
- గురువారం రాత్రి మోటార్‌తో నీళ్లు ఎందుకు విడుదల చేసినట్టు?
- రైతులను మిస్లీడ్ చేస్తున్నది ఎవరు?
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం పక్కనే ఉన్న నందిమేడారం రిజర్వాయర్ ఎండిపోతున్నదనేది నూటికి నూరుపాళ్లు నిజం. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఈనెల నాల్గో తేదీన ‘‘పక్కనే కాళేశ్వరం.. ఎండుతున్న నందిమేడారం”అనే హెడ్డింగ్‌తో ‘వెలుగు’లో వార్త పబ్లిష్ అయ్యింది. ఇది ఫేక్ న్యూస్ అని, రైతులను మిస్లీడ్ చేస్తున్నారని ‘ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ’ పేరుతో సర్కారు నడిపే ట్విట్టర్ పిట్ట కూసింది. 0.75 టీఎంసీల కెపాసిటీ ఉన్న నందిమేడారంలో ఈనెల నాలుగో తేదీ (బుధవారం) నాటికి 0.23 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన పంపుహౌస్ కన్నెపల్లితో పాటు అన్నారం పంపుహౌస్‌లు నీట మునిగింది కూడా నిజం.
అడిషనల్ టీఎంసీ కోసం తెప్పించిన ప్యానల్ బోర్డులు, ఇతర సాంకేతిక పరికరాలను అక్కడికి తరలించి కన్నెపల్లి, అన్నారం పంపుహౌసుల్లో కొన్ని మోటార్లను మాత్రమే పునరుద్ధరించింది నిజం. ఒకవేళ ‘వెలుగు’ పబ్లిష్ చేసిన వార్త తప్పే అయితే, గురువారం రాత్రి ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించి.. నందిమేడారం పంప్‌హౌస్‌లో ఒక మోటారు కొన్ని గంటలు నడిపి ఎందుకు నీళ్లు విడుదల చేసినట్టు?. ‘ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ’ పేరుతో సర్కారు నడిపించే ట్విట్టర్ అకౌంట్ ‘వెలుగు’పై విషం కక్కడం ఇదే మొదటిసారి కాదు. 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు విషయంలోనూ ఇలాంటి అబద్ధాలతోనే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. సర్పంచుల ఆందోళనలతో దిగివచ్చి వారికి డిజిటల్ కీలను తిరిగి ఇవ్వడంతో ప్రభుత్వం చేసిన తప్పు బట్టబయలైంది. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేసింది.