పంచాయతీరాజ్‌‌‌‌ ఆర్డినెన్స్‌‌‌‌పై ఉత్కంఠ!..11 రోజులుగా గవర్నర్‌‌‌‌‌‌‌‌ వద్ద ఫైల్ పెండింగ్

పంచాయతీరాజ్‌‌‌‌ ఆర్డినెన్స్‌‌‌‌పై ఉత్కంఠ!..11 రోజులుగా గవర్నర్‌‌‌‌‌‌‌‌ వద్ద ఫైల్ పెండింగ్
  • రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు విధించిన డెడ్‌‌‌‌లైన్‌‌‌‌ నేటితో ముగింపు 
  • గవర్నర్ ఆమోదం ఆలస్యమైతే ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు 
  • ఇయ్యాల జరిగే కేబినెట్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో చర్చించి నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు:  పంచాయతీ రాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌‌‌‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ ఆర్డినెన్స్ ఫైల్ దాదాపు 11రోజులుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వద్ద పెండింగ్‌‌‌‌లో ఉండడం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు విధించిన గడువు శుక్రవారం ముగుస్తుండడంతో.. ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. ఈ నెల 25లోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని, సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించింది. 

ఈ నేపథ్యంలో శుక్రవారం సెక్రటేరియెట్‌‌‌‌లో సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ మీటింగ్‌‌‌‌లో పెండింగ్‌‌‌‌లో ఉన్న ఆర్డినెన్స్ ఫైల్, రిజర్వేషన్ల ఖరారుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. కాగా, స్థానిక సంస్థల్లో పాలక వర్గాలు లేక ఇప్పటికే 15 నెలలు అవుతున్నది. దీంతో ఫైనాన్స్​కమిషన్​గ్రాంట్లు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌‌‌‌కు హైకోర్టు గడువు విధించింది. 

సొలిసిటర్ జనరల్​నుంచి గవర్నర్ న్యాయ సలహా? 

కులగణన సర్వే, ఎంపిరికల్​డేటా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఈ నెల 10న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం​నిర్ణయించింది. అసెంబ్లీ ప్రోరోగ్​కావడంతో ప్రస్తుతమున్న పంచాయతీరాజ్ చట్టం –2018లోని 285(ఎ)ను సవరిస్తూ ఆర్డినెన్స్​తేవాలని డెసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించిన ముసాయిదా రెడీ చేసి, ఆ ఫైల్‌‌‌‌ను ఈ నెల 15న గవర్నర్‌‌‌‌‌‌‌‌కు పంపింది. 

గతంలో 285(ఎ) నిబంధనలో ‘స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం మించరాదు’అని ఉండగా, సవరణలో ‘ఎలాంటి సంఖ్య లేకుండా కుల గణనసర్వే, ఎంపిరికల్​ డేటా ప్రకారం రిజర్వేషన్లు అమలవుతాయి’అని ప్రభుత్వం పేర్కొంది. కాగా, ఈ చట్ట సవరణకు సంబంధించి అడ్వకేట్ జనరల్​నుంచి ఇప్పటికే గవర్నర్​న్యాయ సలహా తీసుకున్నారు. కానీ ఆమోదం తెలుపలేదు. రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కావడంతో సొలిసిటర్ జనరల్​నుంచి కూడా గవర్నర్ లీగల్​ఒపీనియన్​కోరారనే చర్చ జరుగుతున్నది. 

నేడు కేబినెట్‌‌‌‌లో చర్చ..

పంచాయతీ రాజ్​చట్ట సవరణ ఆర్డినెన్స్‌‌‌‌కు గవర్నర్​ఆమోదం తెలపడం ఆలస్యమైనా, ఒకవేళ వెనక్కి పంపినా.. ఏం చేయాలనే దానిపై శుక్రవారం జరగనున్న కేబినెట్​సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించే అవకాశముంది. రిజర్వేషన్ల ఖరారు గడువు కూడా ముగుస్తున్నందున మళ్లీ ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం సమాధానం చెప్పాలనే దానిపైనా కసరత్తు చేస్తున్నది. ఈ ఆర్డినెన్స్ ఆమోదం, రిజర్వేషన్ల ఖరారుపై స్పష్టత రాకపోతే ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే ప్రమాదముంది. ఈ క్రమంలోనే న్యాయ నిపుణులతో, ఉన్నతాధికారులతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నది.

 ప్రత్యామ్నాయ మార్గాలనూ అన్వేషిస్తున్నది. ఒకవేళ ఆర్డినెన్స్ అంశంలో అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే, ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టి సారించింది. ఇంకోవైపు రిజర్వేషన్ల నిర్ణయం, జాబితా ఖరారుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్​ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఒకవేళ ఆర్డినెన్స్ ఆమోదం పొందితే, వెంటనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్‌‌‌‌ను ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ రెడీగా ఉంది.