
కుళ్లిపోయిన అవయవానికి యాంపుటేషన్ జరపాల్సిందే అంటారు డాక్టర్లు. లేనట్లయితే మొత్తం శరీరానికే ప్రమాదం. జనంకూడా అదే తీరుగా ఆలోచిస్తున్నారు. సమాజం ఒక దశ వరకు ఎటువంటి ఘటనలనైనా భరిస్తుంది. కానీ, సామాన్యులపై హింస, ఆడవాళ్లపై రేప్‌లు, వేధింపులు, గ్యాంగ్‌స్టర్ల దౌర్జన్యాలు, అమాయకుల భూముల కబ్జాలు, ప్రభుత్వ ఆస్తులను సొంతం చేసుకోవడం, ఊళ్లకు ఊళ్లే ముఠాలు పంచేసుకోవడం, ఊళ్ల మీద పడి బందిపోట్లు దోచుకోవడం వంటివి సమాజం భరించలేని స్థాయికి చేరిపోయినప్పుడు… అందుకు బాధ్యులైనవాళ్లను ఖతం చేయాలని కోరుకుంటున్నారు. గతంలో ఇటువంటి సందర్భాలను జనం గుర్తుచేసి, ఇంతకు మించిన పరిష్కారం ఉందా అని నిలదీస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో స్మగ్లింగ్, మహారాష్ట్రలో గ్యాంగ్‌స్టర్ల ఆధిపత్యం, ఉత్తరప్రదేశ్‌లో రౌడీయిజం, మధ్యప్రదేశ్‌లో బందిపోటు దొంగతనాలు ఎన్‌కౌంటర్ల తర్వాతనే తగ్గాయన్నది జనంలో గట్టిగా పాతుకుపోయింది.
హైదరాబాద్‌లో నయీముద్దీన్ అనే రౌడీ… భూ కబ్జాలు, సెటిల్ మెంట్లతో 500 కోట్ల ఆస్తిపరుడై, మాఫియా డాన్‌గా ఎదిగిపోయాడు. అతని బాధితుల సంఖ్య పెరిగిపోసాగింది. చివరకు గట్టి నిఘాతో, 2016 ఆగస్టు 8న షాద్ నగర్ సమీపంలో నయీంను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
70 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ లోని చంబల్ లోయలో దాక్కుని మూడు రాష్ట్రాల బోర్డర్ గ్రామాలను గడగడలాడించినవాడు డాకూమాన్ సింగ్ . 11 వందలకు పైగా దోపిడీలు, 185 హత్యలు చేసినట్లుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి. చివరకు 1955లో ఖతమయ్యాడు.
కర్ణాటకలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ దాదాపు 30 ఏళ్ల పాటు ఫారెస్ట్ డాన్‌గా చెలాయించాడు. తమిళనాడు, కర్ణా టక బోర్డర్‌లోని సత్యమంగళం అడవుల్లో వీరప్పన్ సాగించిన స్మగ్లింగ్‌కి లెక్కలేదు. 2004 అక్టోబర్ 18న పోలీసుల చేతిలో హతమయ్యాడు.
వరంగల్‌లో ముగ్గురు యువకులు బైక్ పై వెళ్తున్న ఇద్దరమ్మాయిలపై యాసిడ్ పోశారు. ఒకమ్మాయి ముఖం, శరీరం కాలిపోయి చనిపోగా, మరో అమ్మాయి తీవ్ర గాయాల పాలైంది. ఈ ముగ్గురూ పోలీసులకు దొరికినట్లే దొరికి పారిపోతూ ఎన్‌కౌంటర్‌లో ఖతమయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లో నిర్భయ్ సింగ్ గుజ్జుర్ అనే బందిపోటు కొన్నాళ్లకు తెర పైకి వచ్చాడు. చక్రనగర్ ఏరియాలోని 40 గ్రామాలు తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఆడవాళ్లు, మద్యం, డబ్బుకోసం ఎంతకైనా తెగించేవాడు. ఏకే 47 రైఫిల్‌తో మోడర్న్ డెకాయిట్‌గా ఉండే నిర్భయ్ 2005 నవంబర్‌లో ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.
మధ్యప్రదేశ్‌లో జవాన్‌గా పనిచేసి, రిటైరైన పాన్ సింగ్ తోమార్ ఆ తర్వాత బందిపోటుగా మారాడు. 1981 అక్టోబర్ ఒకటిన అతడి స్థావరాన్ని చుట్టుముట్టారు. 12 గంటలపాటు సాగిన ఎన్‌కౌంటర్‌లో తోమార్‌తోపాటు అతని గ్యాంగ్ సభ్యులు 10 మందికూడా హతమయ్యారు.