తెలంగాణ ఎగ్జిట్‌‌ పోల్స్‌‌ .. కాంగ్రెస్‌‌కే మొగ్గు

  తెలంగాణ  ఎగ్జిట్‌‌ పోల్స్‌‌ .. కాంగ్రెస్‌‌కే మొగ్గు

 

  • రాష్ట్రంలో కాంగ్రెస్​కు 62 నుంచి ‌‌
  • 80 సీట్లు వస్తాయన్న టుడేస్​ చాణక్య
  • 58 నుంచి 67 సీట్లు వస్తాయన్న ఆరా..   
  • 64 సీట్ల దాకా రావొచ్చన్న జన్​ కీ బాత్​
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌కు 22 నుంచి 31 వరకు రావొచ్చన్న చాణక్య స్ట్రాటజీస్​    
  • అధికార పార్టీకి 50 సీట్ల లోపేనన్న అనేక సర్వే సంస్థలు

హైదరాబాద్‌‌, వెలుగు:  రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీనే అత్యధిక సీట్లలో గెలిపిస్తున్నారని ఎగ్జిట్ పోల్స్‌‌ స్పష్టం చేశాయి. జాతీయ, స్థానిక సర్వే సంస్థలన్నీ దాదాపుగా కాంగ్రెస్‌‌కే ఎక్కువ సీట్లు వస్తాయని తేల్చిచెప్పాయి. ఆ పార్టీకి ఎన్నికలకు ముంగట ఉన్న వేవ్‌‌, పోలింగ్ రోజు కూడా కొనసాగిందని పేర్కొన్నాయి.  మ్యాజిక్‌‌ ఫిగర్‌‌ (60 సీట్లు)కు పైగా స్థానాల్లో కాంగ్రెస్​ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని మెజారిటీ సంస్థలు ప్రకటించగా.. 55 నుంచి 60 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని మరికొన్ని సంస్థలు తెలిపాయి. ప్రీపోల్ సర్వేలలో బీఆర్‌‌‌‌ఎస్‌‌కు ఎక్కువ సీట్లు ఇచ్చిన పలు సంస్థలు కూడా.. ఎగ్జిట్ పోల్స్‌‌లో మాత్రం కాంగ్రెస్‌‌కు ఎక్కువ సీట్లు వస్తున్నాయని పేర్కొన్నాయి. 


2018 అసెంబ్లీ ఎన్నికల్లో 19 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌‌ ఈసారి సీట్ల సంఖ్యను మూడింతలు పెంచుకోనుందని తేలింది. గత ఎన్నికల్లో 88 సీట్లలో గెలుపొంది, రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్‌‌‌‌ఎస్ పార్టీ.. ఈ సారి 50 సీట్ల లోపే పరిమితం అవుతుందని మెజారిటీ సర్వే సంస్థలు వెల్లడించాయి. బీజేపీ, ఎంఐఎం సింగిల్ డిజిట్ సీట్లతోనే సరిపెట్టుకుంటాయని తెలిపాయి. ఎంఐఎంకు ఒకట్రెండు సీట్లు తగ్గుతాయని సర్వే సంస్థలు అంచనా వేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటే సీటు గెలిచిన బీజేపీ, ఈసారి కనీసం ఐదుకుపైగా సీట్లలో గెలుస్తుందని మెజారిటీ సర్వే సంస్థలు పేర్కొన్నాయి. 

ఓట్ల శాతంలో మార్పు

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌‌కు 28.4 శాతం ఓట్లు, బీఆర్‌‌‌‌ఎస్‌‌ 46.9 శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి కాంగ్రెస్‌‌ ఓట్ల శాతం 40 శాతం దాటుతుందని, బీఆర్‌‌‌‌ఎస్ 35 నుంచి 40 లోపే పరిమితం అవుతుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. ప్రముఖ సర్వే సంస్థ ఆరా బీఆర్‌‌‌‌ఎస్‌‌కు 39.58 శాతం, కాంగ్రెస్‌‌కు 41.13 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇరు పార్టీల నడుమ ఓట్ల శాతం తక్కువగా ఉన్నప్పటికీ, సీట్ల సంఖ్యలో ఎక్కువ తేడా ఉంటుందని తెలిపింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీ సీట్లతో పాటు, ఓట్ల శాతం కూడా పెరుగుతుందని సర్వేలు అంచనా వేశాయి. బీజేపీకి కనీసం 3 శాతం ఓటు షేర్ పెరిగి, పది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఎంఐఎం ఓట్ల షేర్‌‌‌‌లో మార్పు స్వల్పమే అయినప్పటికీ, సీట్లు తగ్గే అవకాశం ఉందని తెలిపాయి. కాంగ్రెస్‌‌ అత్యధికంగా 80 సీట్లు గెలిచే అవకాశం ఉందని టుడేస్​ చాణక్య సంస్థ ప్రకటించగా, బీఆర్‌‌‌‌ఎస్‌‌ అత్యధికంగా 56 సీట్లు గెలిచే అవకాశం ఉందని రిపబ్లిక్​ టీవీ అంచనా వేసింది.