బెల్లం అమ్మకాలపై ఎక్సైజ్‌‌ నిఘా .. మేడారం జాతరతో ఫుల్‌‌ డిమాండ్

బెల్లం అమ్మకాలపై ఎక్సైజ్‌‌ నిఘా .. మేడారం జాతరతో ఫుల్‌‌ డిమాండ్
  • వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున తీసుకొస్తున్న వ్యాపారులు
  • ఎత్తు బంగారం’ పేరుతో దారి మళ్లిస్తున్నట్లు ఆరోపణలు 
  • పక్కదారి పట్టకుండా అధికారుల చర్యలు
  • ప్రతి రోజు రిపోర్ట్‌‌ ఇవ్వాలని వ్యాపారులకు ఆదేశాలు

హనుమకొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాలో మేడారంతో పాటు పలు చోట్ల సమ్మక్క సారలమ్మ జాతరలు జరగనున్నాయి. రెండేండ్లకోసారి జరిగే ఈ జాతరకు భక్తులు తమ ఎత్తు బంగారం (బెల్లాన్ని) సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మరికొన్ని రోజుల్లో జాతర్లు ప్రారంభం కానుండడంతో బెల్లానికి ఒక్కసారిగా డిమాండ్‌‌ పెరిగింది. అయితే ఈ డిమాండ్‌‌ను ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు బెల్లాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎక్సైజ్‌‌ ఆఫీసర్లు బెల్లం అమ్మకాలపై నిఘా పెట్టారు. అమ్మకాలకు సంబంధించి ప్రతి రోజు రిపోర్ట్‌‌ ఇవ్వాలని ఆదేశించడంతో పాటు, లోడ్‌‌ తీసుకొచ్చే వాహనాలపై దృష్టి సారించారు.

బెల్లం బిజినెస్‌‌ కేరాఫ్​ బీట్‌‌ బజార్‌‌

బెల్లం అమ్మకాలకు వరంగల్‌‌లోని బీట్‌‌ బజార్‌‌ ఫేమస్‌‌. ఇక్కడ ఉన్న తొమ్మిది మంది హోల్‌‌సేల్‌‌ వ్యాపారులు మహారాష్ట్ర, ఛత్తీస్‌‌గఢ్‌‌, కర్ణాటక, ఏపీ నుంచి బెల్లాన్ని తీసుకొస్తుంటారు. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు హోల్‌‌సేల్‌‌గా, రిటైల్‌‌గా అమ్మకాలు కొనసాగిస్తుంటారు. సాధారణ రోజుల్లో నెలకు 10 టన్నుల బిజినెస్‌‌ నడుస్తుండగా, మేడారం జాతర టైంలో మాత్రం నెలకు 40 టన్నుల బిజినెస్‌‌ సాగుతుందని అంచనా వేస్తున్నారు. మరో 20 రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానుండగా ఇప్పుడిప్పుడే గిరాకీ పెరిగింది.

ముందస్తు మొక్కులకు వెళ్తున్న భక్తులు ఎత్తు బంగారాన్ని సమర్పించేందుకు వస్తుండడంతో రోజుకు 20 క్వింటాళ్ల నుంచి 30 క్వింటాళ్ల వరకు బిజినెస్ నడుస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. జాతర సమీపిస్తున్న కొద్దీ బిజినెస్‌‌ ఊపందుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రతిసారి జాతర నేపథ్యంలో మహారాష్ట్రలోని నాందేడ్, పూణే, కరాడ్, కర్నాటకలో మాండ్య, ఏపీలోని చిత్తూరు నుంచి నాలుగైదు రకాల బెల్లాన్ని తీసుకొస్తుంటారు. ఇందులో నాందేడ్​ బెల్లం రూ.35 నుంచి రూ.40 వరకు ధర పలుకుతుండగా, కరాడ్‌‌ బెల్లం రూ.62 నుంచి రూ.65 వరకు రేటు ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. 

పక్కదారి పట్టకుండా చర్యలు

జాతర్ల పేరుతో బెల్లం తీసుకొస్తున్న కొందరు వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా నాటుసారా తయారీదారులకు అమ్ముతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో వరంగల్, పరకాల ప్రాంతంలో నల్లబెల్లం దందా చేస్తూ ఒకరిద్దరు వ్యాపారులు కూడా ఎక్సైజ్‌‌ ఆఫీసర్లకు పట్టుబడ్డారు. గత జాతర టైంలో కూడా బెల్లం పక్కదారి పడుతోందన్న ఆరోపణలు రావడంతో అప్పటి నుంచి ఎక్సైజ్‌‌ ఆఫీసర్లు బెల్లం విక్రయాలకు నిబంధనలు పెట్టారు.

బెల్లం కొనుగోలు చేసే వారి పూర్తి అడ్రస్‌‌తో పాటు ఫోన్‌‌ నంబర్‌‌, ఆధార్‌‌ వివరాలు తప్పనిసరిగా సేకరించాలని వ్యాపారులను ఆదేశించారు. అనంతరం కొనుగోలు చేసిన వారి పూర్తి వివరాలతో డైలీ సేల్స్​రిపోర్ట్‌‌ అందజేయాలని చెప్పారు. అప్పటి నుంచి ప్రతిరోజు బెల్లం అమ్మకాలపై రిపోర్ట్​సేకరిస్తూ ఎత్తు బంగారం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు.

అమ్మకాలపై ఎఫెక్ట్‌‌

బెల్లం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్‌‌ ఆఫీసర్లు చెబుతుండగా.. నాటుసారా సాకు చూపి బెల్లం అమ్మకాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటుసారా తయారీదారులకు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. దీంతో ఇటు బెల్లం వ్యాపారులు, అటు ఎక్సైజ్‌‌ ఆఫీసర్ల నడుమ ఇంటర్నల్‌‌ వార్‌‌ నడుస్తున్నట్లు సమాచారం. వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే బెల్లాన్ని అడ్డుకోకుండా తమను మాత్రమే ఇబ్బందులకు గురిచేస్తున్నారని అంటున్నారు. మరో వైపు ఎత్తు బంగారంలో భాగంగా కొంతమేర బెల్లం, మరికొంత చక్కెర కొనుగోలు చేస్తుండడం కూడా బెల్లం అమ్మకాలపై ప్రభావం చూపుతోందని వ్యాపారులు చెబుతున్నారు.

బెల్లం డైవర్షన్‌‌ పైనే నిఘా 

మేడారం జాతర కోసం తీసుకొచ్చిన బెల్లాన్ని సక్రమంగా వినియోగిస్తే ఎలాంటి చర్యలు ఉండవు. బెల్లం పక్కదారి పట్టకుండా తప్పనిసరిగా నిఘా పెడుతాం. విక్రయాలకు సంబంధించి వ్యాపారుల నుంచి డైలీ రిపోర్ట్ తీసుకుంటున్నాం. దాని ఆధారంగానే బెల్లం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటున్నాం. ఒకవేళ బెల్లం పక్కదారి పట్టినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.

 చంద్రశేఖర్, ఎక్సైజ్‌‌ సూపరింటెండెంట్, హనుమకొండ