
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్ కౌన్సెలింగ్లో ఈ ఏడాది నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ కోటాలో అదనంగా 404 సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో నేటి నుంచి డీఈఈసెట్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ రమేశ్ ప్రకటించారు. రెండు విడతల్లో మిగిలిపోయిన 996 సీట్లను జనరల్ అభ్యర్థులతో నింపనున్నట్టు వెల్లడించారు.
ఈడబ్ల్యూఎస్ కోటా కోసం కొత్తగా ఈ నెల 31 నుంచి ఆగస్టు 2 వరకు అప్లై చేసుకోవచ్చని, ఆగస్టు 3 నుంచి 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. ఆగస్టు 6, 7 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని, 11న సీట్ల అలాట్మెంట్ ఉంటుందని ప్రకటించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 10 సర్కారు, 66 ప్రైవేటు డైట్ కాలేజీలు ఉన్నాయి. కన్వీనర్ కోటాలో 4,130 సీట్లు ఉండగా.. ఇప్పటివరకు 3,134 సీట్లు నిండాయి.