మోదీ టూర్​కు అంతా రెడీ .. పటాన్ చెరు పటేల్ గూడాలో బహిరంగ సభ

మోదీ టూర్​కు అంతా రెడీ .. పటాన్ చెరు పటేల్ గూడాలో బహిరంగ సభ
  • 161వ నేషనల్ హైవే ప్రారంభోత్సవం
  • రూ.9,021 కోట్ల పనులకు శంకుస్థాపనలు

సంగారెడ్డి, వెలుగు: పీఎం మోదీ టూర్​కు అంతా రెడీ అయింది. జిల్లాలో రూ.9,021 కోట్ల పనులకు మోక్షం లభించనుంది. ఇందులో భాగంగా నాందేడ్ అకోలా 161వ నేషనల్ హైవేను ప్రారంభిస్తారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం 11 గంటలకు పటాన్ చెరు మండలం పటేల్ గూడ ఎల్లంకి కాలేజీ దగ్గర ఎస్ఆర్ ఇన్ ఫినిటీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే 14 అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా బీజేపీ శ్రేణులు, ప్రజలు మోదీ పర్యటనకు హాజరయ్యేందుకు ఆ పార్టీ జిల్లా కమిటీ ప్లాన్ చేసింది. పార్టీ నాయకులు కూర్చునేందుకు ఒక ప్రాంగణం, అధికారులు కూర్చునేందుకు మరో ప్రాంగణాన్ని సభాస్థలి వద్ద ఏర్పాటు చేశారు.

వాహనాల రూట్ మ్యాప్ చేంజ్

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రధాని మోదీ సభకు వచ్చే వాహనాల రూట్ మ్యాప్ లో మార్పులు చేసినట్టు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. సోమవారం సాయంత్రం సభా ప్రాంగణం వద్ద ఎస్పీ మీడియాతో మాట్లాడారు. పటాన్ చెరు అమీన్ పూర్ పీఎస్​పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు చెప్పారు. ప్రధాని పర్యటనలో రెండు వేల మందితో కట్టుదిట్టమైన మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. సభా ప్రాంగణానికి 5 కిలో మీటర్ల దూరం వరకు నో ఫ్లై జోన్ గా నిర్ణయించినట్లు చెప్పారు. ఎవరైన డ్రోన్లను ఎగురవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భద్రత కట్టుదిట్టం

ఇదిలా ఉంటే ప్రధాని రాక సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. ప్రధాని పాల్గొనే ప్రాంతాలను కేంద్ర భద్రత బలగాల బృందం సోమవారం ఉదయమే స్వాధీనం చేసుకొని భద్రత చర్యలు చేపట్టింది. జిల్లాలో ఎక్కడా కూడా రిమోట్ డ్రోన్లను ఆకాశంలో ఎగరకుండా నిషేదం విధించింది. రెండు హెలిపాడ్ లను సిద్ధం చేసి ఉంచారు. హెలిపాడ్ వద్ద బాంబ్స్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేపట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా ప్రధాని పర్యటించే రెండు కిలోమీటర్ల మేర రెడ్ అలర్ట్ ప్రకటించినట్టు కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు.