
- పంటల బీమాకు, బ్యాంకు రుణాలకు నోచుకోని కౌలు రైతులు
- చాలా మందికి వడ్డీ వ్యాపారులే దిక్కు..ఎన్‌ఐఆర్‌డీపీఆర్ సర్వేలో వెల్లడి
- నూటికి రూ.5 నుంచి 25 మిత్తితో తెచ్చుకుంటున్న అన్నదాతలు
- రైతు ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానంలో తెలంగాణ
- కడుపు మాడ్చుకుంటున్నరు
వ్యవసాయ పెట్టుబడుల కోసం తినే తిండినీ రైతులు తగ్గించుకుంటున్నారు. పాలు, గుడ్లు, మాంసం ఇతర పౌష్టికాహారానికి అయ్యే ఖర్చులను తగ్గించుకుని వ్యవసాయానికి మళ్లిస్తున్నారని ఎన్‌ఐఆర్‌డీ పీఆర్ నివేదిక వెల్లడించింది. వ్యవసాయం కోసం చేస్తున్న అప్పుల్లో ప్రైవేట్ వ్యక్తుల వద్ద 27 శాతం, బ్యాంకులు, పొదుపు సంఘాల నుంచి 21 శాతం తీసుకొస్తున్నారని, ఆహారాన్ని తీసుకోవడాన్ని తగ్గించడం ద్వారా 13 శాతం ఖర్చులను మళ్లిస్తున్నారని, ఆస్తుల అమ్మకం ద్వారా 8 శాతం సమకూర్చుకుంటున్నారని తెలిపింది. ఆత్మహత్య చేసుకున్నవారిలో 70 శాతం మంది 20- నుంచి 50 ఏండ్లలోపు వారేనని, 59 శాతం మంది నిరక్షరాస్యులని తేలింది. రైతుల అప్పుల్లో వ్యవసాయం కోసమే 32 శాతానికిపైగా ఉంటున్నట్టు గుర్తించారు.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైతుల ఆదాయం వేలల్లో ఉండగా.. వారి అప్పులు మాత్రం లక్షల్లో ఉంటున్నాయి. పంట పెట్టుబడులు, కుటుంబ పోషణ, పిల్లల చదువులు, పిల్లల పెళ్లిళ్ల కోసం అవుతున్న ఖర్చులకు, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయానికి ఏ మాత్రం లంకె కుదరడం లేదు. ఫలితంగా 90 శాతం రైతు కుటుంబాలు అప్పుల సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. అప్పులు, వాటికి మిత్తిలు కట్ట లేక భూములు, ఆస్తులు తనఖా కింద కోల్పోతున్నవారు కొందరైతే.. పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు చేస్తూ భారంగా బతుకు బండిలాగిస్తున్నవారు ఇంకొందరు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని జిల్లాల్లో నూటికి ఐదు రూపాయల నుంచి 25 రూపాయల వరకు మిత్తిలకు తెచ్చి సాగు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి సకాలంలో, పూర్తిస్థాయిలో రుణాలు లభించక వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో రైతుపై సగటున రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు అప్పు ఉన్నట్లు ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) నిర్వహించిన సర్వేలో తేలింది. రైతుల సగటు ఆదాయం నెలకు రూ. 3,523 మాత్రమేనని వెల్లడైంది. రైతులు చేస్తున్న అప్పుల్లో బ్యాంకులు, పొదుపు సంఘాల నుంచి అధికారికంగా తీసుకునేవి 21 శాతమేనని, మిగతావన్ని వడ్డీ వ్యాపారుల నుంచి, ఇతర పద్ధతుల నుంచి తీసుకుంటున్నవేనని తేలింది.
47 శాతం ఆత్మహత్యలు అప్పుల వేధింపులతోనే
ఎక్కువ రైతు ఆత్మహత్యలు అప్పుల బాధతోనే జరగగా, అందులో 47 శాతం మరణాలు అప్పు ఇచ్చినవాళ్లు ఇంటికి వచ్చి వేధించడం వల్లే జరిగినట్లు ఎన్‌ఐఆర్‌డీ పీఆర్ గుర్తించింది. ఈ ఆత్మహత్యల్లో ఎక్కువగా పంటకాలం పూర్తయిన సమయంలోనే జరిగినట్లు తేల్చింది. పంట చేతికి రాగానే.. అప్పులిచ్చినవాళ్లు పైసల కోసం ఒత్తిడి చేయడంతో పంట అమ్మితే వచ్చే పైసలకు, ఉన్న అప్పులకు సరిపోయే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ఎన్ఐఆర్డీపీ గుర్తించింది. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఖరీఫ్ ముగిశాక, యాసంగి పంట కోతల కాలం(నవంబర్, ఏప్రిల్, మే)లో ఎక్కువగా జరుగుతున్నట్లు తేల్చింది. రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడిన ఒక్కో రైతుకు సగటున రూ. 3 లక్షలు, కర్నాటకలో 4.28 లక్షలు రుణభారం ఉన్నట్లు ఎన్‌ఐఆర్‌డీపీఆర్ గుర్తించింది. అప్పులు చేస్తున్నవారిలో సన్న, చిన్న కారు రైతులే ఎక్కువగా ఉంటున్నారు.
ఆత్మహత్యల్లో రెండో స్థానం
రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉంది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం 2014, 2015 సంవత్సరాల్లో దేశంలో మొత్తం 24,926 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, వారిలో 8,295 మంది మహారాష్ట్రకు చెందినవారు ఉన్నారు. 2,747 మంది తెలంగాణ వారు ఉన్నారు. అయితే.. రాష్ట్ర రెవెన్యూ డిపార్ట్‌మెంట్ లెక్కల ప్రకారం 2014 నుంచి 2017 వరకు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 846 మాత్రమే.
ఎన్‌ఐఆర్‌డీపీఆర్ సర్వే ఇలా..
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సిఫార్సు మేరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్ఐఆర్‌డీ పీఆర్) పరిశోధక బృందం దేశంలో ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్న మహారాష్ట్ర, తెలంగాణ, కర్నాటక, మధ్యప్రదేశ్‌లో గత ఏడాది పర్యటించి సర్వే చేపట్టింది. సీహెచ్ రాధికారాణి, సూర్జిత్ విక్రమణ్, నిత్య, సిద్ధయ్య, జగదీశ్, గోవింద్‌తో కూడిన ఈ బృందం తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా చోటు చేసుకున్న సిద్దిపేట, నల్గొండ జిల్లాలను ఎంచుకుంది. ఒక్కో జిల్లాలో 21 గ్రామాలు, 25 కుటుంబాల నుంచి ఈ బృందం వివరాలు సేకరించింది. ‘వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు’ పేరిట మార్చిలో ఎన్‌హెచ్‌ఆర్‌సీకి 286 పేజీల రిపోర్టును సమర్పించింది.
పెరగాల్సిన ఆదాయం.. తగ్గుతోంది
రైతులు ఆదాయం నానాటికీ తగ్గిపోతోంది. 2012–13లో నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) అంచనాల్లో ఒక్కో చిన్నసన్న కారు రైతు ఆదాయం నెలకు రూ. 4,561. అదే ఇటీవల ఎన్ఐఆర్‌డీ పీఆర్ నిర్వహించిన సర్వేలో మాత్రం రూ. 3,523గా తేలింది. ఆదాయం తగ్గిపోవడంతో రైతులు కుంగిపోతున్నారని, ఇంటిల్లిపాదికి సరిగ్గా తిండికూడా పెట్టలేని దుస్థితిలో ఉన్నారని పేర్కొంది.
కౌలు రైతులకు అందని రుణాలు
ఆత్మహత్య చేసుకున్నవారిలో అత్యధికులు చిన్న, సన్నకారు రైతులేనని ఎన్‌ఐఆర్‌డీపీఆర్ సర్వే గుర్తించింది. వీరికి సగటున 1.5 ఎకరాల నుంచి 3.7 ఎకరాల భూమి ఉందని, తెలంగాణ, కర్నాటకలో భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారికి బీమా వర్తించడం లేదని, రుణాలు రావడం లేదని పేర్కొంది.
రూ. లక్ష నుంచి 3 లక్షల దాకా అప్పులు
రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది రైతుల్లో 600 మంది వరకు వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకుంటున్నట్లు గతంలో నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్(ఎన్‌ఎస్‌ఎస్‌వో) నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. దేశంలో రైతులపై అత్యధిక సగటు అప్పున్న మన రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. రూ.2 లక్షల అప్పుతో కేరళ తొలి స్థానంలో ఉంది. లక్షా 23 వేల రూపాయలతో ఏపీ రెండో స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో లక్ష రూపాయల సగటు అప్పుతో మన రాష్ట్రం ఉంది. సగటు అప్పు కేవలం రూ.10 వేలతో అతి తక్కువ అప్పున్న రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నమోదైందని అప్పట్లో ఎన్‌ఎస్‌ఎస్‌వో గుర్తించింది. మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న ఒక్కో రైతు పేరిట సగటున రూ. 3లక్షల వరకు అప్పు ఉన్నట్లు ఇటీవల ఎన్ఐఆర్‌డీ పీఆర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
రైతుకు మద్దతేది?
రాష్ట్రంలో రైతురుణ మాఫీ, రైతు బంధు పథకాలు కొంత మేర ఊరటనిస్తున్నా పూర్తి స్థాయిలో రైతుకు మద్దతునివ్వడం లేదు. 2014-––15కు ముందున్న బ్యాంకు రుణాలు రూ.17వేల కోట్ల వరకు ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత బ్యాంకులకు విడతల వారీగా చెల్లించింది. రుణాల రద్దు తర్వాత బ్యాంకుల నుంచి రైతులకు పూర్తి స్థాయిలో సహకారం ఉండటం లేదు. రెన్యూవల్ పేరుతో సీజన్ అయిపోయేంత వరకు కాలయాపన చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. రైతుబంధు పథకం కొంత వరకే మేలు చేస్తున్నది. తక్కువ భూములున్న వారే కౌలుకు భూమి తీసుకుని సాగు చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి ఇటు బ్యాంకుల నుంచి సాయం అందడం లేదు.. అటు రైతు బంధూ అమలు కావడం లేదు. మరో వైపు ప్రతి బ్యాంకు బ్రాంచీ యేటా 100 మంది కొత్త రైతులకు రుణాలు ఇవ్వాలని ఆర్బీఐ నిబంధనలు చెప్తున్నాయి. వీటి గురించి కూడా ఆయా
బ్రాంచులు పట్టించుకోవడం లేదని రైతు సంఘాల నేతలు అంటున్నారు.
నూటికి రూ. 25 మిత్తి!
రాష్ట్ర రైతు అప్పుల సేద్యం చేస్తున్నాడు. కొన్ని జిల్లాల్లో నూటికి ఐదు రూపాయల నుంచి 25 రూపాయల వరకు మిత్తీలకు తెచ్చి సాగు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి సకాలంలో, పూర్తిస్థాయిలో రుణాలు లభించని కారణంగా వడ్డీవ్యాపారుల వద్దకు వెళ్తున్నారని రైతు సంఘం నాయకులు మల్లారెడ్డి చెప్తున్నారు. జూన్ నుంచి నవంబర్ మాసాల మధ్య రైతులకు పెట్టుబడి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. విత్తనాలు, ఎరువుల, వ్యవసాయ పరికారాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు అవసరం అవుతాయి. ఆ సమయంలోనే రైతులకు బ్యాంకుల సాయం అందడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దళారీ వ్యవస్థ ఇందులో కీలకం. ఈ జిల్లాలో 80 శాతానికి పైగా రైతులు దళారీ వ్యవస్థ నుంచే అప్పులు తెచ్చుకుంటున్నారని, కొన్ని సార్లు నూటికి 20 నుంచి 25 రూపాయల మిత్తి చెల్లిస్తున్నారని జిల్లాకు చెందిన రైతు సంఘం నాయకులు దత్తాత్రి చెప్పారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాల రైతులు భూమి గిరువు పెట్టి అప్పులు తెచ్చుకుని సాగు చేసుకుంటున్నారని రైతు మెదక్ జిల్లాకు చెందిన రైతు నాయకులు మల్లారెడ్డి అంటున్నారు. ఎకరానికి ప్రభుత్వం రైతు బంధుకింద ఇస్తున్న సాయానికి అదనంగా మరో 20వేలకు పైగా అప్పు చేయాల్సి వస్తుందని రైతు స్వరాజ్య వేదిక నాయకుడు రవి చెప్పారు.
పేరుకే భారీ ప్రణాళిక
రాష్ట్ర ప్రభుత్వం యేటా వ్యవసాయ ప్రణాళిక భారీగా ప్రకటిస్తోంది. కానీ.. ఆచరణ దానికి భిన్నంగా ఉంటున్నది. అనుకున్న లక్ష్యాన్ని గడిచిన ఐదేండ్లలో ఏనాడూ చేరుకోలేకపోయింది. రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య 54 లక్షలకు పైగానే ఉంటుంది. ఇందులో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య సుమారు 39 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉంది. 10 లక్షల నుంచి 15 లక్షల మంది రైతులు బ్యాంకుల ద్వారా ఎలాంటి రుణాలు పొందడం లేదు. వీరిలో సన్న, చిన్న కారు రైతులే ఎక్కువ. బ్యాంకుల ద్వారా రుణాలు పొంద లేని వారు అనివార్యంగా వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. నాలుగేండ్ల కింద ఎన్‌ఎస్‌ఎస్‌వో చేసిన సర్వే రాష్ట్రంలో 19 లక్షల రైతుల కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయని తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను పక్కాగా తయారు చేసి అమలు చేస్తే రైతులందరికీ బ్యాంకుల నుండే అప్పులు దొరికే అవకాశం ఉంటుంది. పండిన పంటలకు మార్కెట్ ధర కల్పించాల్సి ఉంటుంది. ఈ రెండూ చేస్తే రైతులను కష్టాల నుంచి, అప్పుల నుంచి బయట వేసినట్లవుతుందని రైతు సంఘాలు అంటున్నాయి.
ఎన్‌ఐఆర్‌డీపీఆర్ సూచనలు..
- బోరుబావుల కింద ఉన్న వ్యవసాయ భూములను మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్‌తో కనెక్ట్ చేయాలి.
- గ్రామాల్లో కమ్యూనిటీ ఆధారిత ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్(ఎఫ్‌పీఓ), ఫార్మర్స్ ఇంట్రెస్ట్ గ్రూప్స్(ఎఫ్‌ఐజీ)లను ప్రోత్సహించాలి.
- రైతు ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలను మెగరుపరచాలి.
- వ్యవసాయ ఉత్పత్తుల ధరలను స్థిరీకరించాలి.
- పంట ఉత్పత్తులకు సరైన అసెస్‌మెంట్, గ్రేడింగ్‌తో ఈనామ్‌ను అమలు చేయాలి.
- ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం త్వరగా ఇవ్వాలి.
పక్కా ప్రణాళిక ఏది?
శాస్త్రీయంగా రుణ ప్రణాళిక తయారు చేయాలి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రాష్ట్రంలోని అన్ని పంటలకు రుణాల ప్రణాళిక పక్కగా ఉండాలి. అప్పుడు రాష్ట్రంలోని అందరూ రైతులకు రుణం వస్తుంది. ప్రస్తుతం 35 లక్షల మంది రైతులకే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. మరో 29 లక్ష మంది బ్యాంకుల గడప తొక్కడం లేదు. రుణ ప్రణాళికను ఏటా రెండు మూడు వేల కోట్ల పెంచుతున్నారు తప్ప పక్కా ప్రణాళిక లేదు.
– సారంపల్లి మల్లారెడ్డి,
అఖిల భారత రైతు సంఘం నేత