ప్రతి గంటకు 17ప్రాణాలు రోడ్డుకు బలి

ప్రతి గంటకు 17ప్రాణాలు రోడ్డుకు బలి

టూ వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలె. కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలె. రాంగ్ రూట్లో పోకూడదు. ఓవర్ లోడ్ కానియ్యొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్, మితిమీరిన స్పీడ్ అసలే వద్దు..” ఇలా అధికారులు, నిపుణులు ఎన్ని సూచనలు ఇచ్చినా ఫలితం కన్పిస్తలే. దేశంలో ఏటా యాక్సిడెంట్లు, వాటి వల్ల చావులూ పెరుగుతూనే ఉన్నయి. 2018లో ఆల్ టైం రికార్డ్ స్థాయిలో రోడ్ యాక్సిడెంట్లు పెరిగాయని శుక్రవారం కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ  విడుదల చేసిన ‘ 2019 రోడ్ యాక్సిడెంట్ రిపోర్ట్’ వెల్లడించింది.

రోజూ 415 మంది బలి

దేశవ్యాప్తంగా 2018లో 4,67,044 యాక్సిడెంట్లు జరగగా, వీటిలో 1,51,417 మంది చనిపోయారని నివేదిక తెలిపింది. అంటే.. దేశంలో  ప్రతి రోజూ యావరేజ్ గా1280 యాక్సిడెంట్లు జరుగుతున్నయి. ఈ యాక్సిడెంట్లకు రోజూ 415 మంది బలి అయిపోతున్నరు. సుమారుగా ఒక గంటకు 53 యాక్సిడెంట్లు జరుగుతుండగా, 17 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దేశం మొత్తం మీద 2018లో యాక్సిడెంట్లు 0.5% పెరగగా, యాక్సిడెంట్ మరణాలు మాత్రం 2.4%కు పైగా పెరిగాయని రిపోర్ట్ తెలిపింది. ప్రతి 100 యాక్సిడెంట్లకు ఎంత మంది చనిపోతున్నారు? అన్న అంశం ఆధారంగా రోడ్ యాక్సిడెంట్ తీవ్రతను అంచనా వేయగా, ఇది 0.5% పెరిగినట్లు రిపోర్ట్ పేర్కొంది. ఇక ప్రాణాలు పోయే స్థాయిలో టూవీలర్ యాక్సిడెంట్లు ఎక్కువగా 31.4% జరగగా, ఆ తర్వాత కార్లు, జీప్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగాయి. గత ఏడాది రోడ్ యాక్సిడెంట్లలో టూవీలర్ రైడర్లే 35.2 శాతం చనిపోయారు.

యూపీ టాప్

దేశవ్యాప్తంగా 2018లో యాక్సిడెంట్ మరణాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. యూపీ తర్వాత మహారాష్ట్ర, తమిళనాడులో ఎక్కువ మరణాలు సంభవించాయి. అన్ని రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీల్లో కలిపి 2017లో 1.47 లక్షల మంది చనిపోగా, 2018లో 1.51 లక్షల మంది మరణించారు. అంతకుముందు ఏడాది కన్నా 3500 ఎక్కువగా నమోదయ్యాయి. తెలంగాణలో 20,325  యాక్సిడెంట్లు జరగ్గా 5,985 మంది చనిపోయారు. 2017తో (6,596) పోలిస్తే 10 శాతం మేర మరణాలు తగ్గాయి.