లక్షల కోట్ల అప్పులు తెచ్చినా సంక్షేమ పథకాలకు నిధుల్లేవు : షర్మిల

లక్షల కోట్ల అప్పులు తెచ్చినా సంక్షేమ పథకాలకు నిధుల్లేవు : షర్మిల

నిర్మల్ జిల్లా: కేసీఆర్ పరిస్థితి బీడి బిచ్చం, కల్లు ఉద్దెర అన్నట్లుగా తయారైందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రూ. 4 లక్షల కోట్ల అప్పు తెచ్చినా సంక్షేమ పథకాల అమలుకు నిధులు లేని పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిల చేస్తున్న ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ 189వ రోజు నిర్మల్ జిల్లాలో కొనసాగుతోంది. నిర్మల్ మండలం కొండాపురం నుండి ప్రారంభమైంది. 

మామడ గ్రామం వరకు సాగనున్న షర్మిల పాదయాత్ర లక్ష్మణచందా మండలం కనకాపూర్ గ్రామం వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రెండుసార్లు ఎన్నికల ముందు కేసీఆర్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేశారని షర్మిల ఆరోపించారు. బంగారు తెలంగాణ చేస్తానని.. ఉద్యోగాలు కల్పిస్తానని.. నీటి కొరత లేకుండా చేస్తానని చెప్పి.. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా సంక్షేమ పథకాలకు నిధులు లేకుండా పోయాయని..  ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ సహా చాలా పథకాలకు నిధులు లేకుండా పోయాయన్నారు. 

ఉద్యోగాలు లక్షల్లో ఖాళీగా ఉంటే.. కంటి తుడుపుగా భర్తీ చేపట్టి మభ్యపెడుతున్నారని.. అలాగే నీటి కోసం అంటూ చేపట్టిన ప్రతి ప్రాజెక్టులో అవినీతిని ఏరులై పాలిస్తున్నారని.. ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని షర్మిల విమర్శించారు.