మంచిర్యాల జీజీహెచ్​లో పిల్లల తారుమారు

మంచిర్యాల జీజీహెచ్​లో పిల్లల తారుమారు

మంచిర్యాల,వెలుగు : మంచిర్యాల గవర్నమెంట్ ​జనరల్​ హాస్పిటల్​లో నర్సుల నిర్లక్ష్యంతో పసిబిడ్డలు తారుమారైన సంఘటన సంచలనం సృష్టించింది. ఒకరి శిశువును మరొకరికి అప్పగించిన నర్సులు ఆ తర్వాత కొద్దిసేపటికే తేరుకున్నప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మగబిడ్డ మావాడంటే... మావాడంటూ కుటుంబసభ్యులు గొడవకు దిగడంతో సమస్య జఠిలమైంది. చివరకు కన్నతల్లే తన బిడ్డ కాదని చెప్పినా నమ్మలేక డీఎన్​ఏ టెస్టుకు వెళ్లాల్సిన పరిస్థితిని కల్పించింది. అమ్మ పొత్తిళ్లలో హాయిగా సేదదీరాల్చిన శిశువులను ఐసీయూకు చేర్చింది. నవమాసాలు మోసి కన్నబిడ్డలను కంటినిండా చూసుకోలేక ఆ తల్లులు కంటతడి పెడుతున్న తీరు కలిచివేస్తోంది.  మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం రొయ్యలపల్లికి చెందిన దుర్గం మమతను, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బొల్లం పావనిని వారి కుటుంబసభ్యులు డెలివరీ కోసం రెండు రోజుల కింద గవర్నమెంట్​జనరల్​ హాస్పిటల్​లో జాయిన్​ చేశారు.

మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇద్దరికి సిజేరియన్​చేశారు. పది నిమిషాల వ్యవధిలో ఒకరికి పాప, మరొకరికి బాబు పుట్టారు. ఈ విషయాన్ని మమత, పావనిలకు చెప్పి బిడ్డలను చూపించారు. అయితే శిశువులను కుటుంబసభ్యులకు అప్పగించే సమయంలో నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మగబిడ్డను మమత కుటుంబీలకు అప్పగించడంతో వారు వెంటనే పిల్లల డాక్టర్​కు చూపించి వ్యాక్సిన్​ వేయించుకొని వచ్చారు. అప్పటికే పొరపాటును గ్రహించిన నర్సులు మమతకు పాప, పావనికి బాబు పుట్టారని, బాబును ఇచ్చి పాపను తీసుకోవాలని చెప్పడంతో బిత్తరపోయారు. మగబిడ్డ మావాడంటే... మావాడంటూ ఇరు కుటుంబాల సభ్యులు నర్సులతో గొడవకు దిగారు.

మమత తనకు కూతురు పుట్టిందని డాక్టర్లు చెప్పారని తెలిపినా కుటుంబీకులు వినిపించుకోలేదు. కావాలనే శిశువులను మారుస్తున్నారని డాక్టర్లు, నర్సులను నిలదీశారు. పొరపాటు జరిగిందని వారు ఎంత సర్దిచెప్పినా బాబును వెనక్కి ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో హాస్పిటల్​ సూపరింటెండెంట్​హరిశ్చంద్రారెడ్డి పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై తౌసొద్దీన్​ వచ్చి గొడవను వారించారు. తర్వాత శిశువులను ఎన్​ఐసీయూకు తరలించారు. మమత కుటుంబీకులు తమ బాబును చూపించాలంటూ బుధవారం ఆందోళనకు దిగారు. దీంతో శిశువులను జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం శిశువులు వారి పర్యవేక్షణలోనే ఎన్ఐసీయూలో ఉన్నారు. ఆడపిల్ల, మగపిల్ల వాడు పుట్టడంతో గొడవ జరిగి విషయం బయటకు వచ్చిందని, ఒకవేళ ఇద్దరూ మగపిల్లలైతే తెలిసే అవకాశం ఉండేది కాదని పలువురు అంటున్నారు. 

అవసరమైతే డీఎన్​ఏ టెస్టు  

మగబిడ్డ కోసం రెండు కుటుంబాలు గొడవ పడుతుండడంతో అవసరమైతే డీఎన్​ఏ టెస్టు చేయిస్తామని జీజీహెచ్​సూపరింటెండెంట్​డాక్టర్​ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా, తమకు కొడుకు పుట్టినప్పటికీ ఆడపిల్లను అంటగట్టాలని చూస్తున్నారని, న్యాయం చేయాలని కోరుతూ మమత భర్త దుర్గం రమేశ్​పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కానీ, పోలీసులు బుధవారం రాత్రి వరకూ కేసు ఫైల్​చేయలేదు. మమతకు పాప, పావనికి బాబు పుట్టినట్టు డాక్టర్ల దగ్గర ఆధారాలుండడంతో ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్​చేసి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వారు ఒప్పుకోకుంటే డీఎన్​ఏ టెస్టు చేయిస్తామని సూపరింటెండెంట్​తెలిపారు. ఆ రిపోర్టు ఆధారంగా ఎవరి బిడ్డను వారికి అప్పగిస్తామని, దీనికి వారం, పది రోజులు పడుతుందన్నారు.