ఇయ్యాల్నే పోలింగ్..రాష్ట్రంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా

ఇయ్యాల్నే పోలింగ్..రాష్ట్రంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా
  •     మావోయిస్ట్​ ప్రభావిత 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 గంటల వరకే 
  •     ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
  •     ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సీఈవో వికాస్ రాజ్ పిలుపు 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్స్, ఇంక్, ఓటరు లిస్టు తదితర ఎన్నికల సామాగ్రి తీసుకుని సిబ్బంది ఆదివారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.

సోమవారం ఉదయం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు పొలిటికల్ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని ఈసీ ఈసారి పోలింగ్ ​కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలను అన్ని రకాలుగా చెకింగ్​ చేసిన తర్వాత 1,05,019 బ్యాలెట్​యూనిట్లు, 44,569 కంట్రోల్​యూనిట్లు, 48,134 వీవీప్యాట్లు పోలింగ్ కోసం సిద్ధం చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిలో 90 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనుంది. దాదాపు 10 వేల  పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి, ఆయా చోట్ల మూడంచెల భద్రత కల్పించింది. ఈ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలతోనూ నిఘా పెట్టింది. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించబోమని స్పష్టం చేసింది.

కాగా, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, స్వేచ్ఛగా ఓటు వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఓటు వేయాలని కోరారు. 

3 లక్షల మంది సిబ్బంది

ఈసారి పోలింగ్​విధుల్లో దాదాపు 2 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. 12,909 మంది మైక్రో అబ్జర్వర్లు.. 3,522 మంది సెక్టార్, రూట్​ఆఫీసర్లు.. 1,200 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్, రెండొందల మందికి పైగా మానిటరింగ్ ఆఫీసర్లు ఉన్నారు. ఎస్ఎస్ టీ, వీడియో సర్వైలెన్స్ టీమ్స్ కూడా ఉన్నాయి. ఇక ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.

బందోబస్తు విధుల్లో 72 వేల మంది రాష్ట్ర పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 20 వేల మంది సిబ్బంది ఉన్నారు. వీరితో పాటు 160  కేంద్ర కంపెనీల బలగాలు, ఎక్సైజ్, ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ల నుంచి 7 వేల మంది బందోబస్తు విధుల్లో ఉన్నారు. మొత్తంగా దాదాపు లక్ష మంది పైనే భద్రత విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు అన్ని రకాలుగా కలిపి రూ.320 కోట్ల విలువైనవి సీజ్​చేశారు. 

సికింద్రాబాద్ లో 45 మంది పోటీ

రాష్ట్రంలోని 17 లోక్ సభ​నియోజకవర్గాల్లో వివిధ పార్టీలు, ఇండిపెండెంట్​లు కలిపి మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ లోక్​సభ స్థానం నుంచి 45 మంది పోటీ పడుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో చేవెళ్ల, మెదక్​, పెద్దపల్లి, వరంగల్​స్థానాలు ఉన్నాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ నుంచి  12 మంది పోటీలో నిలిచారు.

ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్​అన్ని సీట్లలో పోటీ చేస్తుండగా, కొన్నిచోట్ల బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. భువనగిరి నుంచి సీపీఎం అభ్యర్థి పోటీ చేస్తున్నారు. మొత్తం అభ్యర్థుల్లో 474 మంది పురుషులు కాగా, 51 మంది మహిళలు ఉన్నారు. 

యువత, మహిళల ఓట్లే కీలకం

రాష్ట్రంలో మొత్తం 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో 1,65,28,366 మంది పురుషులు కాగా.. 1,67,01,192 మంది మహిళలు ఉన్నారు. మరో 2,760 మంది థర్డ్ జెండర్. ఇక కొత్తగా ఓటు హక్కు పొందినోళ్లు 9,20,313 మంది ఉన్నారు. అత్యధికంగా మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలో 37,60,958 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా మహబుబాబాద్ సెగ్మెంట్​లో 16,26,427 మంది ఓటర్లు ఉన్నారు.

రాష్ట్రంలో సగటున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 900 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఈసారి ఎన్నికల్లో యువత, మహిళలు కీలకంగా మారనున్నారు. వాళ్లు ఎటువైపు మొగ్గు చూపితే, ఆ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

స్పెషల్​ పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు

మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వుమెన్ పోలింగ్ స్టేషన్లు, మోడల్ పోలింగ్ కేంద్రాలు కూడా ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేశారు. అలాగే దివ్యాంగుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక స్పెషల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు కోరితే పోలింగ్ కేంద్రం వరకు రవాణా సదుపాయం కూడా కల్పిస్తారు. పోలింగ్ కేంద్రాల్లో 22 వేల వీల్ చైర్స్ అందుబాటులో ఉంచారు.

వృద్ధులు, దివ్యాంగులకు సాయం చేసేందుకు వలంటీర్లను కూడా నియమించారు. అంధుల కోసం బ్రెయిలీ లిపిలో పోస్టల్ బ్యాలెట్, పోస్టర్స్ అందుబాటులో ఉంచారు. వినికిడి లోపం ఉన్న వారి కోసం కూడా పోస్టర్లు తయారు చేశారు. వారితో మాట్లాడే విధంగా పోలింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. 

మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలివీ..

మావోయిస్టుల ప్రభావమున్న 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. వీటిలో సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం ఉన్నాయి. ఈ సెగ్మెంట్లలో దాదాపు 600 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

కొడంగల్​లో ఓటు వేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

లోక్ సభ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి కొడంగల్​లో ఓటు వేయనున్నారు. ఆయన సోమవారం ఉదయం పట్టణంలోని జిల్లా పరిషత్​బాయ్స్​హైస్కూల్ లో​కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  

పోలింగ్ పర్సంటేజీ పెరుగుతదా.. తగ్గుతదా..!

పోలింగ్​ శాతం ఎక్కువగా నమోదవుతుందా? లేదా? అని అటు పొలిటికల్ ​పార్టీలతో పాటు ఇటు ఈసీ ఆందోళన చెందుతున్నది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల ఎన్నికల్లో పోలింగ్​శాతం తక్కువగా నమోదైంది. వరుస సెలవులు రావడం, తెలంగాణలోని ఏపీ ఓటర్లు సొంత రాష్ట్రానికి తరలివెళ్లడంతో ఓటింగ్ శాతంపై ప్రభావం పడే అవకాశముందని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఇక ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు ఈసీ ప్రత్యేక చర్యలు తీసుకుంది.

పట్టణ ప్రాంతాలకు సంబంధించి 5 వేల పోలింగ్​ కేంద్రాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అర్బన్ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఓటర్లకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తే ఓటు వేస్తారో తెలుసుకుని.. దానికి తగిన విధంగా యాప్ కూడా తయారు చేసింది. దీని ద్వారా పోలింగ్ కేంద్రాల్లో ఎంత క్యూలైన్ ఉందో చూడొచ్చు.

ఓటు వేయాలంటే ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు. పోలింగ్ కేంద్రాల్లో పార్కింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. కాగా, 2019 లోక్​సభ ఎన్నికల్లో 64.29  శాతం పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమోదైంది. అప్పుడు గ్రామాల్లో ఓటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాతం ఎక్కువగా నమోదైంది. అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓటర్లు చాలావరకు 
ఆ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 

లిస్ట్​లో పేరుండి.. ఈ కార్డులుంటే చాలు

ఓటరు జాబితాలో పేరు ఉండి, ఓటరు కార్డు లేనివారు ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులు చూపించి ఓటు వేయొచ్చు. ఓటరు గుర్తింపు నిర్ధారణ సమయంలో క్లరికల్, స్పెల్లింగ్ తప్పుల వంటి వాటిని పోలింగ్ అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. మరొక అసెంబ్లీ నియోజకవర్గ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ జారీ చేసిన ఎపిక్ కార్డును ఓటరు చూపితే, ఆ ఓటరు పేరు పోలింగ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ఓటర్ల జాబితాలో ఉన్నట్లయితే, దాన్ని గుర్తింపు కోసం అనుమతించవచ్చని తెలిపింది.

ఫొటో ఉన్న ఓటరు స్లిప్పు, ఓటర్ ఐడీ, ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ రంగ సంస్థల గుర్తింపు కార్డులు, బ్యాంకులు, పోస్టాఫీసు జారీ చేసిన పాసుపుస్తకం (ఫొటోతో ఉన్నవి), పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్డు, జనగణన ఆధారంగా జారీ చేసిన స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్డు, ఉపాధి హామీ జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్డు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్డు, ఫొటోతో జత చేసిన పింఛను పేపర్లు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు పేపర్లు... వీటిల్లో ఏదైనా గుర్తింపు కార్డుగా చూపించొచ్చు.