ఊరు చాలా చిన్నది.. కానీ పేరు మాత్రం..

 ఊరు చాలా చిన్నది.. కానీ పేరు మాత్రం..

ఎజ్... దక్షిణ ఫ్రాన్స్​లోని కొండప్రాంతంలో ఉన్న ఒక బుల్లి విలేజ్. పేరు ఎంత చిన్నగా ఉందో ఊరూ అంత చిన్నదే! కానీ... ఊరి విశేషాలు మాత్రం బోలెడు. ఈ ఊరి అందాలు సందర్శకులను మైమరిపిస్తాయి.ఊళ్లో బిల్డింగ్​ల మీద కనిపించే ఆర్కిటెక్చర్, కళ్లు జిగేల్​మనేలాంటి లొకేషన్స్ ఎన్నో ఉన్నాయి. మధ్య యుగ కాలానికి చెందిన ఊరి నిర్మాణం చూస్తుంటే నిజంగా ఆ కాలానికి వెళ్లొచ్చినట్టే అనిపించడం ఖాయం.

దక్షిణ ఫ్రాన్స్​లోని కొండప్రాంతంలో దాదాపు 1,400 అడుగుల ఎత్తులో ఉంది ఎజ్. మరోలా చెప్పాలంటే మొనాకొ, నైస్​ల మధ్య ఉంది ఈ ఊరు. అంటే... నైస్​ సిటీ నుంచి కారు​లో వెళ్తే12 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఎజ్​ వచ్చేస్తుంది. అలాగే ఎజ్ నుంచి మొనాకోకి గంటన్నరపాటు నడవొచ్చు. అంతేకాదు, ఈ అందమైన ఊరంటే చాలామందికి ఇష్టం. వాళ్లలో అమెరికన్ యానిమేటర్, ప్రొడ్యూసర్, ఎంట్రప్రెనూర్​ అయిన వాల్ట్ డిస్నీ కూడా ఒకరు. ఆయన చాలాకాలం ఎజ్​లోనే ఉన్నారు. 
 ప్రకృతి ఒడిలో...
ఈ ఊళ్లో మధ్యదరాసముద్రం, దానికి దగ్గర్లో ఉన్న ఫ్రెంచ్ రివీయెర నది.. వాటి అందాలను చూడాలంటే రెండు కళ్లూ సరిపోవు. ఎజ్​లో ఏ మూలకు వెళ్లి చూసినా ఊరి అందాలు కనిపిస్తాయి. ఊరు కొండపైన ఉంది కాబట్టి, పైనుంచి సముద్రాన్ని చూస్తుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం. ప్రకృతి అందాలే కాదు... వీధుల్లో నడుస్తుంటే ఒక్కో బిల్డింగ్ కట్టిన తీరు, మధ్యయుగం నాటి ఆర్కిటెక్చర్ కళ్లను కట్టిపడేస్తాయి. వందల ఏండ్ల నాటి నిర్మాణమైన ఎజ్​ బిల్డింగ్​ చూడొచ్చు. దాన్ని చాపెల్​ డి లా సెయింటె క్రాయిక్స్ (క్లాక్ టవర్)​ అని పిలుస్తారు. దీన్ని1300 కాలంలో కట్టించారు. ఎజ్​కి టూరిస్ట్​లు ఎక్కువగా రావడం వల్ల దీన్ని విలేజ్ ముసీ (మ్యూజియం విలేజ్​)  అని పిలుస్తున్నారు. 
మొక్కలంటే ఇష్టమున్న వాళ్లు తప్పనిసరిగా వెళ్లాల్సిన ప్లేస్​ ఇది. ఇక్కడ ఎగ్జోటిక్ గార్డెన్ ఉంది. దాన్ని ‘లె జార్డిన్ ఎగ్జోటిక్ డి ఎజ్’ అని పిలుస్తారు. అందులో ఎన్నో రకాలైన ఎగ్జోటిక్ కాక్టస్​ మొక్కలతో పాటు రకరకాల వృక్షజాతులు కనిపిస్తాయి. సాధారణంగా కాక్టస్​ జాతి మొక్కలు ఎడారి ప్రాంతంలో, ఊరి బయట కనిపిస్తుంటాయి. కానీ, ఈ ఊళ్లో మాత్రం ఎంచక్కా పూల చెట్ల తీగలు అల్లుకున్నట్టే గోడను ఆనుకుని కాక్టస్​ మొక్కలు పెరిగాయి. అవి ముట్టుకుంటే గుచ్చుకుంటాయనే భయమే తప్ప.. వీధి వెంట నడిచేటప్పుడు చూడ్డానికి మాత్రం అందంగా కనిపిస్తాయి. కాకపోతే  ఊళ్లో ఏ దారిలో నడిచినా అదంతా కొండప్రాంతమే కావడం వల్ల దారి మొత్తం ఎగుడుదిగుడుగా ఉంటుంది. కాబట్టి అక్కడ నడవగలిగేందుకు వీలుగా ఉండే బూట్లను వాడితే బెటర్. 
 నియజ్చ్​​ పాత్ 
సన్నని నడకదారుల వెంట వీధుల్లో నడుస్తుంటే మధ్యయుగకాలానికి వెళ్లొచ్చినట్లు ఉంటుంది. నియజ్చ్​​ పాత్.. 2.6 మైళ్ల దూరం ఉండే అందమైన రహదారి. అక్కడ నడుస్తుంటే మంచి ఎక్సర్​సైజ్ అవుతుంది. అది కొండ ఎక్కినట్లు ఉంటుంది. కాబట్టి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కచ్చితంగా హైకింగ్​కి వీలుగా ఉండే షూ వేసుకోవాలి. 
ఇవీ ఉన్నాయి.. 
ఇక్కడ షాప్​లు, హోటళ్లు, గ్యాలరీలు చాలా ఉంటాయి. రెండు పెద్ద హోటళ్లు ఇక్కడ పాపులర్. వాటిలో ఒకటి ‘చాటీ’ అనే బొటిక్ హోటల్. ఇది 400 ఏండ్ల నాటిది. కొండ ప్రాంతంలో ఉన్న ఈ హోటల్ రూమ్​లు చాలా బాగుంటాయి. సముద్రాన్ని చూస్తూ హ్యాపీగా రిలాక్స్ అవ్వొచ్చు. రెండో హోటల్ పేరు ‘చాటీ డి లా చెవ్రె డి అర్’. ఇది బ్యూటిఫుల్ గార్డెన్​లకు ఫేమస్. ఇక్కడ జంతువుల బొమ్మలు కూడా ఉన్నాయి. తినడానికి, తాగడానికి కొదవ ఉండదు. 
ఎందుకెళ్లాలి?
ఎజ్​.. మొనాకో, నైస్​ సిటీకి మధ్యలో ఉంది. కాబట్టి ఒక్కరోజులో వెళ్లి రావచ్చు. ఆ రెండు సిటీల నుంచి ఎజ్​ వెళ్లి, ఒక్కరోజులో ట్రిప్ కంప్లీట్ చేయొచ్చు. ఒక వేళ ఎజ్​కి వెళ్లకుండా నైస్ లేదా మొనాకో ట్రిప్ వేసి, ఇంకా రెండు రోజులు స్టే చేయాలి అనుకుంటే అప్పుడైనా సరే ఎజ్​ని చూడొచ్చు. అంతేకాదు ఒకే రోజులో వీధుల్లో నడుస్తూ, ఆర్కిటెక్చర్​ గమనిస్తూ ట్రిప్ కంప్లీట్ చేయొచ్చు. 
ఎలా వెళ్లాలి?
ముంబై, హైదరాబాద్ నుంచి ఫ్రాన్స్​లోని నైస్ సిటీకి విమానంలో వెళ్లొచ్చు. నైస్​ సిటీలో బస్టాప్ ట్రైన్ స్టేషన్​కి దగ్గరే కాబట్టి ట్రైన్ లేదా బస్​లో ఎజ్​కి వెళ్లొచ్చు. ఈ ట్రిప్​కి దాదాపు పాతిక నుంచి 75 వేల లోపు ఖర్చవుతుంది.
ఎజ్​ అంటే​...
ఎజ్​ అనే పేరు ‘సెయింట్ లారెంట్ ఆఫ్​ ఎజ్’​ అని మొట్టమొదటిసారిగా సముద్రానికి సంబంధించిన పుస్తకాల్లో కనిపించింది. ఎజ్ జనాభా 2019 ప్రకారం 2,256 మంది. అక్కడ నివసించే వాళ్లని ‘ఎజస్కెస్​’ అని పిలుస్తారు. ఆ పదం ఆడ, మగ ఇద్దరికీ వర్తిస్తుంది. ఫ్రెంచ్​లో ఎజ్ అంటే కన్ను. ఈ విలేజ్​కి ఒక స్లోగన్​ ఉంది. అదేంటంటే... ‘ఐసిస్ మోరియెండొ రెనాస్కర్’ ‘చావులోనూ నేను తిరిగి జన్మిస్తా’ అని దాని అర్థం. ఈ ఊరి గుర్తు చావురాని ఫినిక్స్ అనే పక్షి. క్రీ.పూ. మూడో శతాబ్దానికి సంబంధించిన గ్రీక్​ సిల్వర్ ఫియలె ఎజ్​లో కనిపించింది. ఫియలె అంటే అలనాటి పాత్ర. అది ఇప్పుడు బ్రిటీష్ మ్యూజియంలో ఉంది. 
ఎజ్ ఎలా ఏర్పడింది? 
క్రీ.పూ. దాదాపు 2000 సంవత్సర కాలంలో ఎజ్​లో ప్రజలు నివసించారు. అదే సమయంలో ఈ ప్రాంతానికి రోమన్లు, మూర్​లు వచ్చారు. వాళ్లు దాదాపు 80 ఏండ్లు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత విలియం ఆయన సహచరులతో వాళ్లని తరిమేశాడు.1388లో హౌస్ ఆఫ్ సవోయ్ అధికారంలోకి వచ్చింది. అప్పుడే నైస్‌‌‌‌‌‌‌‌కు దగ్గర్లో ఉంటుందని ఆ ఊరికి కోటను నిర్మించాడు.

1543లో హేరెద్దీన్ బార్బరోస్సా ఆదేశాల మేరకు ఫ్రెంచ్, టర్కిష్ దళాలు ఈ గ్రామాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి.1706లో స్పానిష్ వారసత్వ యుద్ధంలో లూయిస్ నగరం చుట్టూ ఉన్న గోడలను ధ్వంసం చేయడంతో చరిత్ర తరువాతి కొన్ని శతాబ్దాలలో చాలాసార్లు మారిపోయింది. చివరగా ఏప్రిల్1860లో, ప్రజల నిర్ణయంతో ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌లో భాగమైంది.