ఖరాబైన రోడ్లతో నరకం అనుభవిస్తున్నం : హైదరాబాద్​ ప్రజలు

ఖరాబైన రోడ్లతో నరకం అనుభవిస్తున్నం : హైదరాబాద్​ ప్రజలు
  • ఫొటోలతో కేటీఆర్​కు హైదరాబాద్​ ప్రజల ట్వీట్లు
  • అధికారులకు ఎన్ని సార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకుంటలే
  • రేసింగ్​ ట్రాక్​ను ఆగమేఘాల మీద వేసిన్రు
  • పన్నులు కడ్తున్న మమ్మల్ని పట్టించుకోరా అని ప్రశ్నలు

హైదరాబాద్, వెలుగు: కార్ల రేసింగ్​ లీగ్​ కోసం హుస్సేన్​సాగర్​ చుట్టూ వారం రోజుల్లో ఆగమేఘాల మీద రోడ్లు వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. పన్నులు కడ్తున్న తమను ఎందుకు పట్టించుకోవడం లేదని హైదరాబాద్​ ప్రజలు ట్విట్టర్​ వేదికగా మంత్రి కేటీఆర్​ను ప్రశ్నిస్తున్నారు. తాము గుంతల రోడ్లతో నరకం అనుభవిస్తున్నా స్పందించరా? అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

రేసింగ్​ రోడ్ల తరహాలో తమ ప్రాంతాల్లోనూ రోడ్లను తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు.  నగరంలోని కాలనీల్లో పాడైన రోడ్లతో చస్తున్నామని, తమప్రాంతాల్లో కూడా ధగధగలాడేలా వారం పదిరోజుల్లో రోడ్లను వేయించేలా చూడాలని కోరుతున్నారు. తమ ఆవేదనను తెలిపేందుకు కొందరు మెసెజ్ రూపంలో ట్వీట్లు చేస్తుండగా, ఇంకొందరు ఖరాబైన రోడ్లను ఫొటోలు తీసి ట్యాగ్​ చేస్తున్నారు. రోడ్లతో పాటు ఇతర పనులకోసం అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మీకు అవసరముంటే రోజుల్లో రోడ్లు వేసుకుంటున్నరు. కానీ ట్యాక్స్​ చెల్లిస్తున్న మమ్మల్ని మాత్రం పట్టించుకోవడంలేదు” అంటూ ఓ నెటిజన్​ ట్వీట్​ చేశారు. మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని సిటీలోని అన్ని ప్రాంతాల్లో తక్షణమే రోడ్లు వేయించాలని నగర ప్రజలు కోరారు. 

సిటీ సమస్యలపై రోజూ వందల ట్వీట్లు

గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలోని కాలనీల్లో సమస్యలను స్థానిక అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో జనం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. వారు కూడా చాలావరకు ప్రాబ్లమ్స్ పై దృష్టి పెట్టడంలేదు. దీంతో మేయర్, మంత్రి కేటీఆర్​కు సమస్యలను చూప్తూ  ట్వీట్లు చేస్తున్నారు. కొన్ని ట్వీట్లకు స్పందిస్తున్న మంత్రి కేటీఆర్.. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ట్వట్టర్ వేదికగానే ఆదేశిస్తున్నారు. దీంతో జనం కూడా సమస్యకు పరిష్కారం దొరక్కపోతే నేరుగా కేటీఆర్​కు ట్వీట్లు చేస్తున్నారు. హైదరాబాద్​ సిటీ సమస్యలపై డైలీ కేటీఆర్​కు వందలాది ట్వీట్లు వస్తున్నాయి. కానీ కొన్నింటికి మాత్రమే ఆయన స్పందిస్తున్నారు. అధికారులు కూడా ఆయన ఆదేశించిన వాటికే ప్రిఫరెన్స్​ ఇస్తున్నారు. ఎన్నిసార్లు ట్వీట్ చేసినా స్పందించకపోవడంతో కొందరు వెరైటీగా ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవల రాజేంద్రనర్​లోని ఓ కాలనీలో నీటి పైపులైన్ పనులు చేయడంలేదని ఓ బాలుడి చేతిలో ప్లకార్డులు పట్టించి, చిల్డ్రన్స్​ డే సందర్భంగా ఈ పనులు చేయించండని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్​కు స్పందించిన మంత్రి కేటీఆర్.. జలమండలి ఎండీని ఆదేశించారు. వెంటనే అక్కడకు వెళ్లిన ఎండీ పనులు చేస్తామని బాలుడితో పాటు కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. 

రేసింగ్ ట్రాక్ రోడ్డుపై ట్వీట్లే ట్వీట్లు...

ట్విట్టర్​లో  గత రెండు, మూడు రోజులుగా రేసింగ్ ట్రాక్ రోడ్డు గురించే వేలాదిగా ట్వీట్లు వస్తున్నాయి. సిటీలో అన్నిచోట్ల రోడ్లు ఇలాగే ఉండాలని మంత్రి కేటీఆర్​కు కొందరు ట్వీట్​ చేయగా.. మిగతావారు  అధికారులు, ప్రముఖులకు ట్వీట్లు చేస్తున్నారు. ‘‘పాతబస్తీ నుంచి హైటెక్ సిటీ వరకు మొత్తం హైదరాబాద్ వీధుల్లో కారు  రేస్ జరగాలి.. అప్పుడే అన్నిచోట్ల డ్యామెజ్ లేని రోడ్లుగా మారుతాయి. ప్రభుత్వం కేవలం పేరుకోసం పని చేయకూడదు. ఓట్లేసిన ప్రజలకు మేలు చేస్తామనే నమ్మకం కలిగేలా పనిచేయాలి”అంటూ ఓ వ్యక్తి పలువురికి ట్వీట్​ చేశాడు. ‘‘హుస్సేన్​సాగర్​ చుట్టూ ట్యాంక్​ బండ్​పై గుంతలు లేని రోడ్డు చాలా బాగుంది. హాయిగా ప్రయాణిస్తున్న. అంతటా ఇలా వేస్తే బాగుంటుంది”అంటూ మరో వ్యక్తి ట్వీట్​ చేశాడు.