
దేశంలో కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తోందో అంతకన్నా స్పీడ్ గా కరోనా గురించి కొత్త కొత్త వదంతులు వ్యాపిస్తున్నాయి. కరోనా వైరస్ స్ప్రెడ్, వ్యాధి నివారణ, వైద్యం ఇలా రకరకాల అంశాల గురించి రోజుకో రకమైన ఫేక్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ గా మరో రూమర్ మొదలైంది. కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 నుంచి మే 3 వరకు పొడిగించిన లాక్ డౌన్ అక్కడితో ఆగదని, ఆ తర్వాత కూడా కొనసాగుతుందని ఓ న్యూస్ చానెల్ ప్రసారం చేసింది. మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ పొగిగించాలని కరోనాపై నియమించిన నేషనల్ టాస్క్ ఫోర్స్ ఇప్పటికే ప్రధాని మోడీకి రిపోర్ట్ అందించిందని వార్త టెలికాస్ట్ చేసింది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వ మీడియా విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పందించింది. PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఈ వార్తలో నిజం లేదంటూ ట్వీట్ చేసింది. మే 3 తర్వాత లాక్ డౌన్ పొడిగించాలంటూ ఎటువంటి రిపోర్ట్ ప్రధానికి అందలేదని స్పష్టం చేసింది.
#PIBFactCheck News9 channel reported today that National Task Force has submitted its report to PM @narendramodi suggesting extension of national #lockdown Fact: there is no truth in this reportage by @NEWS9TWEETS @PMOIndia
— PIB India #StayHome #StaySafe (@PIB_India) April 22, 2020
కరనా వైరస్ కట్టడి కోసం గత నెల 24 అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 14 వరకు తొలుత ప్రధాని మోడీ లాక్ డౌన్ విధించారు. అయితే ఆ గడువు ముగిసే సమయానికి కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో లాక్ డౌన్ ను మళ్లీ మే 3 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత వారంలో దీనిపై మోడీ ప్రకటన చేశారు. అయితే కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏప్రిల్ 20 నుంచి కొన్ని ఆంక్షలను సడలిస్తూ ఏప్రిల్ 15న ఉత్తర్వులిచ్చింది కేంద్ర హోం శాఖ. ఆ తర్వాత ఏప్రిల్ 19న తెలంగాణలో పరిస్థితిపై రాష్ట్ర కేబినెట్ భేటీ నిర్వహించిన సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో ఎటువంటి ఆంక్షలు ఉండబోవని ప్రకటించారు. కరోనాను కట్టడి చేసేందుకు మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.