కోపం వల్ల ధర్మానికి విఘాతం.. ప్రతి ఒక్కరూ కోపాన్ని విడిచిపెట్టాలి

కోపం వల్ల ధర్మానికి  విఘాతం.. ప్రతి ఒక్కరూ కోపాన్ని విడిచిపెట్టాలి
  • యః సముత్పతితం క్రోధం
  • నిగృహ్ణాతి హయం యథా
  • స యం తేత్యుచ్యతే
  • సద్శిర్నయోరశ్మిషులంబతే

మహాభారతం ఆదిపర్వంలో కచదేవయానుల కథలో శుక్రాచార్యుడు తన కుమార్తె అయిన దేవయానితో ఈ విధంగా పలికాడు.రాక్షసరాజయిన వృషపర్వుని దగ్గర శుక్రాచార్యుడు ఆచార్యునిగా ఉంటాడు. వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని. ఒకనాడు కొలనులో స్నానాలు చేసే సమయంలో.. శర్మిష్ఠకు, దేవయానికి మధ్య ఏర్పడిన చిన్న వివాదం కారణంగా దేవయాని నగరంలో కోపంగా ప్రతిజ్ఞ చేసింది. ఆ సమయంలో శుక్రాచార్యుడు తన కుమార్తెకు ఇలా బోధించాడు. ‘‘ఎదుటివారు ఎంత కఠోరంగా ప్రసంగించినా, క్రోధం ప్రదర్శించినా ఏమీ పట్టించుకోకుండా పోయేవాడే ఉత్తముడు.  క్రోధాన్ని నిగ్రహించగలవాడు మదించిన సింధుజాతి అశ్వాలను నడిపే సారథి కంటె ఘనుడు. ఉరకలు వేసే క్రోధాన్ని క్షమతో అణగద్రొక్కే వ్యక్తికి ఈ ప్రపంచంలో అపజయం లేదు. నూరు యజ్ఞాలు చేసినవాని కంటే కోపం లేనివాడు గొప్పవాడు. బుద్ధిగలవారికి క్రోధం కొనియాడతగినది కాదు. ఎన్ని యజ్ఞాలు, దానాలు, తపస్సులు చేసినా ఒక్కసారి క్రోధం వస్తే అన్నిటి ఫలమూ పొల్లయిపోతుంది. కోపం లేనివానికే వీటి మహత్తర ఫలం సిద్ధిస్తుంది. కోపిష్ఠి యజ్ఞయాగాదులకు అసమర్థుడు. వానికి ఇహపరాలు లేవు. ఆజన్మ క్రోధ స్వభావం కలవానిని... అతని భార్యా బిడ్డలతో పాటు సేవకులు కూడా అతడిని విడిచేస్తారు’’ అని హితవు పలికాడు.

(పురాణపండ రామమూర్తి మహాభారతం ఆదిపర్వం నుండి)

మనిషి.. కోపంలో విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడు. శాంతంగా ఉన్నవారు చేసే పనులకు సత్ఫలితాలు లభిస్తాయి. అందుకే త్యాగరాజు ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ అని తన కీర్తనలో శాంత స్వభావం గురించి వివరించాడు. కోపం అనే పదాన్ని అగ్నితో సమానంగా చెబుతూ, ‘కోపాగ్ని’ అన్నారు. ఆ కోపం అనే అగ్ని కోపం వచ్చిన వ్యక్తిని దహించేస్తుంది.

కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము... ఆ ఆరింటినీ కలిపి అరిషడ్వర్గాలు అన్నారు. ఈ ఆరూ మనిషిలో ఉండే అంతఃశత్రువులు. బాహ్య శత్రువుల కంటె అంతః శత్రువుల వలన కలిగే నష్టం అధికంగా ఉంటుంది.  దుర్వాసమహర్షికి ముక్కు మీదే కోపం ఉంటుందని ఆయనను కోపిష్ఠి అంటారు.
క్రోధం అంటే కోపం లేదా ఆగ్రహం. ఎవరైనా మన మనసుకు నచ్చని పని చేసినా, మన అభిప్రాయాన్ని గౌరవించకుండా విమర్శించినా, మన మాటను వ్యతిరేకించినా మనకు వారి మీద కోపం కలుగుతుంది. ఈ కోపం కారణంగా విచక్షణ కోల్పోయి, ఎదుటివారి మీద దాడి చేయటానికి కూడా వెనుకాడరు. పరుష పదజాలంతో దూషిస్తారు. ఇలా చేయటం వల్ల మనలను చూసే వారి దృష్టిలో మన పట్ల చులకన భావం ఏర్పడుతుంది. అందువల్లనే కోపం వచ్చినప్పుడు ఆవేశానికి లోను కాకుండా, వీలైనంతవరకు మనస్సును శాంతపరచుకోవటానికి ప్రయత్నం చేయాలని పెద్దలు చెప్తారు.

కోపం అనేది సృష్టిలో ఒక సహజమైన భావోద్వేగం. ప్రాణి మనుగడ కోసం ప్రకృతి ప్రసాదించిన వరం. ఇతర ప్రాణుల వల్ల తన ప్రాణానికి ఆపద ఏర్పడినప్పుడు ఆ ప్రాణి తన మనుగడ కోసం కోపాన్ని ఆయుధంగా వాడుతుంది. మానవులలో ఈ క్రోధానికి కార ణాలు... ప్రాణాపాయ పరిస్థితి, మనుగడ సాగించడం... కంటే కూడా సామాజిక పరిస్థితులే ప్రధాన కారణంగా కనిపిస్తాయి. మనిషికి ఉండే వ్యక్తిత్వం, ఆ వ్యక్తికి ఉండే అహంభావం. ఇవే కాకుండా... నమ్మకాలు, గుర్తింపు, గౌరవం, ఆధిపత్యం.. ఇటువంటి అంశాలకు లేదా భంగం కలిగినప్పుడు మనిషిలో నిద్రాణంగా ఉన్న క్రోధం బుసలు కొడుతూ బయటకు వస్తుంది. భూమి మీద జీవించే మిగతా ప్రాణులు మాత్రం వాటి కోపాన్ని...  అవతలి ప్రాణితో పోరాడటం లేదా పలాయనం అనే రెండు పద్ధతుల ద్వారా ప్రదర్శిస్తాయి.

మానవులకు నోరు ఉంది కాబట్టి.. అరవడం, తిట్టడం, అవమానించడం వంటి పనులతో పాటు, అవతలి వారి మీద చెయ్యి చేసుకోవడం, వారి మీద దాడి చేయడం, చేతిలో ఉన్న వస్తువులను పగలగొట్టడం లాంటి పనులతో కోపాన్ని ప్రదర్శిస్తారు. కొందరు మౌనం ద్వారా, కొందరు తిండి మానేయడం ద్వారా, కొందరు అలగడం ద్వారా, కొందరు సహాయ నిరాకరణ ద్వారా కోపాన్ని మెత్తగా ప్రదర్శిస్తారు. ‘క్రోధో మూలమనర్థానాం’ వాస్తవానికి కోపం అన్ని అనర్థాలకు మూలం. కోపం వల్ల సంసారం విచ్ఛిన్నమవుతుంది. కోపం ధర్మానికి విఘాతం కలిగిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కోపాన్ని విడిచిపెట్టాలి.

- డా. పురాణపండ వైజయంతి