హాస్పిటాలిటీ సెక్టార్​లో కొలువుల జోరు

హాస్పిటాలిటీ సెక్టార్​లో కొలువుల జోరు
  • హాస్పిటాలిటీ సెక్టార్​లో కొలువుల జోరు
  • కొత్త సంవత్సరంలో భారీగా జాబ్స్​ వచ్చే చాన్స్​
  • 2023లో బలమైన వృద్ధి 

న్యూఢిల్లీ :  దేశీయ ప్రయాణాలు పెరగడంతో ఈ ఏడాది బలమైన వృద్ధిని సాధించిన భారతీయ హాస్పిటాలిటీ,  పర్యాటక రంగం.. కొత్త సంవత్సరంలో శరవేగంతో దూసుకెళ్తుందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో భారీగా జాబ్స్​ ఇస్తాయని అంటున్నారు.   2047 నాటికి భారతదేశ జీడీపీకి హోటల్ పరిశ్రమ  ప్రత్యక్ష సహకారం ట్రిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లకు చేరుకుంటుందని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్​ఏఐ)  నివేదిక అంచనా వేసింది. శ్రామిక శక్తి  కనీసం 25 శాతం పెరుగుదల ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రయాణం, విమానయానం, టిక్కెట్ బుకింగ్, ట్రావెల్ గైడ్లు  కన్సల్టెంట్‌‌‌‌‌‌‌‌ల వంటి వాటికి డిమాండ్ పెరుగుతోంది. "2047 నాటికి భారతదేశం జీడీపీ  ట్రిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లకు చేరుకోవడంలో హోటల్ పరిశ్రమ ప్రత్యక్ష సహకారం ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ గణనీయమైన వృద్ధి నిస్సందేహంగా ఈ రంగంలో ఉద్యోగాలను పెంచుతుంది.  దాదాపు పది లక్షల మంది వ్యక్తులకు ఉపాధిని అందిస్తుంది" అని హెచ్​ఏఐ  వైస్ ప్రెసిడెంట్ కేబీ కచ్రు చెప్పారు.  సౌత్ ఏషియా రాడిసన్ హోటల్ గ్రూప్ చైర్మన్ ఎమెరిటస్,  ప్రిన్సిపల్ అడ్వైజర్ అయిన కచ్రు మాట్లాడుతూ, కరోనా మహమ్మారి తరువాత, హాస్పిటాలిటీ రంగంలో భారీ మార్పులు వచ్చాయని, ఉపాధి పెరుగుతోందని అన్నారు.  అడాప్టబిలిటీ, డిజిటల్ ఇన్నోవేషన్ , అతిథి భద్రతపై తాము మరింత శ్రద్ధ చూపుతున్నామని అన్నారాయన. చాలెట్ హోటల్స్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ ఉర్వి ఆరాధ్య మాట్లాడుతూ, హాస్పిటాలిటీ రంగంలో కరోనా అనంతరం ఆరోగ్యం,  భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.   

25 శాతం అదనంగా..

రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఏజెన్సీ ‘జీఐ’ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సుదీప్ సేన్ మాట్లాడుతూ, ఈ ఏడాది వర్క్​ఫోర్స్​ 25 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ట్రావెల్, ఏవియేషన్, టిక్కెట్ బుకింగ్, ట్రావెల్ గైడ్లు/కన్సల్టెంట్లువంటి వాటికి డిమాండ్ పెరుగుతున్నదని అన్నారు.  ప్రయాణాలకు డిమాండ్​ 15–-18 శాతం మధ్యలో ఉండొచ్చని చెప్పారు. డిజిటల్ కంటెంట్ సృష్టికర్తలు, సోషల్ మీడియా మేనేజర్లు, హోటళ్లు  రిసార్ట్‌‌‌‌‌‌‌‌ల కోసం సస్టయినబిట్‌‌‌‌‌‌‌‌లు, వెజ్​ - ఫుడ్, బేవరేజ్ స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌లు, స్పా, హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌లకు గిరాకీ బాగుందని సేన్ తెలిపారు. రాయల్ ఆర్చిడ్ హోటల్స్ సీఎండీ చందర్ బల్జీ మాట్లాడుతూ, అంతటా దేశీయ ప్రయాణాలలో గణనీయమైన పెరుగుదల ఉందని, ఫలితంగా జాబ్స్​ కూడా పెరుగుతాయన్నారు.