ఆర్మూర్ మండలంలో ఆసక్తికర పంచాయతీ ఎన్నికల పోరు..

ఆర్మూర్ మండలంలో ఆసక్తికర పంచాయతీ ఎన్నికల పోరు..

​ఆర్మూర్, వెలుగు :  ఈనెల 17న జరిగే మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆర్మూర్​ మండలంలో చిత్రంగా  ఉన్నాయి. మండలంలో 14 గ్రామ పంచాయతీలు ఉండగా, సుర్భిర్యాల్​ గ్రామంలో సర్పంచ్​గా ఎర్రం శ్రీనివాస్​ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మిగతా 13 గ్రామాల్లో సర్పంచ్​ పదవికి  ఎన్నికలు జరుగనున్నాయి. రాంపూర్ గ్రామపంచాయతీలో అతి తక్కువగా 470 మంది ఓటర్లు ఉండగా, ఆదర్శ గ్రామంగా పేరొందిన అంకాపూర్ లో అత్యధికంగా 5065 మంది ఓటర్లు ఉన్నారు. 

 రాంపూర్ లో 470 మంది ఓటర్లలో 224 మంది పురుషులు, 246 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ 8 వార్డులు ఉండగా, ఒక్కొ వార్డులో సుమారు 56 నుంచి 60 ఓట్లు ఉన్నాయి. రాంపూర్ గ్రామపంచాయతీ జనరల్​ మహిళ కు రిజర్వు కాగా, సర్పంచ్ బరిలో ముగ్గురూ ఎస్​సీ మహిళలే పోటీలో ఉన్నారు. గతంలో వరుసగా మూడు సార్లు సర్పంచ్ గా​ ఉన్న బొడ్డు అరుణ గంగాధర్​ దంపతులు ఇప్పటికీ పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ గ్రామస్థుల అభ్యర్థనతో ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. గ్రామంలో 470 మంది ఓటర్లు ఉన్నందున, ద్విముఖ పోరులో 200 పై చిలుకు ఓట్లు వచ్చేఅభ్యర్థి గెలుపొందటం ఖాయం.  వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు 30 నుంచి 35 ఓట్లు వస్తే వార్డ్ మెంబర్​ గా గెలుపొందినట్టే. 

అంకాపూర్​ లో...

మండలంలోని అంకాపూర్ లో అత్యధికంగా 5,065 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 2,356 మంది పురుషులు, మహిళలు 2,709 మంది ఉన్నారు. జనరల్​ రిజర్వు అయిన ఇక్కడి సర్పంచ్​ స్థానానికి ముగ్గురు పోటీ పడుతున్నా ప్రధానంగా ద్విముఖ పోరు కొనసాగుతుంది.  

ఖానాపూర్​ లో అత్యధికంగా ఎనిమిది మంది పోటీ...

ఆర్మూర్​ మండలంలోని ముంపు పరివాహక ప్రాంతంలోని ఖానాపూర్ గ్రామం జనరల్​కు రిజర్వు కాగా ఇక్కడి నుండి 8 మంది సర్పంచ్​కు పోటీలో ఉన్నారు. ఖానాపూర్ గ్రామం నుండి ఆరుగురు, గ్రామానికి చెందిన వడ్డెరకాలనీకి చెందిన ఇద్దరు పోటీ పడుతుండగా ఇక్కడ త్రిముఖ పోరు ఉంది.  మండలంలో నూతనంగా ఏర్పాటైన 'పల్లె' గ్రామ పంచాయతీలో   981 మంది ఓటర్లు ఉన్నారు. 

రాంపూర్​ గ్రామం తర్వాత అతి తక్కువ ఓటర్లు ఉన్న గ్రామంగా పల్లెను చెప్పుకోవచ్చు.  పల్లె గ్రామంలో 468 మంది పురుషులు, 513 మంది  మహిళ ఓటర్లు ఉన్నారు. తొలిసారి సర్పంచ్​ పదవి కోసం నలుగురు పోటీలో ఉన్నా ఇక్కడ ద్విముఖ పోరు కనిపిస్తుంది.