రేట్​ కార్డులు పెట్టి మరీ నియామకాల్లో దోపిడీ.. బీజేపీ సర్కార్​తోనే యువత భవిష్యత్​ పదిలం

రేట్​ కార్డులు పెట్టి మరీ  నియామకాల్లో దోపిడీ.. బీజేపీ సర్కార్​తోనే  యువత భవిష్యత్​ పదిలం

న్యూఢిల్లీ: గతంలో అధికారంలో ఉన్న కొన్ని కుటుంబ పార్టీలు ప్రభుత్వ వ్యవస్థలు అన్నింటినీ నిర్వీర్యం చేశాయని, ప్రతీ వ్యవస్థలోనూ ఆశ్రిత పక్షపాతం, అవినీతిని జొప్పించాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఉద్యోగ నియామక ప్రక్రియను అవినీతికి, అక్రమార్జనకు ఓ అవకాశంగా వారు చూసే వారని మండిపడ్డారు. కానీ, తమ ప్రభుత్వం ఏర్పడ్డాక యువతకు ఉపాధి కల్పించే విషయంపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన వివరించారు. నోటిఫికేషన్ నుంచి మొదలుపెట్టి నియామక పత్రాలు అందించే వరకూ.. ఎక్కడా అవినీతికి, బంధుప్రీతికి చోటివ్వకుండా పూర్తి పారదర్శకతతో ప్రాసెస్​ను పూర్తి చేస్తున్నట్లు వివరించారు. గతంలో కన్నా ప్రస్తుతం భారత దేశం దృఢంగా తయారైందని తెలిపారు. ఈమేరకు మంగళవారం రోజ్​ గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్​ గా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 71 వేల మందికి పైగా నియామక పత్రాలను అందజేశారు.

అటెండర్ పోస్టుకు ఇంత.. క్లర్కుకు ఇంత..

ఫలానా ఉద్యోగానికి చెల్లించాల్సిన ధర ఇంత.. అంటూ అటెండర్​ పోస్టుల నుంచి ఆఫీసర్ పోస్టుల దాకా రేట్​ కార్డ్​ పెట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నాయంటూ బెంగాల్​ లోని టీఎంసీ ప్రభుత్వాన్ని పరోక్షంగా మోడీ ఎత్తిపొడిచారు. దోచుకోవడమే లక్ష్యంగా తెగించాయని ఆరోపించారు. ఆస్తులను పోగేయడమే లక్ష్యంగా పెట్టుకుని అక్రమార్జనకు దిగుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలకు బదులుగా పేద రైతుల భూములు పొందినందుకు రైల్వే మాజీ మంత్రి ఒకరు క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్నారని పరోక్షంగా రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ యాదవ్‌‌పై మోడీ మండిపడ్డారు.

యువత భవిష్యత్తే మాకు ముఖ్యం

యువత కోసం పాటుపడుతున్న తన ప్రభుత్వ హయాంలో యువత భవిష్యత్తు బాగుందా.. లేక కుటుంబ పార్టీల పాలనలో బాగుందా అనేది ఇప్పుడు దేశం మొత్తానికీ తెలిసిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఉద్యోగ నియామక ప్రక్రియతో ఎన్డీయే ప్రభుత్వానికి ప్రత్యేక గుర్తింపు లభించిదన్నారు. వివాదాలను, విభజనను వ్యాప్తి చేసేందుకు కొన్ని పార్టీలు భాషను ఆయుధంగా వాడుతుండగా.. తమ ప్రభుత్వం ఉపాధి కల్పనకు, ప్రజలకు సాధికారత కోసం కృషి చేస్తోందన్నారు.

70 వేల మందికి నియామక పత్రాలు

రోజ్​గార్​ మేళా ద్వారా 70 వేల మందికి పైగా నియామక పత్రాలను వర్చువల్​గా ప్రధాని మోడీ పంపిణీ చేశారు.  అనంతరం ఉద్యోగంలో చేరబోతున్న వారిని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడా రు. ఉద్యోగ నియామక ప్రక్రియలో అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని ప్రోత్సహిస్తూ కుటుంబ పార్టీలు కోట్లాదిమంది యువతకు ద్రోహం చేశాయన్నారు. గతంలో రిక్రూట్‌‌మెంట్ ప్రక్రియకు ఏడాది నుంచి ఏడాదిన్నర సమయంపట్టేదని, ఇప్పుడు పారదర్శకంగా కొన్ని నెలల్లోనే ముగుస్తుందని చెప్పారు. దశాబ్దం క్రితం కంటే భారతదేశం ఇప్పుడు మరింత స్థిరంగా, బలమైన దేశంగా తయారైందన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలో కొత్త ఉపాధి అవకాశాలు ఉన్నాయని, ముద్ర యోజన, స్టార్ట్ అప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి కార్యక్రమాలతో స్వయం ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయన్నారు.