EDLI Scheme: PF ఖాతా ఖాళీగా ఉన్నా రూ.50వేల బీమాసాయం

EDLI Scheme: PF ఖాతా ఖాళీగా ఉన్నా రూ.50వేల బీమాసాయం

PF  ఖాతాదారులకు గుడ్న్యూస్..EDLI పథకంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO). EDLI పథకం కింద ఒక పీఎఫ్ ఖాతాదారుడు ఉద్యో్గంలో ఉండగా మరణిస్తే అతని కుటుంబానికి లేదా నామినీకి బీమా మొత్తం లభిస్తుంది.  EDLI కొత్త నిబంధనలప్రకారం.. పీఎఫ్ ఖాతాలో డబ్బు లేకపోయినా  లేక తక్కువగా ఉన్నా కూడా ఈ బీమా వర్తిస్తుంది. అంతేకాదు రెండు ఉద్యోగాల మధ్య రెండు నెలల వరకు గ్యాప్‌ను కూడా లెక్కలోకి తీసుకుంటారు. 

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ద్వారా ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడానికి రూపొందించబడిన ఒక ముఖ్యమైన పథకం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్(EDLI) పథకం. ఈ పథకం పాత నిబంధనల ప్రకారం..గతంలో పీఎఫ్ బ్యాలెన్స్ రూ. 50వేల కంటే తక్కువ ఉంటే కుటుంబానికి ఆ తక్కువ మొత్తమే లభించేది. కానీ ఇప్పుడు ఖాతాలో తక్కువ డబ్బు ఉన్నా కనీసం రూ. 50వేలు గ్యారెంటీగా లభిస్తుంది. కొత్త నిబంధనలు జూలై 18 నుంచి వర్తిస్తాయి. 

EDLI పథకం అంటే..

EDLI పథకం అనేది EPFO కింద జీవిత బీమా పథకం.ఉద్యోగి ఉద్యోగం చేస్తున్నప్పుడు మరణిస్తే ఇది ఉద్యోగి కుటుంబానికి డబ్బు ఇస్తుంది. ఈ స్కీంలో -ఉద్యోగి ఈ బీమా కోసం ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. చివరి జీతం ఆధారంగా బీమా మొత్తం రూ. 2.5 లక్షల నుండి రూ.7 లక్షల మధ్య ఉండవచ్చు.
చివరి జీతం అందుకున్న 6 నెలల్లోపు మరణానికి కూడా కవరేజ్ లభిస్తుంది.

►ALSO READ | డాక్యుమెంట్లు ఎప్పుడూ మీ వెంటే ఉండాలి : అమెరికాలోని గ్రీన్ కార్డ్ హోల్డర్లకు వార్నింగ్!

ఒక ఉద్యోగి తన చివరి జీతం నుంచి PF కట్ చేయబడిన 6 నెలల్లోపు మరణిస్తే, వారి నామినీకి ఇప్పటికీ బీమా డబ్బు లభిస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి ప్రస్తుతం పని చేయకపోయినా, చివరి PF కంట్రిబ్యూషన్ చెల్లించిన 6 నెలల్లోపు మరణించినప్పటికీ కుటుంబానికి ఇప్పటికీ ప్రయోజనం లభిస్తుంది.

ఒక ఉద్యోగి ఉద్యోగం మారినప్పుడు 60 రోజుల వరకు ఖాళీ ఉంటే దానిని విరామంగా లెక్కించరు. అంటే మొత్తం ఉద్యోగ కాలాన్ని బీమా ప్రయోజనం కోసం నిరంతర సేవగా లెక్కించబడుతుంది.

ఎవరికి వర్తిస్తుంది?

కొత్తగా చేరిన ఉద్యోగులకు: ఒక ఉద్యోగి ఒక సంవత్సరం నిరంతర సేవను పూర్తి చేయకుండానే మరణిస్తే వారి కుటుంబానికి కనీసం రూ. 50వేల జీవిత బీమా ప్రయోజనం లభిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం సుమారు 5వేలకు పైగా కేసులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.

చివరి కాంట్రిబ్యూషన్ తర్వాత మరణం: ఉద్యోగి చివరిగా పీఎఫ్ కాంట్రిబ్యూషన్ చేసిన ఆరు నెలలలోపు మరణిస్తే (వారి పేరు ఇంకా యజమాని రోల్స్ నుంచి తొలగించబడకపోతే) EDLI ప్రయోజనం వర్తిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం 14వేలకు పైగా కేసులకు ప్రయోజనం చేకూరనుంది. 

EDLI పథకం ఇతర ప్రయోజనాలు:

EDLI పథకం కింద గరిష్టంగా రూ. 7 లక్షల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది. ఇది ఉద్యోగి మరణానికి ముందు చివరి 12 నెలల్లో పొందిన సగటు నెలవారీ జీతంపై ఆధారపడి ఉంటుంది.

ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు: ఈ బీమా కోసం పీఎఫ్ ఖాతాదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. యజమాని ఈ ప్రీమియంను చెల్లిస్తారు.
కనీస సర్వీసు కాలం అవసరం లేదు: EDLI ప్రయోజనాలు పొందడానికి ఎలాంటి కనీస సర్వీసు కాల వ్యవధి అవసరం లేదు.

క్లెయిమ్ ఎలా చేసుకోవాలి?

ఉద్యోగి మరణించిన తర్వాత నామినీ లేదా చట్టపరమైన వారసులు ఈ కింది పత్రాలతో EDLI బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఫారం 51IF: ఈ క్లెయిమ్ ఫారంను నింపాలి.
డెత్ సర్టిఫికెట్:  సంబంధింత రెవెన్యూ శాఖ నుంచి ఉద్యోగి మరణ ధ్రువీకరణ పత్రం.
వారసత్వ సర్టిఫికెట్: చట్టపరమైన వారసుడు క్లెయిమ్ చేసిన సందర్భంలో వారసత్వ సర్టిఫికెట్ అవసరం.
బ్యాంకు ఖాతా వివరాలు: చెల్లింపును స్వీకరించే వ్యక్తి బ్యాంకు ఖాతా వివరాలు, రద్దు చేసిన చెక్కు.
ఆధార్, పాన్: గుర్తింపు, చిరునామా ధ్రువపత్రాలుగా ఆధార్ పాన్ సమర్పించవచ్చు. 

ఈ మార్పులు పీఎఫ్ ఖాతాదారుల కుటుంబాలకు ఆర్థికంగా మరింత భద్రతను అందిస్తాయి. పీఎఫ్ ఖాతా ఖాళీగా ఉన్నా లేదా తక్కువ బ్యాలెన్స్ ఉన్నా, రూ. 50వేల కనీస సహాయం లభించడం అనేది కుటుంబాలకు ఒక పెద్ద ఉపశమనం.