ఖబర్దార్.. రేపు నీకు కూడా ఇదే గతి

ఖబర్దార్.. రేపు నీకు కూడా ఇదే గతి

ఎక్కడ సభలు జరిగినా వేలాదిగా తరలిపోయి ఉద్యమాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్న నియోజకవర్గం హుజారాబాద్ నియోజకవర్గమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కక్షలకు, విద్వేషాలకు తావు లేని నియోజకవర్గం ఇది అని ఆయన అన్నారు. ఈటల రెండు రోజులపాటు హుజురాబాద్‌లోనే ఉండనున్నారు. స్వగ్రామానికి చేరుకొని తండ్రి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ఇల్లందకుంట సీతారామస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు.

‘నా మీద కక్షపూరితంగా గోడౌన్స్, పౌల్ట్రీఫాం సీజ్ చేశారు. నా మీద మీ కక్ష నేను పడతాను. కానీ, నా ప్రజలను ఇబ్బందిపెట్టొద్దు. ఈ రోజు ఒక నాయకుడు ఇంచార్జీగా ఈ నియోజకవర్గానికి వస్తున్నారు. ఆయన ఏనాడైనా ఏ ఎన్నికలోనైనా పనిచేశారా? ప్రజలకు ఆపదలో సాయం చేసి కాపాడారా? గొర్ల మంద మీద తోడెళ్లు పడ్డట్లు.. నా వెంట ఉన్నవాళ్లను కూడా ఇబ్బంది పెడుతున్నారు. కాంట్రాక్టులు చేసుకునేవాళ్లను బిల్లులు ఆపేస్తామని బెదిరిస్తున్నారు. ఎంపీటీసీలు, సర్పంచ్‌లను ఈటలతో ఉంటే ఫండ్స్ రావని బెదిరిస్తున్నారు. మీ గ్రామానికి అభివృద్ధి నిధులు రావాలంటే మీరు మాతోనే ఉండాలని బెదిరిస్తున్నారు. గతంలో నేను హుజురాబాద్, జమ్మికుంటకు కోటి రూపాయలు మంజూరు చేశాను. ఆ డబ్బులు విడుదలకావాలంటే మీరు మాకే సపోర్టుగా ఉండాలని బెదిరిస్తున్నారు. నా మద్దతుదారులను, ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్నారు. ఈ విధంగా బ్లాక్ మెయిల్ ద్వారా చేస్తున్న రాజకీయాలను హుజురాబాద్ ప్రజలు గమనిస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి బిడ్డా.. ఎవడూ వెయ్యేండ్ల కోసం పుట్టలే. వందేండ్లు బతకడమే కష్టం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం శాశ్వతం అనుకంటే భ్రమల్లో ఉన్నట్లే లెక్క. నువ్వు ఎన్నిరోజులు అధికారంలో ఉంటవో చూసుకో. హుజురాబాద్ ప్రజల్ని, నాయకుల్ని బ్లాక్‌మెయిల్ చేయమని ఎవరు చెప్పారు. నువ్వు ఏ ఒరవడితో వెనకనుంచి రాజకీయాలు చేస్తున్నవో, ఏ సాంప్రదాయాన్ని ప్రజలకు చూపిస్తున్నావో.. రేపు నీకు కూడా గదే గతి పట్టే ఆస్కారముంటది. కరీంనగర్ నియోజకవర్గంలో ఎన్ని గుట్టలు విధ్వంసమయ్యాయో, ఎన్ని బొందలగడ్డలయ్యాయో అందరూ చూస్తున్నారు. ఆ విషయం నేను ముఖ్యమంత్రికి ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు ఎన్ని కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టావో అందరికీ తెలుసు. నీ కల్చర్, సంప్రదాయం అందరికీ తెలుసు. గుర్తుపెట్టుకో.. 2023 తర్వాత మీరు అధికారంలో ఉండరు. మీరిప్పుడు ఏదైతే చేస్తున్నారో.. నేను కూడా అప్పుడు అదే చేస్తా. ప్రజలు నన్ను 20 ఏళ్లుగా గుండెళ్లో పెట్టుకున్నారు. దేవుళ్లకంటే నేను ప్రజలకే మొక్కుతా. వాళ్ల హృదయాలే నాకు దేవాలయాలు. మా ప్రజలు 20 ఏళ్లుగా కుటుంబసభ్యుల్లా ఉంటే తల్లీ బిడ్డలను వేరే చేసే ప్రయత్నం చేస్తున్నారు. నువ్విచ్చే తాయిళాలకు ఆశపడి తాత్కాలికంగా జై కొట్టొచ్చు. కానీ ఎల్లకాలం నీ రాజకీయాలు నడవవు. వినోద్ కుమార్ ఓడిపోయినప్పుడు కూడా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు 54 వేల మెజార్టీ ఇచ్చారు. హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరు. ఇక్కడ ఆరు సార్లు నేను గెలిచాను. ఏనాడు ప్రలోభాలకు ఇక్కడ ఆస్కారం లేదు. నాగార్జున సాగర్‌లాగా ఇక్కడ గెలవాలని చూస్తే.. ప్రజలు మిమ్మల్ని పాతరేస్తారు. హుజురాబాద్‌లో ఇప్పుడు ఎన్నికలు జరిగే ప్రసక్తి లేదు. ఒకవేళ హుజురాబాద్‌లో ఎన్నికలు జరిగితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లు... సకల జనులు, ఉద్యమకారులంతా ఇక్కడి ప్రజలకు అండగా ఉంటారు. బొందిలో ప్రాణమున్నంతవరకు హుజురాబాద్ ప్రజలను కాపాడుకుంటా. ఢిల్లీ సర్కారును మెడల్ వంచేలా ఉప్పల్ రైల్ రోకో చేసింది ఇక్కడి ప్రజలే. ఎవరైతే కొంతమంది నాయకులను మీరు తీసుకెళ్లారో వాళ్లపై ప్రజలు చీత్కరించుకుంటున్నారు. మీరు చేసిన పనికి సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజల ముందు దోషిగా ఉండాల్సి వస్తుంది. మీ దాదాగిరి పనులను, ఈ బెదిరింపులను ఆపకపోతే ఊరుకోం. మా ఓపికను, సహనాన్ని పరీక్షించాలనుకుంటే మాడి మసై పోతారు. హుజురాబాద్ బిడ్డగా ఈటల ఇక్కడే ఉంటాడు. కులమతాలకు సంబంధం లేకుండా అందరి ఆత్మగౌరవ బాహుట ఎగురువేస్తా. హుజురాబాద్ ప్రజలు ఓపిక, సహనం కోల్పోవద్దు’ అని ఆయన కోరారు.