హుజూర్​నగర్​లో పోలింగ్ కు అంతా రెడీ

హుజూర్​నగర్​లో పోలింగ్ కు అంతా రెడీ

ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఉదయం 7 నుంచి సాయంత్రం
5 గంటల వరకు పోలింగ్​
మొత్తం ఓటర్లు 2,36,842
పోలింగ్​ కేంద్రాలు 302
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
అన్ని కేంద్రాల్లో వెబ్​కాస్టింగ్​

సూర్యాపేట/హుజూర్నగర్, వెలుగుసూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో జరుగుతున్న ఏకైక ఉపఎన్నిక కావడంతో అందరి దృష్టి హుజూర్​నగర్ పై ఉంది. సోమవారం పోలింగ్ జరగనుండటంతో ఎన్నికల అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. 24న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో 76 మంది నామినేషన్లు వేయగా చివరికి 28 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్  పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నియోజకవర్గంలో మొత్తం 7 మండలాల పరిధిలో 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 79 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి అక్కడ  ప్రత్యేకంగా రిజర్వుడ్  పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ భాస్కరన్ పర్యవేక్షణలో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎస్సైతో కూడిన బృందం విధులు నిర్వర్తిస్తారు. ఉప ఎన్నికల పోలింగ్ లో మొత్తం 1500 మంది ఎన్నికల సిబ్బంది, 2200 మంది పోలీసులు పాల్గొననున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద  144 సెక్షన్ అమలులో ఉంటుంది. నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో  సిబ్బందికి పోలింగ్ సామగ్రిని ఆదివారం పంపిణీ చేశారు. రూట్ ఆఫీసర్లు, సెక్టోరియల్  ఆఫీసర్ల  పర్యవేక్షణ లో పోలీస్ ఎస్కార్ట్ వాహనాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బంది ఆదివారం రాత్రికి అక్కడే బస చేసి సోమవారం ఉదయం 6 గంటలలోపు ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు.

ఉదయం 7 గంటల నుంచి…

ఓటర్లకు ఇప్పటికే  ఓటరు స్లిప్ లను పంపిణీ చేశారు. గుర్తింపు కార్డు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా అధికారులు ఓటర్లను కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల కోడ్ ను పకడ్బందీగా అమలు చేస్తున్న అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా 14 చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. వీటితోపాటు సర్వెలెన్స్ టీంలు, ఫ్లయింగ్  స్క్వాడ్ లు, వీడియో సర్వెలెన్స్​ టీంలు  విధులు నిర్వహిస్తున్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇందు కోసం ఇంజనీరింగ్ స్టూడెంట్ల సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రతి ఎన్నికల్లోలాగానే ఈ ఎన్నికల్లో కూడా ఈవీఎంలలో నోటా పెట్టారు. వీవీ ప్యాట్ మిషన్ ను ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఓటు వేసిన వ్యక్తికి ఎవరికి ఓటు వేశారో వీవీ ప్యాట్ మిషన్ లో 10 సెకండ్ల పాటు కనిపిస్తుంది. ఆ తర్వాత స్లిప్ బాక్స్ లో పడిపోతుంది.