వ్యాయామం.. తలకో రకం!

వ్యాయామం.. తలకో రకం!

ఒక ఫిట్‌‌నెస్ ట్రైనర్ దగ్గరకు ముగ్గురు వచ్చారు. అందులో ఒకరు ‘నాకు సిక్స్‌‌ప్యాక్‌‌తో పాటు, బాగా కండలు తిరిగిన బాడీ కావాలి’ అని అడిగాడు. ఇంకొకతను ‘నాకు కండలు వద్దు. కానీ ఎనర్జీ పెరగాలి. అంటే పనులన్నీ అలసిపోకుండా సులభంగా చేసుకోగలగాలి. ఎక్కువసేపు యాక్టివ్‌‌గా ఉండాలి’ అని అడిగాడు.  మరొకామె ‘నాకు ఇవేమీ వద్దు. శరీరం ఎటు కావాలంటే అటు ఈజీగా బెండ్ అవ్వాలి. చూడ్డానికి స్లిమ్‌‌గా, ఫ్లెక్సిబుల్‌‌గా కనిపించాలి’ అని అడిగింది. అప్పుడు ఆ ట్రైనర్ ఎవరెవరికి ఎలాంటి వ్యాయామాలు సూచించాడో చూద్దాం.ముందుగా మొదటి అబ్బాయి  దగ్గరకు వద్దాం. అతను కండలు తిరిగిన బాడీ కావాలని అడిగాడు. కండల కోసం, కండరాల్లో శక్తి కోసం ఫిట్‌‌నెస్ ట్రైనర్ అతనికి స్ట్రెంతెనింగ్ ఎక్సర్‌‌‌‌సైజులు సూచించాడు.

దారుఢ్యం కోసం..

స్ట్రెంతెనింగ్ ఎక్సర్‌‌‌‌సైజులు శరీరంలోని కండరాలను బలంగా తయారు చేస్తాయి. బరువులు మోయడానికి, మెట్లు ఎక్కడానికి సరిపడినంత బలాన్ని కండరాలకు చేకూరుస్తాయి. ఈ వ్యాయామాలతో శరీరాన్ని అందంగా మలుచుకోవచ్చు. బాడీ బిల్డింగ్, మజిల్ బిల్డింగ్ చేసేవాళ్లంతా స్ట్రెంతెనింగ్ వ్యాయామాలే ఎక్కువగా చేస్తుంటారు. వెయిట్ లిఫ్టింగ్ వ్యాయమాలు, రెసిస్టెన్స్ బ్యాండ్ వ్యాయామాలు, పుషప్స్, పులప్స్, క్రంచ్, స్క్వాట్ లాంటివన్నీ స్ట్రెంత్ ఎక్సర్‌‌‌‌సైజుల కిందకే వస్తాయి.

శక్తి కోసం..

రెండో అబ్బాయి శక్తి కావాలని అడిగాడు. ఎక్కువసేపు యాక్టివ్‌‌గా ఉండాలి అన్నాడు. సో ట్రైనర్ అతనికి ఎండ్యూరెన్స్ వ్యాయామాలు సూచించాడు. ఎండ్యూరెన్స్ అంటే శరీరానికి  కావాల్సిన శక్తి. కార్డియో వ్యాయామాలు కూడా ఎండ్యూరెన్స్ వ్యాయామాల కిందకే వస్తాయి. ఎండ్యూరెన్స్ వ్యాయామాలు గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి. దాంతో గుండె, ఊపిరితిత్తులకు మేలు జరుగుతుంది. శరీరం ఆక్సిజన్ తీసుకునే శాతం పెరుగుతుంది. ఎండ్యూరెన్స్ ఉండడం వల్ల రోజువారీ పనులు అలసిపోకుండా ఎక్కువసేపు చేసుకోగలుగుతారు. కొండలు ఎక్కడం, ట్రెక్కింగ్ లాంటివి చేసేవాళ్లకు కూడా ఎండ్యూరెన్స్ వ్యాయామాలు బాగా పనికొస్తాయి. ఎండ్యూరెన్స్ వ్యాయామాలు.. మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉండేలా కాపాడతాయి. వీటిని రోజూ చేయడం వల్ల రక్త ప్రసరణ వేగం పెరిగి, శరీరం ఎప్పుడూ యాక్టివ్‌‌గా ఉంటుంది.  వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, రన్నింగ్, డాన్సింగ్, బైకింగ్, స్పోర్ట్స్, ఏరోబిక్స్ లాంటివన్నీ ఎండ్యూరెన్స్ ఎక్సర్‌‌‌‌సైజుల కిందకే వస్తాయి.

కంట్రోల్ కోసం..

ఇక మూడో అమ్మాయి ‘శరీరం ఎటు కావాలంటే అటు ఈజీగా మూవ్ అవ్వాలి’ అని అడిగింది కాబట్టి ట్రైనర్ ఆమెకు ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్సింగ్ వ్యాయామాలు సూచించాడు.  ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు శరీరాన్ని వీలైనంత వరకూ సాగదీస్తాయి. కండరాలు, కీళ్లు, నరాలు అన్నీ రిలాక్స్ అవుతాయి. ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాల వల్ల శరీరం చురుకుగా తయారవుతుంది. ఎటు కావాలంటే అటు వేగంగా కదులుతుంది. రోజువారీ పనులు, ఆటలు,  డ్రైవింగ్ లాంటి పనులకు ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు బాగా పనికొస్తాయి. ఈ వ్యాయామాలతో శరీరాన్ని అందంగా కూడా మలుచుకోవచ్చు. అలాగే ఫ్లెక్సిబిలిటీతో పాటు బ్యాలెన్సింగ్ వ్యాయామాలు కూడా తోడైతే.. శరీరం కదలికలతో పాటు నిలకడగా కూడా ఉండగలుగుతుంది. వయసు పైబడిన వాళ్లకు బ్యాలెన్సింగ్ వ్యాయామాలు బాగా పనికొస్తాయి. కాళ్లు తడబడకుండా నడవడానికి, శరీర కదలికల్ని కంట్రోల్  చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. స్ట్రెచింగ్ వ్యాయామాలు, యోగా, తాయ్ చీ లాంటివి ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్ వ్యాయామాల కిందకు వస్తాయి.

నాలుగు రకాలు

వ్యాయామాల్లో ఎండ్యూరెన్స్, స్ట్రెంతెనింగ్‌‌, బ్యాలెన్సింగ్‌‌, స్ట్రెచింగ్‌‌ అనే నాలుగు రకాలుంటాయి. ఎండ్యూరెన్స్‌‌ వ్యాయామాలు శక్తిని పెంచడానికి, స్ట్రెంతెనింగ్‌‌ ఎక్సర్‌‌సైజులు కండరాల్నీ, శరీర దారుఢ్యాన్ని పెంచడానికి., ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్సింగ్‌‌ వ్యాయామాలు  నాడీ సమస్యలు ఉన్నవారికి, కండరాలు, కీళ్ల సాగే గుణాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి.  ఎవరి అవసరానికి తగ్గట్టు వాళ్లు ఆయా వ్యాయామాలను ఎంచుకోవాలి.

జాగ్రత్తలివీ..

ఏ రకమైన వ్యాయామాలు చేసినా ముందుగా స్ట్రెచింగ్‌‌ వ్యాయామాలు చేయడం తప్పనిసరి. ఎక్సర్‌‌సైజులు చేయడానికి ముందు స్ట్రెచింగ్‌‌ వ్యాయామాలు చేయడం వల్ల శరీరం వ్యాయామానికి సిద్ధమవుతుంది. అలాగే వ్యాయామం చేసేటప్పు కండరాలు కీళ్లు పట్టేయకుండా ఉంటాయి. వ్యాయామాలు మొదలుపెట్టేముందు ఆరోగ్య సమస్యల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.  పక్షవాతం, నరాల సమస్యలు ఉన్నవాళ్లు  ఎండ్యూరెన్స్ వ్యాయామాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎముకలు, కీళ్ల సమస్యలు ఉన్నవాళ్లు ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంతెనింగ్‌‌ ఎక్సర్‌‌సైజులు ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఏ వ్యక్తి అయినా కొత్తగా వ్యాయామాలు మొదలుపెట్టే ముందు డాక్టర్‌‌ లేదా ఫిజికల్‌‌ ట్రైనర్‌‌ సలహా తీసుకోవాలి. వ్యాయామాలను లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కోసం ప్లాన్ చేసుకోవాలి. మెల్లగా మొదలుపెట్టి,  క్రమంగా స్థాయిని పెంచుకుంటూ పోవాలి. అలా కొద్దికొద్దిగా టార్గెట్‌‌ను అందుకోవాలి. అంతేకానీ, వెంటనే మార్పు రావాలని అతిగా వ్యాయామం చేయడం మంచిది కాదు.