ఇండ్ల నుంచి శ్మశానాల దాకా అన్నింటికీ గులాబీ రంగు

ఇండ్ల నుంచి శ్మశానాల దాకా అన్నింటికీ గులాబీ రంగు
  • సుప్రీం తీర్పు, నేషనల్​ బిల్డింగ్​ కోడ్​కు 
  • విరుద్ధంగా టీఆర్​ఎస్​ జెండా రంగేస్తున్నరు
  • లీడర్ల ఒత్తిళ్ల వల్లే వేయాల్సి వస్తోందంటున్న ఆఫీసర్లు
  • మండిపడుతున్న ప్రతిపక్షాలు

(వెలుగు, నెట్​వర్క్​): డబుల్​ బెడ్రూం ఇండ్ల నుంచి శ్మశానాల దాక.. స్కూళ్ల నుంచి దవాఖాన్ల దాక.. ఆఫీసుల నుంచి గెస్ట్​ హౌస్​ల దాక..  టీఆర్​ఎస్​ లీడర్లు వేటినీ ఇడ్సిపెడ్తలేరు. అన్నిటికీ పార్టీ జెండా రంగు వేయిస్తున్నారు. పింక్​ కలర్​తో నింపేస్తున్నారు. కొత్త నిర్మాణాలతో పాటు పాతవాటికి కూడా గులాబీ రంగు అద్దుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల ఆదేశాలు, ఒత్తిళ్ల మేరకే తాము తప్పనిసరై ఇట్లా బిల్డింగులకు పింక్​ కలర్​ పెయింట్ ​వేయిస్తున్నామని ఆఫీసర్లు చెప్తున్నారు. సుప్రీం తీర్పుకు, నేషనల్​ బిల్డింగ్​ కోడ్​కు విరుద్ధంగా ఇట్లా పార్టీ రంగేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.   

ఈజీఎస్​ ఫండ్స్​తో కట్టి.. గులాబీ రంగేసిన్రు!
రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆరేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా  2 లక్షల 91 వేల 57  డబుల్​ బెడ్రూం ఇండ్లను శాంక్షన్​ చేసింది. ఇందులో ఇప్పటి వరకు లక్ష వరకు ఇండ్లను నిర్మించింది. నిర్మాణం పూర్తయిన ఇండ్లకు దాదాపు టీఆర్​ఎస్​ పార్టీ జెండా కలరైన గులాబీ రంగులే వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వం ఊరూరా శ్మశానవాటిక, డంపు యార్డు, విలేజ్​ పార్కులు, 2604  క్లస్టర్ల పరిధిలో  రైతువేదికలను నిర్మించింది. ఒక్కో శ్మశాన వాటికకు రూ. 12 లక్షలు, డంపింగ్ యార్డు కు రూ. 2.50 లక్షలు, విలేజ్​పార్కుకు రూ.  5.7 లక్షలు, రైతువేదికకు రూ. 22 లక్షల చొప్పున దాదాపు రూ. 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఇవన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈజీఎస్​ ఫండ్స్​తోనే కంప్లీట్​ చేసింది. వీటికి పింక్​ కలర్​ వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినవాటికి కూడా టీఆర్​ఎస్​ జెండా కలర్​ ఎలా వేస్తారని బీజేపీ, ఇతర ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.

పంచాయతీ ఆఫీసులకు కూడా..
కొత్తగా కట్టే పంచాయతీ ఆఫీసులకు, మండల పరిషత్​ ఆఫీసులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, సోషల్​ వెల్ఫేర్​ స్కూళ్లకు, కాలేజీలకు, చివరికి ఆర్​అండ్​బీ గెస్ట్​ హౌస్​లకు కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పింక్​ కలర్​ వేయిస్తున్నారు. కరీంనగర్​ రూరల్​ మండలంలోని తాహెర్​ కొండాపూర్​లో కొత్తగా కట్టిన గ్రామ పంచాయతీ బిల్డింగ్​కు పింక్​ కలర్​ వేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు గ్రామ పంచాయతీ ఎదుట  ఆందోళన నిర్వహించారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న15వ ఫైనాన్స్ ఫండ్స్​తో కట్టిన పంచాయతీ ఆఫీసుకు ఎలా టీఆర్​ఎస్​ పార్టీ రంగు వేస్తారని ఆఫీసర్లను నిలదీశారు. ఇదే జిల్లాలోని తిమ్మాపూర్ మండల పరిషత్ కార్యాలయానికి  గులాబీ రంగు వేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొరపల్లి రమణ ఆధ్వర్యంలో ఆఫీసు వద్ద  ఆందోళన చేశారు. వెంటనే కలర్ ను తొలగించాలని డిమాండ్​ చేస్తూ ఎంపీడీవో రవీందర్ రెడ్డికి  వినతి పత్రం అందించారు. ఇలా రోజుకో చోట ఆందోళన జరుగుతుండడంతో వారికి సర్ది చెప్పలేక ఆఫీసర్లు తలపట్టుకుంటున్నారు.

ఏపీలో కూడా ఇట్లనే చేస్తే..!
పక్క రాష్ట్రం ఏపీలో వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక  కట్టిన గ్రామ పంచాయతీలు, వార్డు సచివాలయాలకు ఆ పార్టీ జెండా కలర్​ వేయించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2019 ఆగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టు 11న అక్కడి పంచాయతీరాజ్ శాఖ  మెమో రూపంలో ఉత్తర్వులు ఇచ్చింది.  ఇదే అదనుగా సచివాలయాలతో పాటు చాలా ప్రభుత్వ భవనాలను  వైఎస్సార్​​సీపీ జెండా రంగులోకి మార్చేశారు. ఆఖరికి వాట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ ట్యాంకులు, క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెంట్ స్తంభాలు, శ్మశానాలకు కూడా పార్టీ మూడు రంగులేశారు. దీనిపై గుంటూరు జిల్లా ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లపాడుకు చెందిన ఎం.వెంకటేశ్వర్​రావు త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ పంచాయతీ కార్యాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యానికి వైఎస్సార్​సీపీ  జెండా రంగులు వేయడాన్ని సవాల్​చేస్తూ అక్కడి హైకోర్టులో పిటిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ వేశారు. దీంతో ప్రభుత్వ ఆఫీసులకు పార్టీ రంగులు వేసే ప్రక్రియను నిలిపివేయాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఆదేశిస్తూ జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి 27న హైకోర్టు మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధ్యంత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర ఉత్తర్వులు ఇచ్చింది. అక్కడి ప్రభుత్వం తెలివిగా మూడు రంగులకు తోడు మరో రంగు వేయించింది. దీనిపై కూడా హైకోర్టు మొట్టికాయలు వేయడంతో  సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ ప్రభుత్వానికి అక్కడ కూడా ఎదురుదెబ్బతగిలింది. పంచాయతీలు, ప్రభుత్వ ఆఫీసులకు వేసిన నాలుగు రంగులూ తొలగించాల్సిందేనని తీర్పు చెప్పింది. ఈ విషయంలో  నేషనల్​ బిల్డింగ్​ కోడ్ ను అన్ని ప్రభుత్వాలు విధిగా పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ రంగులు వేయరాదని​ గతేడాది జులైలో స్పష్టం చేసింది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ప్రతి బిల్డింగ్​కు గులాబీ రంగు వేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.  ఇది ముమ్మాటికీ నేషనల్​ బిల్డింగ్​ కోడ్​కు,  సుప్రీంకోర్టు గైడ్​లైన్స్​కు విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆపకుంటే.. కోర్టుకు పోతం 
ప్రభుత్వ భవనాలు, డబుల్‌‌ బెడ్‌‌ రూమ్‌‌ ఇండ్లు, గ్రామ పంచాయతీలకు పార్టీ రంగు వేయడం చట్ట విరుద్ధం. ఇలా గులాబీ రంగు వేయడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. ఏపీలో ఇలాగే పార్టీ రంగులు వేస్తే హైకోర్టు చట్ట విరుద్ధమని తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం పార్టీ రంగులు వేయడాన్ని ఆపకుంటే కోర్టుకు వెళ్తాం. 
- ఎం.రఘునందన్‌‌ రావు, దుబ్బాక ఎమ్మెల్యే

ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోలె.. 
తాహెర్ కొండాపూర్ గ్రామంలో కొత్తగా కడ్తున్న పంచాయతీ బిల్డింగుకు టీఆర్ఎస్ జెండా రంగు వేస్తున్నారని ఆఫీసర్లకు చెప్పినం. కానీ వాళ్లు పట్టించుకోలేదు. ‘ఆఫీసులకు గులాబీ రంగు వేయాలనే సూచన ఉంది’ అంటూ జవాబు ఇచ్చారు. అధికారులు అధికార పార్టీకి దాసోహమంటూ, వారి బాధ్యతలు మరిచిపోవడం కరెక్టు కాదు. ఇట్లనే పక్క రాష్ట్రంలోనూ పార్టీ రంగులు వేస్తే హైకోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తుంచుకోవాలి.  
-  మాడిశెట్టి సంతోష్ కుమార్, బీజేపీ కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షుడు

ప్రజల సొమ్ముతో పార్టీ ప్రచారం 
ప్రజల సొమ్ముతో పార్టీ ప్రచారం చేసుకుంటున్రు. గవర్నమెంట్ బిల్డింగులకు ప్రజల డబ్బులతో పార్టీ రంగు వేయడం మంచి పద్ధతి కాదు. టీఆర్ఎస్  ప్రజా ప్రతినిధులు, ఆ పార్టీ లీడర్లు నిర్మించుకునే ఇండ్లకు గులాబీ రంగు వేసుకుంటే బాగుంటుంది. 
- కైలాస్ శ్రీనివాసరావు, డీసీసీ ప్రెసిడెంట్, కామారెడ్డి