ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు
  • ఓటర్ల నమోదుపై విస్త్రృత ప్రచారం చేయాలి
  • సీఈవో వికాస్ రాజ్

ఖమ్మం టౌన్, వెలుగు: కొత్త ఓటర్ల నమోదుపై విస్త్రృత ప్రచారం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞ సమావేశ మందిరంలో కలెక్టర్​ వీపీ గౌతమ్​తో కలిసి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ ఓట్ల తొలగింపు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన రికార్డును భద్రపర్చాలని తెలిపారు. డబుల్ ఎంట్రీ తొలగింపు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా తొలగించిన ఓట్లపై సమీక్ష చేయాలన్నారు.

 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకొనేలా చూడాలని చెప్పారు. కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలో 1416 పోలింగ్ కేంద్రాలున్నాయని తెలిపారు. కొత్తగా 23 కేంద్రాల ఏర్పాటు, 43 కేంద్రాల లొకేషన్ మార్పునకు కు ప్రపోజల్స్​ సిద్ధం చేశామని చెప్పారు. 1439 పోలింగ్ కేంద్రాలకు బీఎల్వోలను నియమించినట్లు తెలిపారు. అనంతరం ఓటరు నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులపై రూపొందించిన పోస్టర్ ను సీఈవో ఆవిష్కరించారు. అడిషనల్​ కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్  మధుసూధన్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్  ఆదర్శ్ సురభి, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ఎంప్లాయిమెంట్​ ఆఫీసర్​ శ్రీరామ్, తహసీల్దార్లు పాల్గొన్నారు. 
అనంతరం ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు, జలగంనగర్, ఖమ్మం అర్బన్ మండలంలోని ఇందిరానగర్​ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడ చేపడుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. బూత్ లెవల్  ఆఫీసర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ఎఫ్ఆర్వో కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాలి

దమ్మపేట వెలుగు: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని మున్నూరుకాపు సంఘం నాయకులు డిమాండ్​ చేశారు. మండల కేంద్రంలో సంఘం ఆధ్వర్యంలో ఎఫ్ఆర్వో ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల అధ్యక్షుడు చిన్నంచెట్టి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, ఉప సర్పంచ్ దార యుగంధర్, యార్లగడ్డ బాబు, పానుగంటి చిట్టిబాబు, సత్యంబాబు పాల్గొన్నారు.

ప్రభుత్వ హత్యే

ఖమ్మం కార్పొరేషన్: ఎఫ్ఆర్వో​శ్రీనివాసరావుది ప్రభుత్వ హత్యేనని కిసాన్​ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డి ఆరోపించారు. నగరంలోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ టీఆర్​ఎస్​ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు ఈ హత్యకు కారణమని విమర్శించారు. పోడు భూముల సమస్యను సామాజిక కోణంలో పరిష్కరించాల్సిన ప్రభుత్వం గందరగోళ పరిస్థితి సృష్టించిందని అన్నారు.

పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివాసీలను రెచ్చగొట్టి అటవీ అధికారులపై ఉసిగొలుపుతుంటే, మరోపక్క కేసీఆర్ అధికారులపై ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్ర ప్రదీప్, శ్యాం రాథోడ్, నున్నా రవి, చావా కిరణ్, ఉపేందర్​గౌడ్, అంజయ్య పాల్గొన్నారు.

విధులు బహిష్కరించిన ఫారెస్ట్ ఆఫీసర్లు

చండ్రుగొండ: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం జరిగిన పోడు గ్రామసభలను ఫారెస్ట్ ఆఫీసర్లు బహిష్కరించారు. మద్దుకూరు, పోకలగూడెం, బాల్యతండా, సీతాయిగూడెం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఎంపీడీవో, ఎంపీవో, ఆర్ఐ, జీపీ సెక్రటరీలు, సర్పంచులు హాజరయ్యారు. ముందుగా హత్యకు గురైన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావుకు నివాళులు అర్పించారు. 

వైభవంగా సీతారాముల కల్యాణం

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి గురువారం నిత్య కల్యాణం వైభవంగా జరిగింది. అర్చకులు మంగళవాయిద్యాల నడుమ గోదావరికి వెళ్లి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో సుప్రభాత సేవ నిర్వహించి బాలభోగం నివేదించారు. ఆ తర్వాత కల్యాణమూర్తులను భక్తుల జయజయధ్వానాల నడుమ ప్రాకార మండపానికి తీసుకొచ్చి కల్యాణ క్రతువు జరిపించారు.

విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, యజ్ఞోపవీతం, కంకణధారణ, కన్యాదానం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక, మంత్రపుష్పం నివేదన జరిగాయి. భక్తులు స్వయంగా కంకణాలు ధరించి కల్యాణం నిర్వహించారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజభోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.

సృజనాత్మకతను వెలికితీయాలి

ఇల్లందు, వెలుగు: ఏజెన్సీ ప్రాంతంలోని విద్యార్థుల్లో దాగిఉన్న విజ్ఞానాన్ని వెలికి తీసేందుకు సైన్స్​ఫేర్​ దోహదం చేస్తుందని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. గురువారం పట్టణంలోని సింగరేణి ఎయిడెడ్​ స్కూల్​లో జిల్లా విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా సైన్స్​ఫేర్​ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ఇల్లందులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.

మొదటి రోజు 7 థీమ్స్​లలో 672  రిజిస్ట్రేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్​ చైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, మార్కెట్​ చైర్మన్​ హరిసింగ్, డీఈవో సోమ
శేఖరశర్మ పాల్గొన్నారు.

రెండు రోజుల్లో పోడు సర్వే కంప్లీట్​ చేయాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రెండు రోజుల్లో పోడు సర్వేతో పాటు గ్రామసభల ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్​ అనుదీప్​ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో వివిధ శాఖల అధికారులతో గురువారం రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో 400 దరఖాస్తులు పరిశీలించాల్సి ఉందన్నారు. 300 గ్రామ సభలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. ప్రతీ గ్రామపంచాయతీలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలన్నారు.

జీవో నెంబర్​ 76 ప్రకారం ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల విచారణ వేగవంతం చేయాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా విచారణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 26,27 తేదీలతో పాటు వచ్చే నెల 3,4 తేదీల్లో అన్ని పోలింగ్​ స్టేషన్లలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. అడిషనల్​ కలెక్టర్​ కె వెంకటేశ్వర్లు, డీఆర్డీవో మధుసూధనరాజు, డీఆర్వో అశోక్​ చక్రవర్తి, డీపీవో రమాకాంత్​, ఆర్డీవోలు స్వర్ణలత, రత్నకల్యాణి పాల్గొన్నారు.

అంతకుముందు గొత్తికోయల దాడిలో హత్యకు గురైన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు ఫొటోకు కలెక్టర్​ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అడవులను కాపాడేందుకు శ్రీనివాసరావు చేసిన కృషి మరువలేనిదన్నారు. 

మార్కెట్​ను విజిట్ చేసిన వరంగల్​ ఆఫీసర్లు

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను వరంగల్  జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్  పి.ప్రసాద్ రావు, ఉన్నతశ్రేణి కార్యదర్శి  బీవీ రాహుల్, చాంబర్  ఆఫ్  కామర్స్  కార్యదర్శి వేద ప్రకాశ్​ గురువారం పరిశీలించారు. ఖమ్మం మార్కెట్ లో కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించి అధికారులు, పాలకవర్గాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం మార్కెట్​ చైర్​పర్సన్  డౌలే లక్ష్మీప్రసన్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి రుద్రాక్ష మల్లేశం, వైస్ చైర్మన్  కె.వెంకటేశ్వర్లు, వర్తక సంఘం ప్రధాన కార్యదర్శి మెంతుల శ్రీశైలం, మాటేటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

టీఆర్ఎస్​ హయాంలోనే గ్రామాల అభివృద్ధి

ముదిగొండ, వెలుగు: టీఆర్ఎస్​ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని జడ్పీ చైర్మన్  లింగాల కమల్ రాజ్  చెప్పారు. మండలంలోని సువర్ణాపురం, ముదిగొండలో రూ.20 లక్షల జడ్పీ, జీపీ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్ కొట్టే అపర్ణఉపేందర్, ఉప సర్పంచ్ తోట ధర్మారావు, కనపర్తి మోహన్​రావు, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ వెంకట్, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, పొట్ల ప్రసాద్  పాల్గొన్నారు.     

పోడు సమస్యను తీర్చేందుకు సీఎం కసరత్తు

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: పోడు సమస్యను తీర్చేందుకు సీఎం కేసీఆర్​ కసరత్తు చేస్తున్నారని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూధన్  తెలిపారు. గురువారం పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ బీజెపీ నాయకులు ఈడీ, సీబీఐలను వాడుకుంటూ టీఆర్ఎస్​ పార్టీ నేతలపై దాడులు చేయిస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్​ పార్టీ నాయకులను లొంగదీసుకొనేందుకే ఈడీ, సీబీఐ దాడు లకు తెరలేపారని చెప్పారు. జడ్పీ చైర్మన్​ లింగాల కమల్​రాజు, మేయర్​ నీరజ, కొండబాల కోటేశ్వరరావు, కమర్తపు మురళీ, ఖమర్, బెల్లం వేణు పాల్గొన్నారు.

రైతు సమస్యలపై కాంగ్రెస్​ ధర్నా

వెలుగు, నెట్​వర్క్: రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్​ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మండలకేంద్రాల్లో ర్యాలీలు చేపట్టి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్​ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రాలను అందజేశారు. ధరణి పోర్టల్​ రద్దు చేయాలని, రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

దళితబంధులో దళారులను నమ్మొద్దు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం నియోజకవర్గంలో దళితబంధు పథకం మంజూరులో దళారులు రాజ్యమేలుతున్నారని టీఆర్ఎస్  రాష్ట్ర కార్యదర్శి డా.వెంకట్రావ్​ ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పథకం రావాలంటే రూ.3 నుంచి 4లక్షలు కట్టాలంటూ వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఎవరికీ పైసా కట్టాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ కేసీఆర్  ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు.

నిరుపేద దళితుల కోసమే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని, భద్రాచలం నియోజకవర్గంలో జరుగుతున్న మోసాలపై పార్టీ అధిష్టానానికి, ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పార్టీ మండల అధ్యక్షులు అరికెల తిరుపతిరావు, కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు నవాబ్, తిప్పన సిద్ధులు పాల్గొన్నారు.

గంజాయి పట్టివేత

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో గురువారం పోలీసులు 20 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్​లో తనిఖీ చేస్తుండగా మైసూర్​కు చెందిన అయూబ్​ఖాన్​ పట్టుబడ్డాడు. ఏపీలోని సీలేరులో మాధవ్​వద్ద కొనుగోలు చేసి తీసుకెళ్తుండగా అరెస్ట్ చేశారు. ఈ గంజాయిని తన బంధువు ఇలియాజ్​కు అధిక ధరకు అమ్ముకంటున్నాడు. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి గంజాయితో పాటు రెండు సెల్​ఫోన్లు  స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

ఈ తనిఖీల్లో ఎస్సై శ్రీకాంత్​ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ వినీత్​రెడ్డి, ఏఎస్పీ రోహిత్​రాజులు పోలీసులను అభినందించారు

ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి

వైరా, వెలుగు: ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని సీపీఎం వైరా నియోజకవర్గ ఇన్​చార్జి భుక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. గురువారం జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత రూ.50 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇన్​చార్జీ కమిషనర్లతో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఖాళీ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బొంతు రాంబాబు, సుధాకర్, చలపతిరావు, రవీందర్, సమత, రామారావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఫర్టిలైజర్​ షాపుల తనిఖీ

ఖమ్మం రూరల్, వెలుగు: మండలంలోని తల్లంపాడు గ్రామంలో ఫర్టిలైజర్​ షాపులను గురువారం కూసుమంచి ఏడీఏ ఎస్  విజయ్​చంద్ర తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ డీలర్లు స్టాక్  రిజిస్టర్లు, స్టాక్ బోర్డులను మెయింటేన్​ చేయాలని సూచించారు. ఎరువులను పీఓఎస్  మిషన్  ద్వారా అమ్మాలని ఆదేశించారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏవో వి నాగేశ్వరరావు, ఏఈఓ జి విజయ్ కుమార్  పాల్గొన్నారు.  

డిజిటల్ టెక్నాలజీపై అవగాహన

ఖమ్మం రూరల్, వెలుగు: మండలంలోని చింతపల్లి గ్రామంలో గురువారం డిజిటల్ టెక్నాలజీపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి గ్రామీణ్  డిజిటల్  సాక్షరత అభియాన్  ప్రాజెక్ట్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెల్ ఫోన్, కంప్యూటర్ పై కనీస అవగాహన,  మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కంప్యూటర్ ఆపరేటర్లు ప్రసన్నకుమారి, శిరీష, విజయ్ కుమార్  పాల్గొన్నారు.

శానిటేషన్​పై స్పెషల్​ డ్రైవ్

వైరా, వెలుగు: పట్టణంలోని11వ వార్డులో శానిటేషన్​ స్పెషల్ డ్రైవ్  నిర్వహించారు. ఈ పనులను మున్సిపల్ ఇన్​చార్జి కమిషనర్ అనిత, కౌన్సిలర్ దారేల్లి పవిత్ర కుమారితో కలిసి పరిశీలించారు. డ్రైనేజీలో పేరుకుపోయిన పూడికను తీయించాలని చెత్తను తొలగించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్​ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వర్క్ ఇన్స్​పెక్టర్ చాపల వెంకటేశ్వర్లు, అంబర్లపూడి మురళి, నండ్రు నాగరాజు, వెంకట్రావు, నవీన్  పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి

భద్రాచలం, వెలుగు: భద్రాచలం పంచాయతీకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని గోండ్వానా సంక్షేమ పరిషత్​ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ డిమాండ్​ చేశారు. గురువారం భద్రాచలంలో అఖిల భారత మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్తవరపు జానకీరాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాచలం, సారపాక, మణుగూరు, ఆసిఫాబాద్, ఉట్నూర్​ పంచాయతీలు 5వ షెడ్యూల్ లో​ఉన్న  దృష్ట్యా పీసా చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్  విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. 

  • ‘పోడు’ గ్రామ సభలకు ఫారెస్ట్​ ఆఫీసర్లు దూరం
  • ఆర్ఓఎఫ్​ఆర్​ పట్టాలపై అనుమానాలు
  • పోడు సమస్య హింసాత్మకం కావడానికి గొత్తికోయలే కారణమంటున్న అటవీ శాఖ
  • రాష్ట్రం నుంచి పంపించాలని డిమాండ్


భద్రాచలం,వెలుగు: పోడు భూముల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్న తరుణంలో చండ్రుగొండ మండలంలో గొత్తికోయలు ఎఫ్ఆర్వోను హత్య చేయడంతో పోడు పట్టాలు వస్తాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్య నేపథ్యంలో తమకు ఆయుధాలు ఇవ్వాలని, గొత్తి కోయలను రాష్ట్రం నుంచి పంపించేయాలని అటవీ శాఖ ఆఫీసర్లు, ఉద్యోగులు గురువారం నుంచి విధులు బహిష్కరించారు.

ఆర్ఓఎఫ్ఆర్​ గ్రామసభల్లో ఫారెస్ట్  ఆఫీసర్ల సంతకాలే కీలకం కాగా, వారు రాకపోవడంతో సభలు నిర్వహించి ఏం ప్రయోజనమని అంటున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 83,663 క్లైమ్​లు ఉన్నాయి. 2,99,477 ఎకరాల పోడు భూముల పట్టాలిచ్చే ప్రక్రియలో సబ్​ డివిజనల్, జిల్లా స్థాయి మీటింగ్​లో ఎఫ్ఆర్వోలు, డీఎఫ్ఓలు తీర్మానాలపై సంతకాలు చేయాలి. ఇప్పటికే 332 పంచాయతీల్లోని 726 హ్యాబిటేషన్లలో జాయింట్​ సర్వే పూర్తయింది.

ఇప్పుడు గ్రామసభల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు సంతకాలు చేస్తేనే పట్టాలు వస్తాయి. ఇప్పుడు ప్రతీ పని ఫారెస్ట్​ వాళ్లతోనే ముడిపడి ఉండడం, వాళ్లు విధులు బహిష్కరించడంతో గ్రామసభలెట్లా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. గురువారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 49 గ్రామసభలు జరిగాయి. ఏ గ్రామసభకు కూడా ఫారెస్ట్  స్టాఫ్​ హాజరు కాలేదు.

గొత్తికోయ గ్రామాల్లో టెన్షన్..​

రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఎఫ్ఆర్వో​స్థాయి అధికారి హత్య జరగడంతో పోడు సమస్య హింసాత్మకంగా మారడానికి గొత్తికోయలే ప్రధాన కారణమని అటవీశాఖ ఉన్నత అధికారులు ప్రకటించారు. ఫీల్డ్ లెవల్​లో విధులు బహిష్కరించిన స్టాఫ్​ వారిని రాష్ట్రం నుంచి పంపించేయాలని డిమాండ్​ చేస్తున్నారు. దీంతో గొత్తి కోయ  గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

2018 లెక్కల ప్రకారం భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాల్లో విలీనమైన వెంకటాపురం, వాజేడు మండలాలను కలుపుకుని 131 వలస ఆదివాసీ గ్రామాలున్నాయి. 11 వేల ఫ్యామిలీలు ఛత్తీస్​గఢ్​ నుంచి వలస వచ్చి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. 2005లో ఛత్తీస్​గఢ్​ దండకారణ్యం, సల్వాజుడుం ఉద్యమంతో రావణకాష్టమైంది. దీంతో అక్కడి గొత్తికోయలు ఉమ్మడి ఏపీలోని ఖమ్మం జిల్లాకు వలస వచ్చారు.

అప్పటి నుంచి వారిని పంపించేందుకు సర్కారు ప్రయత్నిస్తున్నా జాతీయ స్థాయిలో వివిధ హక్కుల కమిటీలు, సంఘాల ఒత్తిళ్లతో వారికి ఇక్కడ రేషన్, ఆధార్, ఓటర్​కార్డులతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు. నాన్​ టింబర్​ ఫారెస్ట్ ప్రొడక్ట్స్​​సేకరించే విషయంలోనూ స్థానిక ఆదివాసీలతో గొడవలు జరుగుతున్నాయి. రేంజర్​ హత్యజరిగిన తర్వాత రాష్ట్రం నుంచి గొత్తికోయలను పంపించా లనే డిమాండ్​ స్థానిక ఆదివాసీల నుంచి కూడా వస్తోంది.

గతంలో తెలంగాణ సర్కారు కూడా హరితహారం, అడవుల సంరక్షణలో భాగంగా వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించద్దని నిర్ణయించింది. అప్పుడు వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. తాజా ఘటన నేపథ్యంలో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.