ఈ డాగ్ పేరు విస్కీ..90 వస్తువుల పేర్లు తెలుసు!

ఈ డాగ్ పేరు విస్కీ..90 వస్తువుల పేర్లు తెలుసు!

చిన్న పిల్లల దగ్గర ఓ ఐదారు బొమ్మలు వేసి, అందులోని ఒక దాని పేరు చెప్పి తీసుకురమ్మంటే టక్కున తీసుకొచ్చేస్తారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే వాటిని మనం పేర్లతో పలికినప్పుడు చూసి నేర్చుకుంటారు. కానీ ఇలా ఓ డాగ్ చేయడం అద్భుతం కదూ! అదీ ఒకట్రెండు కాదు.. ఏకంగా 90 వస్తువులను గుర్తించగలిగితే గ్రేటే కదూ. అలాగని దానికేం ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు మరి. అది సొంతంగానే నేర్చుకుందని చెప్తున్నారు రీసెర్చర్లు. అంతేకాదు.. ఇది తన దగ్గరున్న బొమ్మలను కేటగిరీలుగానూ విడదీస్తోందట. అంటే బాల్స్, రోప్స్, రింగ్స్, ఫ్రీస్ బీలను వేటికవిగా వేరు చేస్తోందట. మహా తెలివైన ఈ డాగ్ పేరు ‘విస్కీ’. బోర్డర్ కోలి జాతికి చెందిన ఈ ఆరేళ్ల డాగ్ ను నార్వేకు చెందిన హెల్గె ఓ స్వెలా అనే వ్యక్తి పెంచుకుంటున్నాడు. ‘‘విస్కీ బొమ్మల పేర్లు నేర్చుకుందని మొదట చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను. కానీ కొన్ని రోజులు పరీక్షించిన తర్వాత నా ఓపీనియన్ మార్చుకున్నాను” అని చెప్పారు.

రీసెర్చర్లలో ఒకరైన క్లౌడియా. విస్కీ దగ్గర10 డిఫరెంట్ బాల్స్, 7 రింగ్స్, 4 రోప్స్, 4 ఫ్రీస్ బీలు ఉన్నాయని చెప్పారు. దీన్ని పరీక్షించేందుకు ఈ నాలుగు కేటగిరీలకు చెందిన మరో నాలుగు కొత్త వస్తువులను తీసుకొచ్చి బొమ్మల్లో కలిపామని..  అది వాటినీ కచ్చితంగా గుర్తించిందని వెల్లడించారు. ‘‘మేం తొలిసారి విస్కీని మీట్ అయ్యే సమయానికి దానికి 59 బొమ్మల పేర్లు మాత్రమే తెలుసు. అది మరో 31 బొమ్మల పేర్లు తెలుసుకుంటోందని ఓనర్లు చెప్పారు. విస్కీ ఆ బొమ్మలతో తరచూ ఆడుకోవడం, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం, అబ్జర్వ్ చేయడం ద్వారా వాటిని గుర్తిస్తోంది” అని క్లౌడియా వివరించారు. చిన్నారులు ఎలాగైతే తొలుత మాటలు నేర్చుకుంటారో… అలాగే విస్కీ స్కిల్స్ ఉన్నాయని, ఇది అన్ని డాగ్స్ లోనూ ఉండదన్నారు. ముఖ్యంగా డాగ్స్ కు పదాలపై నాలెడ్జ్ ఉండడం అరుదన్నారు. అయితే, విస్కీ కన్నా ఇంకా తెలివైన డాగ్ మరొకటి ఉండేది. అది బోర్డర్ కొలీ జాతికి చెందినదే. ‘చేజర్’ అనే ఆ డాగ్ 1000 పదాలు నేర్చుకున్నదట. అయితే, పోయినేడాదే అది చనిపోయింది.