ఈ లక్షణాలు కనిపిస్తే... మీకు కండ్లకలక వచ్చినట్టే

ఈ లక్షణాలు కనిపిస్తే... మీకు కండ్లకలక వచ్చినట్టే

తెలుగు రాష్ట్రాల్లో కండ్ల కలక కేసులు భారీగా నమోదవుతున్నాయి. కళ్ల కలక అంత తీవ్రమైన జబ్బుకానప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చూపుపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ జబ్బు సాధారణంగా ఏడు నుంచి పది రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత తగ్గిపోతుంది. ఇదొక అంటువ్యాది. తగిన జాగ్ర త్తలు తీసుకోకపోతే ఇతరులకు సోకుతుంది. ఒకఇంట్లో ఒకరికి సోకిందంటే మిగతా వారికి కూడా శరవేగంగా వ్యాపిస్తుంది. అయితే కొన్ని  జాగ్రత్తలు తీసుకుంటే దీని వ్యాప్తిని త్వరగా అరికట్టవచ్చు. 

లక్షణాలు 

కండ్ల కలక.... దీనినే పింక్ ఐ అని కూడా అంటారు. ముఖ్యంగా వానాకాలంలోనే కండ్ల కలక ఇబ్బంది పెడుతుంది. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువ ఉండటంతో ..ఈ బ్యాక్టీరియా కళ్ళను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా కళ్ళు కండ్ల కలక బారిన పడతాయి.  కళ్లు  ఎర్రగా మారడం. కళ్లలో మంట, నొప్పి, దురద ఉండటం. కనురెప్పలు వాపు రావడం. కంటి రెప్పలు అతుక్కోవడం. ఉదయం నిద్రలేచే సరికి ఎక్కువ పుసులతో కనురెప్పలు అతుక్కొని ఉండడం. ఎక్కువ వెలుతురు చూడలేక పోవడం. కళ్ల నుంచి నీరు లేక చిక్కటి స్రావం కారడం. బాక్టీరియాతో కలిగే కలకతో చీము వచ్చే అవకాశం కూడా ఉండడం. చిన్న పిల్లల్లో జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

ఎలా వస్తుందంటే...

కళ్ల కలక  బాక్టీరియా, అలర్జీ కారణంగా వస్తుంది.  కలకలు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయి. గుంపులుగా ఉండే ప్రదేశాల్లో అధికంగా వ్యాప్తి చెందేందుకు అవకాశాలున్నాయి. అలర్జీతో కలిగే కలక ఆ వ్యక్తి రోగ నిరోధక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది.  అలర్జీ వల్ల కలిగే కలక తక్కువ సమయంలో తీవ్రమైన లక్షణాలతో వస్తుంది. అంతే వేగంగా తగ్గిపోతుంది. బాక్టీరియాతో కలిగే కలక కొన్ని రోజుల వ్యవధిలో పెరుగుతుంది. కళ్ల మీద అధిక ప్రభావం ఉంటుంది. కంటి చూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కొన్ని సార్లు రసాయనాల వల్ల కలక రావచ్చు. అప్పుడు శుభ్రమైన నీటితో కళ్లను శుభ్రం చేసుకుంటే తగ్గిపోతుంది. లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇన్ఫ్‌క్షన్‌ ఉన్న వ్యక్తి నుంచి ఆ వైరస్‌ ఇతర వ్యక్తులకు కంటి స్రావాలు, చేతుల ద్వారా చేరుతుంది. ఎక్కువ శాతం చేతులు కళ్లలో పెట్టుకోవడం ద్వారా సోకుతుంది. ఒక వ్యక్తి ముక్కులో లేదా సైనస్‌లో ఉండే వైరస్‌, బాక్టీరియా ఇతరుల కళ్లలోకి చేరడం ద్వారా ఇన్ఫ్‌క్షన్‌ వచ్చే ప్రమాదం ఉంది. కాంటాక్టు లెన్స్‌ వినియోగించే అలవాటు ఉన్నవారు వాటిని సక్రమంగా శుభ్రం చేసుకోవాలి. సరైన లెన్స్‌వాడకపోడం వల్ల కూడా కలక రావచ్చు.

తీసుకోవలసిన జాగ్రత్తలు 

ఈ లక్షణాలు కనిపించినప్పుడు కళ్లు నలపడం లేదా చేతులు పెట్టడం చేయరాదు. శుభ్రమైన టిష్యూ పేపర్‌ లేదా చేతి రుమాలుతో కండ్లు తరచూ తుడుచుకోవాలి. నల్లటి అద్దాలు పెట్టుకోవడం ద్వారా నుంచి కొంత ఉపశ మనం పొందవచ్చు. కాంటాక్టు లెన్స్‌ పెట్టుకునేవారు వెంటనే వాటి వాడకం ఆపేయాలి. వైరస్‌ వల్ల కలిగే సమస్య ఒకటి రెండు వారాల్లో తగ్గిపోతుంది. బాక్టీరి యాతో సమస్య ఏర్పడితే సరైన మందును తగిన మో తాదులో తీసుకోవాలి. కండ్ల కలకలు నివారించడానికి తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. కళ్ల కలక ఉన్న వారు వాడిన చేతి రుమాలును , శరీరం శుభ్రం చేసుకునే వస్త్రాలను  ఇతరులు వాడొద్దు.

ఇక సొంత వైద్యం చేసుకోకూడదని, ఇతరులకు కరచాలనం ఇవ్వొద్దని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాడిన టవల్స్, కర్చీఫ్, చద్దర్లు ఇతరులకు ఇవ్వకూడదని, అలాగే లక్షణాలు ఉన్న పిల్లలను స్కూల్‌కి పంపిచవద్దని సూచించింది. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని, వారికి అవగాహన కల్పించాలని తెలిపింది. కండ్లకలక బారిన పడిన పిల్లలను ఎట్టిపరిస్థితుల్లోనూ స్కూల్‌కి పంపించవద్దని పేర్కొంది.