వడ్ల కొనుగోలులో మిల్లర్ల దోపిడీ.. రూ.250 కోట్ల మోసం

వడ్ల కొనుగోలులో  మిల్లర్ల దోపిడీ.. రూ.250 కోట్ల మోసం

నిజామాబాద్, వెలుగు: రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించకుండా మిల్లర్లు రూ.వందల కోట్ల రైతుల ధనాన్ని లూటీ చేస్తున్నారు. కొనుగోలు సెంటర్ల నుంచి వచ్చిన వడ్లను దింపుకోడానికి నాణ్యత పేరుతో కొర్రీలు పెడుతూనే.. సొంతంగా రైతుల నుంచి కొనుగోళ్లు చేపడుతున్నారు. సర్కార్​కొనుగోలు కేంద్రాల్లో కాంటాల్లో ఆలస్యం కావడంతో మిల్లర్లకు కలిసోస్తుంది. కోతలు ముగించిన రైతులు మిల్లర్ల సిండికేట్ ధరకు వడ్లు అమ్ముకొని నష్టపోతున్నారు. మద్దతు ధర వచ్చేలా నిఘా పెట్టాల్సిన సివిల్​సప్లయ్​అధికారులు సైలెంట్​గా ఉంటున్నారు.

మిల్లర్ల కొనుగోలు 10 లక్షల టన్నులు 

ఉమ్మడి నిజామాబాద్​జిల్లాలో 7.53 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. ఎకరానికి 25 క్వింటాళ్ల చొప్పున 18.82 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు సెంటర్ల ద్వారా సేకరించాలని అధికారులు టార్గెట్​పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 8.7 లక్షల టన్నులు సేకరించారు. లారీలు, హమాలీల కొరత వారిని వెంటాడుతోంది. ఈ సమస్యలేవీ లేకుండానే ఉమ్మడి జిల్లాలోని 349 రైసు మిల్లర్లు రైతుల నుంచి నేరుగా క్వింటాల్ ​వరికి రూ.1700 నుంచి రూ.1800 ధర చెల్లించి 10 లక్షల టన్నుల ధాన్యం కొన్నారు. గవర్నమెంట్​ దొడ్డురకం వడ్లు క్వింటాలుకు రూ.2,060, సన్నాలను రూ.2,040 రేటుతో కొనుగోలు చేస్తోంది.  కానీ ఉమ్మడి జిల్లాలో మిల్లర్లు తక్కువ ధరకే వారి నుంచి వడ్లుకొని రూ.250 కోట్ల మేర దోపిడీ చేశారు.

విధివిధానాలు ఇలా..

రైతు నుంచి కొన్న వడ్లకు సంబంధించి మిల్లర్​పారదర్శకంగా రికార్డు నిర్వహించాలి. పట్టాపాస్​బుక్​జిరాక్స్, చిరునామా, నగదు ముట్టజెప్పారా? లేకా బ్యాంక్​అకౌంట్​కు ట్రాన్స్​ఫర్​చేశారా? లాంటి విషయాలు అందులో పొందుపరచాలి. కస్టమ్​మిల్లింగ్​వడ్లతో సంబంధం లేకుండా కొనుగోలు చేసిన సరుకును విడిగా గోదాముల్లో నిల్వ చేయాలి.

కొరవడిన పర్యవేక్షణ..

నాన్​ట్రేడింగ్ ​మిల్లర్లు సొంతగా వడ్లు కొనడానికి అవకాశం లేదు. ఎవరు కాంటాలు పెట్టినా వాటి చట్టబద్ధతను సివిల్​సప్లయ్​అధికారులు నిర్ధారించుకోవాలి. ట్రేడింగ్​మిల్లర్లు మాత్రమే గవర్నమెంట్​ప్రకటించిన రేటుతో వడ్లు కొనాలి. ఈ కొనుగోళ్ల తాలూకు రైతుల లిస్టుతో సివిల్​సప్లయ్​అధికారులు క్షేత్ర పరిశీలన చేయాలి. జాబితాలోని ప్రతీ వంద మందిలో ఇద్దరు, ముగ్గురు  రైతులను ర్యాండమ్​గా కలిసి వారు అమ్మిన వడ్లు, పొందిన ధర, చెల్లింపు తీరు, కాంటా ఇతర అంశాలను నిర్ధారించుకోవాలి. కానీ ఎక్కడా అధికారులు పరిశీలన చేసినట్లు కనిపించడం లేదు.