్టించుకోని అధికారులు

  • లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి కోర్టులను ఆశ్రయిస్తున్న బాధితులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్​ ధరణి పోర్టల్​ పేరుతో చేసిన తప్పులకు రైతులు తిప్పలు పడుతున్నారు. ఎవుసం వదిలి.. ఉన్న సొంత భూమిని కాపాడుకునేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వేలు, లక్షల రూపాయల ఫీజులు చెల్లించి కేసులు వేస్తూ న్యాయ పోరాటం సాగిస్తున్నారు. ఫీజుల కోసం భూమిని తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు. బంగారాన్ని అమ్ముకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కింది స్థాయి కోర్టుల నుంచి హైకోర్టు దాకా గత రెండేండ్లలో దాదాపు లక్షా 72 వేల కేసులు ధరణిలోని సమస్యలపై నమోదైనవే ఉన్నాయి. ఇవి ప్రభుత్వం దృష్టికి వచ్చిన కేసుల సంఖ్య మాత్రమే. ఇంకా దృష్టికి రానివి మరో 30 వేల వరకు ఉంటాయని ఆఫీసర్లు చెప్తున్నారు. మొత్తం గా 2 లక్షల వరకు ధరణికి సంబంధించిన కేసులు కోర్టుల్లో నమోదయ్యాయి. మరికొంత మంది రైతులు కోర్టుల్లో కేసులు వేసేందుకు డబ్బులు లేక కలెక్టర్, ఎమ్మార్వో​ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంతకీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆఫీసుల ఎదుటే నిరసనలకు, ఆందోళనలకు దిగుతున్నారు.

ధరణి పోర్టల్ ​తీసుకువచ్చే ముందు రాష్ట్రంలో రెవెన్యూ కోర్టులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో ప్రతి శనివారం తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్‌‌ ఆఫీసుల్లో  ప్రత్యేకంగా రెవెన్యూ కోర్టులను నిర్వహించేవారు. మండల స్థాయిలో తహసీల్దార్‌‌.. ఆపై అప్పిలేట్‌‌ అధికారిగా ఆర్డీవో.. జిల్లాస్థాయిలో అదనపు కలెక్టర్‌‌ భూ వివాదాలపై తీర్పులు చెప్పేవారు. ఎన్నో ఏండ్లుగా వస్తున్న ఈ సంప్రదాయానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. రెవెన్యూ కోర్టుల రద్దు తర్వాత పాత కేసుల పరిష్కారానికి ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసింది. అయితే పాత కేసులు కూడా పరిష్కారానికి నోచుకోలేదు. 2020లో  ఆర్‌‌వోఆర్‌‌ చట్టానికి సవరణ చేస్తూ ‘తెలంగాణ రైట్స్‌‌ ఇన్‌‌ ల్యాండ్‌‌ అండ్‌‌ పట్టాదార్‌‌ పాస్‌‌బుక్స్‌‌’ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. దీంట్లో రెవెన్యూ కోర్టులు లేవు.. ట్రిబ్యునళ్లు కూడా లేవు. ఫలితంగా కలెక్టర్లు భూ సమస్యలను పరిష్కరించకపోతే.. రైతులు నేరుగా లాయర్​ను పట్టుకుని కోర్టుల్లో కేసులు వేసుకోవాల్సిన  పరిస్థితి  ఏర్పడింది. కోర్టు నుంచి ఆర్డర్​ తెచ్చుకోవడానికి నెలలకు నెలలు టైమ్​ పడుతున్నది. కొన్నింటికి కోర్టు ఆర్డర్లు ఉన్నా.. వాటిని అమలు చేసేందుకు అధికారులు చాలా టైమ్​ తీసుకుంటున్నారు. 

ల్యాండ్​ వ్యాల్యూను బట్టి ఫీజులు

ధరణి పోర్టల్​తో  రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ఎన్ని అప్లికేషన్లు పెట్టుకున్నా వాటిని అధికారులు పరిశీలించడం లేదు. సమస్యను చెప్పుకునేందుకు రెవెన్యూ కోర్టులు లేక, ట్రిబ్యునళ్లు లేక రైతులు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇందు కోసం లాయర్లకు లక్షల్లో ఫీజులు చెల్లించుకుంటున్నారు. భూ సమస్య పరిష్కారానికి ఫైనల్​ డెస్టినేషన్​ కోర్టులే కావడంతో.. లాయర్లు పెద్ద మొత్తంలో ఫీజులు తీసుకుంటున్నారు. భూమి ధరను బట్టి ఫీజును ఫిక్స్​ చేస్తున్నారు. కొన్నిచోట్ల అయితే  సమస్య పరిష్కరించినందుకు భూమిలో కొంత భాగాన్ని తమ పేరిట రాయించుకుంటున్నారు. ఒక ఎకరం, రెండు ఎకరాల సమస్య ఉన్నా .. కోర్టులో కేసు వేయాలంటే లక్షల రూపాయల చెల్లించుకోవాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు. కొందరు భూ సమస్య పరిష్కారం అయినాక దానిని అమ్ముకుంటామని, అట్లా వచ్చే డబ్బులను ఇస్తామని చెప్తూ అప్పులు చేసి కోర్టుకు వెళ్తున్నారు. 

పరిష్కారం అని చెప్పి.. సమస్యలు పెంచిన్రు

రాష్ట్ర ప్రభుత్వం 2017 సెప్టెంబర్​లో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది. దాన్ని పూర్తిగా చేయలేదు. తప్పులు పెద్దగా సరిచేయకుండానే అంతకుముందు నుంచే ఉన్న వెబ్​ల్యాండ్​ డేటాను ఇంటిగ్రేటెడ్​ ల్యాండ్​ రికార్డ్స్​ మేనేజ్​మెంట్​ సిస్టం (ఐఎల్​ఆర్​ఎమ్​ఎస్​)లో ఎంట్రీ చేసింది.  ఆ తర్వాత దానినే 2020లో ధరణి పోర్టల్​ పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో రికార్డుల నమోదు సమయంలో ఆఫీసర్లు, సిబ్బంది చేసిన పొరపాట్లు యథావిధిగా ధరణిలోకి వచ్చాయి. పాత భూ సమస్యలు ఎట్లున్నాయో అవి అట్లనే ఉండగా.. మరికొన్ని కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. ధరణిలో ఉన్న లోటుపాట్లను పరిష్కరించేందుకు రెండుసార్లు ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకుంది. ఆ తర్వాత ఫీజులు వసూలు చేస్తూ  కొత్త మాడ్యుల్స్​ను ధరణిలో అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం 33 మాడ్యూల్స్‌‌ అందుబాటులో ఉన్నాయి. అయినా భూ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. ప్రొహిబిటెడ్​ భూములు మొదలు మిస్సింగ్​ సర్వే నంబర్లు, తక్కువ విస్తీర్ణం నమోదు కావడం, ఒక సర్వే నంబర్​ బదులు ఇంకో సర్వే నంబర్​తో పాసు బుక్కులు రావడం వంటి అనేక సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి. 

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో 2017లో అయిల రాజయ్య, బండ్రు మల్లన్న 4 ఎకరాల భూమిని  సేల్​ డీడ్​ రిజిస్ట్రేషన్​ ద్వారా కొన్నారు. అప్పుడే మ్యుటేషన్​కు అప్లికేషన్​ పెట్టుకున్నప్పటికీ అధికారులు చేయలేదు. తర్వాత ధరణి పోర్టల్​ వచ్చింది. దాంట్లో అమ్మినవారి పేర్లే ఉన్నాయి. తమపేరు మీదికి భూమిని మార్చాలని ధరణిలో అప్లికేషన్​ పెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో చేసేదేమీ లేక రూ.1.50 లక్షలు ఖర్చు పెట్టి లాయర్​ను పట్టుకొని హైకోర్టులో కేసు వేశారు. కేసు ఇంకా నడుస్తున్నది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గార్డెగమ్ గ్రామంలో సర్వే నంబర్​ 21లో రైతు చింతల శంకర్ కు వారసత్వంగా వచ్చిన భూమి 6 ఎకరాల 33 గుంటలు ఉంది. ఆ భూమి 2014 లో వారసుల పేరుపై పట్టా మార్పిడి కోసం రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే..  సర్వే నంబర్​ 20 పేరిట పేర్లు ఎక్కించి డిలీట్ చేశారు. ఇపుడు పైగా ఆ భూములు నల్లవాగు ప్రాజెక్టువి అని రాశారు. తమ భూమికి,  ప్రాజెక్ట్ కు  ఎలాంటి సంబంధం లేదని, సమస్య పరిష్కరించాలంటూ సిర్గాపూర్ ఎమ్మార్వో ఆఫీస్​ చుట్టూ ఆ రైతు తిరుగుతున్నాడు. ఎన్ని ఆధారాలు ఇచ్చినా.. మంత్రికి, ఎమ్మెల్యేకు, కలెక్టర్​కు చెప్పినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆయన వాపోతున్నాడు. కోర్టులో కేసు వేద్దామంటే పైసలు లేవని అంటున్నాడు.