
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల వేళ నకిలీ మద్యం కలవరపెడుతున్నది. ఒకవైపు జోరుగా ప్రచారం సాగుతుంటే.. ఇంకోవైపు నకిలీ లిక్కర్ దందా కూడా అంతకంటే జోరుగా నడుస్తున్నది. ప్రచారంలో పాల్గొనే జనానికి, ఓటర్లకు ఈ నకిలీ మద్యాన్ని అంటగడుతున్నట్లు తెలిసింది. ఫ్రీగా వస్తుందని ఇలాంటి లిక్కర్ తాగితే ప్రాణాలకే ముప్పని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు లీడర్లు లిక్కర్‌ను సప్లై చేస్తుంటారు. క్యాంపెయినింగ్లో కార్యకర్తలకు, తిరిగే జనానికి బిర్యానీ ప్యాకెట్లతో పాటు లిక్కర్ బాటిళ్లను ఇస్తుంటారు. అయితే వాటిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? అది ఒరిజినలా.. నకిలీనా.. అనేది ఎవరికీ తెలియడం లేదు. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అక్రమార్కులు నకిలీ లిక్కర్‌ను మార్కెట్ లోకి విచ్చలవిడిగా విడుదల చేస్తున్నారు.
ఆ మద్యాన్నే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేవాళ్లకు, ఓటర్లకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు. మునుగోడు బైపోల్ టైమ్‌లోనూ మద్యం ఏరులై పారింది. అప్పుడు కూడా నకిలీ లిక్కర్ సప్లయ్ అయినట్లు కొందరు అధికార పార్టీ లీడర్లే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లోనూ నకిలీ లిక్కర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సంచలన కామెంట్స్ చేశారు. అధికార పార్టీ లీడర్లు నకిలీ లిక్కర్‌ను సరఫరా చేస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆమె మండిపడ్డారు.
పలు రకాల బ్రాండ్లతో..!
ఎన్నికల్లో మద్యం సరఫరా చేసేందుకు అడ్డాలు పెట్టుకుని మరీ నకిలీ లిక్కర్‌ను అక్రమార్కులు తయారు చేస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా పేదలు, మధ్యతరగతి వాళ్లు తాగే రూ.వెయ్యి లోపు ధర ఉన్న మద్యం బ్రాండ్లే ఎక్కువగా కల్తీ చేస్తున్నారు. వాటిని పలురకాల బ్రాండ్లతో అమ్ముతున్నారు. తనిఖీల్లో భాగంగా ఈసీ ఇప్పటి వరకు లక్షా 10 వేల లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేసింది. ఇందులో 30 శాతం వరకు నకిలీ బ్రాండ్ లిక్కరేనని అధికారులు గుర్తించినట్లు తెలిసింది. సింగరేణిలోని గోదావరిఖని, మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో.. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారవుతున్నట్లు ఎక్సైజ్ వర్గాలు అంటున్నాయి.
నేరుగా గ్రామాల్లోకి..!
నకిలీ మద్యం తయారు చేస్తున్న కొన్ని ముఠాలు.. తక్కువ ధరకే వాటిని సరఫరా చేస్తున్నాయి. గ్రామాల్లో లీడర్లను, వారి అనుచరులను సంప్రదించి వారికి కొంత కమీషన్ ఇచ్చి, పెద్ద మొత్తంలో నకిలీ లిక్కర్‌ను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సీజన్ కావడంతో పార్టీలు, అభ్యర్థులు ఇంటింటి ప్రచారం సాగిస్తున్నారు. కార్నర్ మీటింగ్‌లు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వీటికి జనసమీకరణ చేయడంతో పాటు రోజువారీగా కార్యకర్తలను తమ వెంట తిప్పుకుంటున్నారు. అడ్డా కూలీలు, సీజన్ పని లేకుండా ఉన్నోళ్లు ఎలక్షన్ క్యాంపెయిన్‌కు జోరుగా వెళ్తున్నారు. వీరికి బిర్యానీ ప్యాకెట్లతోపాటు లిక్కర్‌ను లీడర్లు సమకూరుస్తున్నారు. ఇట్ల లిక్కర్‌కు ఎక్కువగా డిమాండ్ ఉండటంతో అక్రమార్కులు తాము తయారు చేసిన నకిలీ మద్యాన్ని చోటామోటా లీడర్ల ద్వారా జనంలోకి వదులుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా 70 శాతం కల్తీ బాటిళ్లు, 30 శాతం ఒరిజినల్ బ్రాండ్లతో కలిపి అన్నీ ఒరిజినల్ అని నమ్మేలా సరఫరా చేస్తున్నారు. తక్కువ ధరకే వస్తుండటంతో పార్టీలు, అభ్యర్థులు కూడా ఇవేమీ ఆలోచించకుండా ఓకే చెప్తున్నారు.
సగం ఒరిజినల్.. సగం డూప్లికేట్
రాష్ట్రంలో రోజూ యావరేజ్‌గా దాదాపు రూ. 100 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరుగుతుంటాయి. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం వివిధ రకాలుగా లిక్కర్ సేల్స్ పెంచే ప్రయత్నం చేసింది. చెక్కులు తీసుకుని కూడా వైన్స్‌కు లిక్కర్ సప్లయ్‌ని పెంచింది. దీంతో ఆదాయం డబుల్ అయింది. చాలా మంది వైన్స్ ఓనర్లు ఎన్నికల కోసం పెద్ద మొత్తంలో లిక్కర్‌ను ముందస్తుగా డంప్ చేసుకున్నారు. ఇప్పుడు కొందరు ఆ సీసాల్లో సగం లిక్కర్ ఖాళీ చేసి.. ఇంకో సగంలో లిక్కర్ కలర్ వచ్చేలా వివిధ రకాల కెమికల్స్‌ను, చీప్ లిక్కర్‌ను కలిపి అమ్ముతున్నారు.
రెక్టిఫైడ్ స్పిరిట్‌తో కూడా నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. పలురకాల బ్రాండ్లకు చెందిన మూతలు, లేబుళ్లను కొనుగోలు చేసి, పాత సీసాల్లో రెక్టిఫైడ్ స్పిరిట్‌ను నింపి, వాటిలో మద్యం రంగు వచ్చే విధంగా క్యారామాల్ లిక్విడ్‌ను కలిపి ప్యాక్ చేస్తున్నారు. వీటిని ఎక్కువగా బెల్టుషాపులకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఇలా నెల రోజుల వ్యవధిలోనే నకిలీ మద్యం దందా వందల కోట్ల రూపాయల్లో నడిచినట్లు ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.