పోలీసులకు iBomma వార్నింగ్ వార్తల్లో నిజమెంత..? FactCheck Telangana క్లారిటీ

పోలీసులకు iBomma వార్నింగ్ వార్తల్లో నిజమెంత..? FactCheck Telangana క్లారిటీ

కొన్ని మీడియా కథనాలు మరియు సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, సినిమా పైరసీ సైట్ iBomma తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసి, గోప్యమైన ఫోన్ నంబర్లను లీక్ చేస్తామని బెదిరించిందని చెబుతున్నారు. అయితే, ప్రసారం అవుతున్న స్క్రీన్‌షాట్‌లు 2023 నాటివి మరియు అవి పోలీసులకు కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినవే. దీనిని స్పష్టం చేస్తూ, తెలంగాణ పోలీసులకు ఇలాంటి ఎటువంటి బెదిరింపు రాలేదని తెలియజేస్తున్నామని FactCheck Telangana ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రజలు సోషల్ మీడియాలో పోస్టు చేసే, షేర్ చేసే విషయాల్లో జాగ్రత్త వహించాల్సిందిగా ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ సూచించింది.

పైరసీ వెబ్ సైట్ 'ఐబొమ్మ' నిర్వాహకుడు ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడ కూడా గాలించారు. అయితే, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో కచ్చితంగా తెలియడం లేదని, అతను విదేశాల్లో ఉండి ఈ కార్యకలాపాలు నిర్వహిస్తుండవచ్చని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అతడిని అరెస్ట్ చేసి సినీ పరిశ్రమకు ఊరటనిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఐ బొమ్మ కోసం ఇతర రాష్ట్రాల్లో ఏజెంట్లు పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం గాలింపులు ముమ్మరం చేశారు.