రూ. 60 లక్షల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత : ఎస్పీ డీవీ శ్రీనివాస రావు

రూ. 60 లక్షల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత : ఎస్పీ డీవీ శ్రీనివాస రావు

కాగజ్ నగర్, వెలుగు: కర్ణాటక రాష్ట్రం నుంచి రూ. 60 లక్షల విలువ చేసే 20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం ఉదయం పట్టుకున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు.  కాగజ్‌నగర్‌‌ రూరల్ పోలీస్‌ స్టేషన్‌లో  ప్రెస్ మీట్‌లో ఎస్పీ వివరాలు వెల్లడించారు.  కాగజ్‌నగర్‌‌కి చెందిన కొత్తపల్లి సదాశివ అనే వ్యక్తి నకిలీ బీటీ విత్తనాలను అమ్ముతున్నట్టు సమాచారం అందింది.  దీంతో పెద్దవాగు వద్ద వ్యానును ఆపి తనిఖీ చేయగా.. 20 క్వింటాళ్ల నిషేధిత బీటీ 3 రకం విత్తనాలు పట్టుబడ్డాయి.  కర్నూల్ జిల్లాకు చెందిన డ్రైవర్ పుప్పాల లక్ష్మణ్‌ను విచారించగా..  సదాశివ్ పేరు చెప్పాడు.  

కొత్తపల్లి సదాశివ్,  కరీంనగర్ జిల్లా మర్రిగడ్డకి చెందిన వేణుగోపాల్ రెడ్డి,  డ్రైవర్ సంతోష్  ఓ వాహనం లో నకిలీ విత్తనాలు కర్ణాటక నుంచి తీసుకొచ్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో సదాశివ్, వేణుగోపాల్ రెడ్డితో పాటు మహారాష్ట్రలోని అహేరికి చెందిన సంతోష్, కిశోర్ లపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. వేణుగోపాల్ రెడ్డి పరారీలో  ఉన్నాడన్నారు.   నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులను ఎస్పీ అభినందించారు. ప్రెస్‌మీట్‌లో డీఎస్పీ రామానుజం, టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్, రూరల్ సీఐ శ్రీనివాసరావు, రూరల్ ఎస్సై సందీప్, సిబ్బంది పాల్గొన్నారు.