బాంబు బెదిరింపుల కలకలం..జేఎన్టీయూ, ఆల్ ఇండియా రేడియోలకు ఫేక్ మెయిల్స్

బాంబు బెదిరింపుల కలకలం..జేఎన్టీయూ, ఆల్ ఇండియా రేడియోలకు ఫేక్ మెయిల్స్

కూకట్​పల్లి/సైఫాబాద్: నగరంలోని రెండు కీలక ప్రాంతాలకు మంగళవారం బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. కూకట్​పల్లిలోని జేఎన్టీయూ క్యాంపస్​తో పాటు అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు. మంగళవారం ఉదయం జేఎన్టీయూ కార్యాలయానికి ఒక ఈ-మెయిల్ వచ్చింది. అందులో క్యాంపస్​లో బాంబులు పెట్టినట్లు హెచ్చరించడంతో వర్సిటీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కలిసి అంగుళం అంగుళం తనిఖీ చేశారు. క్లాస్ రూమ్​లు, ఆడిటోరియం, హాస్టళ్లలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అనంతరం ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఆల్ ఇండియా రేడియో కార్యాలయంలో ఉద్రిక్తత

మరోవైపు, సైఫాబాద్ పరిధిలోని ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి మధ్యాహ్నం 1:50 గంటల సమయంలో గాయత్రి షాబాద్ సయ్యద్ పేరిట ఒక మెయిల్ వచ్చింది. కార్యాలయంలో విషవాయువులతో కూడిన 13 బాంబులను పేల్చుతామని, ముస్లిం ఉద్యోగులను మాత్రమే బయటకు పంపాలని ఆ మెయిల్​లో పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు వెంటనే కార్యాలయాన్ని ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. గంట పాటు సాగిన గాలింపులో ఎలాంటి బాంబులు దొరకకపోవడంతో అది ఫేక్ మెయిల్ అని నిర్ధారించారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి, మెయిల్స్ పంపిన ఆగంతకులను గుర్తించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.