ఎంట్రెన్స్ పరీక్షల్లో బడుగు వర్గాలకు మినహాయింపు ఇస్తలే

ఎంట్రెన్స్ పరీక్షల్లో బడుగు వర్గాలకు మినహాయింపు ఇస్తలే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పేద విద్యార్థులకు ప్రవేశ పరీక్షల ఫీజులు భారంగా మారాయి. ఇప్పటికే ఎక్కువ ఉంటున్నాయనుకుంటే.. తాజాగా మరో రూ. వంద పెంచారు. ఓసీలతో సమానంగా బీసీ విద్యార్థుల ఫీజులను నిర్ణయించారు. జేఈఈ మెయిన్, నీట్ తదితర జాతీయ ప్రవేశపరీక్షలతో పాటు పక్కనున్న ఏపీలోనూ ఓసీలకు, బీసీలకు వేర్వేరు ఫీజులున్నాయి. కానీ రాష్ట్రంలో మాత్రం ఓసీలతో సమానంగా బీసీ అభ్యర్థులకు ఫీజులు వసూలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఎంసెట్‌‌‌‌ ఫీజు బీసీలకు రూ.900

ఇంజినీరింగ్, ఫార్మసీతో పాటు వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ పరీక్షలు నిర్వహిస్తుంటుంది. ఎగ్జామ్ ఏర్పాట్లు, ఫీజులు, సిలబస్ అంతా సర్కారు ఆదేశాల మేరకు చేపడుతుంది. ఈ ఏడాది టీఎస్ ఎంసెట్, ఎడ్ సెట్, ఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, ఐసెట్ తదితర ఎగ్జామ్స్ తేదీలను అధికారులు ప్రకటించారు. దాదాపు అన్ని పరీక్షలను మే నెలలోనే నిర్వహిస్తున్నారు. ఒక్క ఎడ్ సెట్‌‌‌‌కు మినహా మిగిలిన అన్నింటికీ కొత్తవారే కన్వీనర్లుగా నియమితులయ్యారు. ఇటీవల టీఎస్ ఎంసెట్, పీజీ ఈసెట్ షెడ్యూల్‌‌‌‌ రిలీజ్ చేయగా, ఈనెల 28న నోటిఫికేషన్లు విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ రెండు పరీక్షలకు వంద చొప్పున ఫీజు పెంచారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి ఒక ఫీజు, ఇతరులందరికీ ఒక ఫీజు నిర్ణయించారు. ఉదాహరణకు ఎంసెట్‌‌‌‌లో ఎస్సీ, ఎస్టీలకు రూ.500 ఉంటే, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీలకు రూ.900 ఫీజు ఉంది. పీజీ ఈసెట్​లో ఎస్సీ, ఎస్టీలకు రూ.600 ఉంటే, మిగిలిన వారందరికీ రూ.1,100 ఫీజు పెట్టారు. ఓసీలు, బీసీలకు ఒకే ఫీజులను నిర్ణయించడంపై స్టూడెంట్ల నుంచి వ్యతిరేకత వస్తోంది. 

అన్నింటికీ దరఖాస్తు చేయడమెట్ల?

డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఐసెట్, ఎడ్​సెట్, లాసెట్ తదితర ఎంట్రెన్స్​లు రాస్తుంటారు. వాటిలో వచ్చే ర్యాంకు, వచ్చే కాలేజీని బట్టి కోర్సు ఎంచుకుంటారు. ఒక్కో అభ్యర్థి రెండు, మూడు ఎంట్రెన్స్​లు రాయనుండటంతో.. ఈ స్థాయిలో ఉన్న ఫీజులు వారికి భారంగా మారాయి. దీంతో అన్నింటికీ అప్లై చేసుకోవాలనుకునే వారికి ఇబ్బందిగా ఉంది.

నేషనల్ ఎంట్రెన్స్‌‌‌‌లలో తగ్గింపు

ఏటా 4.50 లక్షల మంది వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్​కు అటెండ్ అవుతున్నారు. దీంట్లో 25% మంది దాకా ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులుండగా, మిగిలిన వారంతా బీసీలు, ఓసీలు. పరీక్ష రాసే వారిలో దాదాపు 60 శాతానికి పైగా బీసీ విద్యార్థులుంటారు. వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫీజులో ఎలాంటి రాయితీ ఇవ్వడం లేదు. తాజాగా రూ.వంద ఫీజు పెంచడంతో అందరిపై భారం పడింది. బీసీలపై మరింత పెరిగినట్లయింది. కేంద్రం నిర్వహించే జేఈఈ మెయిన్‌‌‌‌, నీట్ పరీక్షల్లో ఓబీసీలకు, అమ్మాయిలకు ప్రత్యేకంగా ఫీజు రాయితీ ఉంది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్​లోనూ పలు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్​లో బీసీలకు ప్రత్యేకంగా మినహాయింపు ఉంది. కానీ తెలంగాణలో మాత్రం బీసీలు, మహిళలను ప్రత్యేక కేటగిరీగా చూడటం లేదు. దీంతో ఆయా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఓసీలతో సమానంగా ఫీజు చెల్లించాల్సి వస్తోంది. బీసీ కులాల్లో చాలా మంది పేదలు ఉండడంతో ఫీజులు వారికి భారంగా మారాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి బీసీలకు ఫీజులు తగ్గించాలని స్టూడెంట్లు కోరుతున్నారు.