కర్ణాటక ఎన్నికలు.. ఈవీఎంతో పట్టుబడ్డ బీజేపీ నేత?

కర్ణాటక ఎన్నికలు..  ఈవీఎంతో పట్టుబడ్డ బీజేపీ నేత?

కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా, ఆ రాష్ట్రానికి చెందిన ఓ వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో ఒక కారు చుట్టూ కొంతమంది గుమికూడి ఉండగా.. వీరిలో కొందరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను (EVM) ధ్వంసం చేయడం చూడవచ్చు. ఈ వీడియోతో పాటు “బీజేపీ నాయకుడి కారులో ఈవీఎం మెషిన్ కనిపించడంతో స్థానికులు రచ్చ సృష్టించారు” అని “కర్ణాటక ఎలక్షన్స్” అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాటు ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. అదే తరహాలో చాలా మంది ఈ వీడియోను షేర్ చేశారు.

గుజరాత్ చెందిన  కాంగ్రెస్‌ నేత హితేంద్ర పితాదియా సైతం ట్విట్టర్‌లో ఈ వీడియోను పంచుకున్నారు. దాంతో పాటు“బీజేపీ నాయకుడి కారులో ఈవీఎంలు కనిపించడంతో స్థానికులు రచ్చ సృష్టించారు!” అని హిందీలో రాసుకొచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమన్వయకర్త ప్రశాంత్ ఆనంద్ కూడా ఈ వీడియోను షేర్ చేశారు. “చూడండి, బీజేపీ నాయకుడి కారులో EVM కనిపించిన వెంటనే ప్రజల ఆగ్రహం. మోడీ అబద్ధాల వల్ల ప్రజలు ఎంతగా కలవరపడ్డారంటే, బీజేపీని తొలగించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇది 2024 ట్రైలర్ లాగా ఉంది." లాంటి క్యాప్షన్ లతో ఈ వీడియోను పలువురు పోస్ట్‌ చేశారు.

వీటిపై నిజ నిర్థారణ సర్వే నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్.. ఈ వైరల్ వీడియో తప్పుదారి పట్టించేలా ఉందని దర్యాప్తులో పేర్కొంది. భారతీయ జనతా పార్టీ నేత కారు నుంచి ఈవీఎంలు స్వాధీనం చేసుకోలేదని, ఆ కారు డ్యూటీలో ఉన్న పోలింగ్ అధికారికి చెందిందని ఫ్యాక్ట్ చెక్ తేల్చి చెప్పింది.

కర్ణాటకలోని విజయపుర జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల రోజున, మసబినాల గ్రామంలోని నివాసితులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తీసుకువెళుతున్న పోల్-డ్యూటీ వాహనాన్ని ఆపివేశారని వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో 23 మందిని అరెస్టు చేశారని కూడా కొన్ని మీడియా సంస్థలు వార్తను ప్రచురించాయి. దీనికి సంబంధించి ఓ ట్వీట్ వైరల్ గా మారగా.. దీనిపై విజయపుర జిల్లా డిప్యూటీ కమిషనర్ అధికారికంగా స్పందించారు. ఈ వార్త తప్పని, నిజానికి సెక్టార్ ఆఫీసర్ వాహనాన్ని  గ్రామస్థులు ఆపి,  ఈవీఎంలను పాడు చేశారని, ఈ ఘటనలో వారిపై కేసు నమోదు చేసి 24 మందిని అరెస్టు చేశారని చెప్పారు.

ఆ విధంగా వైరల్ వీడియోలో కనిపిస్తున్న కారు బీజేపీ నాయకుడికి చెందినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.