అమెరికాతో మా బంధం మరింత బలపడింది: జైశంకర్

అమెరికాతో మా బంధం మరింత బలపడింది: జైశంకర్
  • చంద్రయాన్ లాగే కొత్త శిఖరాలను చేరుతుంది
  • రెండు దేశాలు కలసికట్టుగా పని చేస్తున్నయ్
  • అమెరికా మద్దతుతోనే జీ20 సక్సెస్ అయిందన్న మంత్రి జైశంకర్

వాషింగ్టన్: అమెరికా, భారత్ మధ్య బలమైన బంధం ఏర్పడిందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ఆ బంధానికి హద్దుల్లేవని అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్.. శనివారం ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో వాషింగ్టన్​లోని ఇండియా హౌస్ లో ‘సెలబ్రేటింగ్ కలర్స్ ఆఫ్ ఫ్రెండ్ షిప్’ పేరుతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. దీనికి భారీగా హాజరైన ఇండియన్–అమెరికన్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

 ‘‘అమెరికా, భారత్ పరస్పర అవగాహనతో ముందుకెళ్తున్నాయి. ఈ బంధం ఎంత వరకు కొనసాగుతుందని నన్ను తరచూ అడుగుతూ ఉంటారు. కానీ మా బంధానికి పరిమితులు లేవు. నిజానికి ఆ బంధాన్ని నిర్వచించలేం కూడా. రెండు దేశాల మధ్య బలమైన బంధం ఏర్పడింది. దాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం” అని జైశంకర్ తెలిపారు. ‘‘ఇస్రో ‘చంద్రయాన్’ జాబిల్లిని చేరుకున్నట్టే.. భారత్, అమెరికా బంధం కొత్త శిఖరాలను చేరుకుంటుంది. 

అంతకుమించి కూడా వెళ్లొచ్చు” అని అభివర్ణించారు. అమెరికా మద్దతు లేకుండా జీ20 మీటింగ్ సక్సెస్ సాధ్యమయ్యేది కాదని అన్నారు. ఇది జీ20 దేశాల విజయంతో పాటు భారత్, అమెరికా బంధాల విజయమని పేర్కొన్నారు. ‘‘దేశాల మధ్య వ్యాపార, రాజకీయ, సాంస్కృతిక సంబంధాలు ఉంటాయి. మిలటరీ సంబంధాలు ఉంటాయి.

 కానీ రెండు దేశాల మధ్య లోతైన మానవ సంబంధాలు ఉన్నప్పుడు.. ఆ బంధం బలంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా, భారత్ మధ్య ఉన్న బంధం అలాంటిదే” అని చెప్పారు. గతంలో అమెరికా, ఇండియా మధ్య డీలింగ్స్ మాత్రమే ఉండేవని.. ఇప్పుడు రెండు దేశాలు కలసికట్టుగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు.  

అమెరికాలో మనోళ్లు 50 లక్షల మంది.. 

అమెరికాలో ఇండియన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని జైశంకర్ తెలిపారు. ‘‘1949లో అప్పటి ప్రధాని నెహ్రూ అమెరికా వచ్చినప్పుడు మనోళ్లు 3 వేల మంది ఉన్నారు. 1966లో ఇందిర వచ్చినప్పుడు 30 వేల మంది ఉన్నా రు. 1985లో రాజీవ్ వచ్చినప్పుడు 3 లక్షల మంది ఉన్నారు. మోదీ వచ్చినప్పుడు 30 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడా సంఖ్య దాదాపు 50 లక్షలకు పెరిగింది” అని వెల్లడించారు. 

ఈ పదేండ్లలో ఇండియా సామర్థ్యం పెరిగిందని, కొత్త ఇండియా అవతరించిందని అన్నారు. ‘‘ఇది చంద్రయాన్ 3, జీ20 మీటింగ:ను విజయవంతంగా నిర్వహించిన ఇండియా. కరోనాను ఎదుర్కోవడంతో పాటు వందకుపైగా దేశాలకు సాయమందించిన ఇండియా” అని పేర్కొన్నారు.